బేతంచెర్లలో ఉత్కంఠ పోరు

ABN , First Publish Date - 2021-11-15T06:11:46+05:30 IST

ప్రతిష్టాత్మకంగా మారిన బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపెవరిదో అన్నది ఉత్కంఠగా మారింది.

బేతంచెర్లలో ఉత్కంఠ పోరు

  1. ఆర్థిక మంత్రి బుగ్గనకు సొంతూరు
  2. ధర్మవరం సుబ్బారెడ్డికి తొలి పరీక్ష
  3.  అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ
  4. నేడు పోలింగ్‌.. ఏర్పాట్లు పూర్తి


డోన్‌, నవంబరు 14: ప్రతిష్టాత్మకంగా మారిన బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపెవరిదో అన్నది ఉత్కంఠగా మారింది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాఖా కావడంతో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం అనూహ్య రీతిలో పుంజుకుందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డి ఇటీవలే బాధ్యతలు తీసుకు న్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డోన్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కోట్ల, కేఈ కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను పార్టీ బాధ్యతలు తీసుకున్నానని ధర్మవరం సుబ్బారెడ్డి ప్రకటించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సొంతూరులో ఎన్నికలు కావడం ధర్మవరం సుబ్బారెడ్డి చాలెంజ్‌గా తీసుకున్నారు. బుగ్గన ఆధిపత్యంలో ఎప్పుడూ పోటీ లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు సాగేవి. కానీ బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో రాజకీయం పూర్తిగా మారిపోయింది. టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తన వ్యూహాలతో ఎన్నికల్లోని అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలపడంలో సక్సెస్‌ అయ్యారు. వార్డుల్లో ప్రచారాలు, ప్రతి ఇంటి తలుపు తట్టి ఓట్లు అడగడం ద్వారా టీడీపీ పుంజుకునేలా చేశారు. పార్టీ కీలక నాయకుల ప్రచారాలు సఫలమయ్యాయి. టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురు అవుతుండటంతో ఈ ఎన్నికలు అధికార వైసీపీకి అగ్నిపరీక్షగా మారాయి.


ఆ ఇద్దరి మధ్యనే పోటీ 


గతంలో ఎన్నడూ లేని విధంగా బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు నాయకుల మధ్యే పోటీ నడుస్తోంది. బేతంచెర్ల స్థానిక ఎన్నికలలో పోటీ ఎప్పుడూ నామమాత్రంగా ఉండేది. అయితే ఈసారి ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా.. ఇద్దరు నాయకుల మధ్య పొలిటికల్‌ వార్‌ గురించే చర్చ నడుస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన, టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మధ్య అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పోటీ నడుస్తోందని రాజకీయవర్గాలు అంటున్నాయి. మంత్రి బుగ్గన బేతంచెర్లలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పక్క అక్కడ పాగా వేయాలని ధర్మవరం సుబ్బారెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.


నేడే పోలింగ్‌ 


బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 20 వార్డులకు 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టణంలో 30,092 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 14,526 మంది, మహిళలు 15,562 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. 


స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్‌ 


కర్నూలు(కలెక్టరేట్‌): నగర పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కోటేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బేతంచెర్లలో 20 వార్డులకు, నందికొట్కూరు 10వ వార్డుకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు, భయాందోళనలకు గురి కాకుండా తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు కల్పించామని తెలిపారు. వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్లు మాస్కు ధరించి, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని కోరారు. 


Updated Date - 2021-11-15T06:11:46+05:30 IST