పులకించిన నేలతల్లి

ABN , First Publish Date - 2022-07-06T06:10:29+05:30 IST

జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. 13.1 మిమీ వర్షపాతం నమోదైంది.

పులకించిన నేలతల్లి
పెద్దహ్యాట వద్ద వర్షపునీటిలో మునిగిన పత్తి పంట

 జిల్లాలో 13.1 ఎంఎం వర్షపాతం నమోదు

కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 5: జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. 13.1 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో 4లక్షల హెక్టార్లలో ప్రస్తుత ఖరీ్‌ఫలో పంటలు సాగు చేయాల్సి ఉన్నా.. ఇప్పటి దాకా సరైన వర్షం లేక కేవలం 30వేల హెక్టార్లల్లోనే పంటలు సాగయ్యాయి. మంగళవారం నాటి వర్షం కొంత ఊరటనిచ్చింది. కర్నూలు రూరల్‌లో 70.2 ఎంఎం,  అర్బనలో 51, హొళగుందలో 30.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కల్లూరులో 25 ఎంఎం, ఆలూరులో 22.4 ఎంఎం, ఎమ్మిగనూరులో 21.2, గూడూరులో 21.2, సీ.బెళగల్‌లో 21, ఓర్వకల్లులో 20, ఆస్పరిలో 14, ఆదోనిలో 9.2, హాలహర్విలో 6.4, వెల్దుర్తి, మద్దికెర మండలాల్లో 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

కర్నూలు(కల్చరల్‌), జులై 5: నగరంలో మంగళవారం మధ్యా హ్నం నుంచి నాలుగు గంటల పాటు వర్షం  దంచి కొట్టింది.  దీంతో నగర రోడ్లన్నీ జలమయయ్యాయి. నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. పలుచోట్ల రోడ్లు పిల్ల కాలువలను తలపించాయి.  కిడ్స్‌ వరల్డ్‌, బుధవారపేట, వడ్డెగేరి, ఉస్మానియా కళాశాల రోడ్డు, ప్రకాశనగర్‌, అశోక్‌నగర్‌ రైల్వే బ్రిడ్డ్‌ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

ఫ  వాన కురిస్తే కష్టం...

నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు దుర్భరంగా మారుతున్నాయి.   వర్షంనీరు నిలువ ఉండటంతో రోడ్ల మీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మురుగునీటి కాలువలను  ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో వర్షం కురిస్తే మురుగు రోడ్డెక్కి పారుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో,  ఇతరత్రా చెత్తతో కాలువలు నిండిపోతున్నాయి.  

హొళగుందలో...

హొళగుంద, జూలై 5: మండలంలోని పెద్దహ్యాట, ఎల్లార్తి, సులువాయి, సమ్మతగేరి, నగరకన్వి, హొన్నూర్‌ గ్రామాలతో పాటు హొళగుందలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పెద్దహ్యాటలో పత్తి పంట పొలాలు వర్షం నీటిలో మునిగిపోయాయి. సమ్మతగేరి గ్రామ శివారులో వాగు పొంగడంతో హొళగుంద నుంచి సులువాయికి రాకపోకలు నిలిచిపోయాయి.  


Updated Date - 2022-07-06T06:10:29+05:30 IST