ప్లాస్టిక్‌ని పాతరేసేనా?

ABN , First Publish Date - 2022-08-15T05:52:41+05:30 IST

టన్నుల కొద్ది పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించింది.

ప్లాస్టిక్‌ని పాతరేసేనా?
ప్లాస్టిక్‌ కవర్లలోనే నిత్యవసర వస్తువులు, కూరగాయాలు తీసుకెళ్తున్న దృశ్యాలు

- ప్రభుత్వం ఆదేశించగానే ఆగమేఘాల మీద దాడులు

- ఆ తర్వాత అంతా షరా మామూలే..

- పర్యావరణానికి పెనుసవాళ్లుగా మారుతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులు

- కామారెడ్డిలో పూర్తిస్థాయిలో నిషేధించని సింగిల్‌యూజ్‌ వస్తువులు

- ప్లాస్టిక్‌ రహిత కామారెడ్డిగా మార్చేందుకు అంతంత మాత్రంగానే చర్యలు


కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 14: టన్నుల కొద్ది పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించింది. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమే ఆలస్యం ఆగమేఘాలమీద దాడులు చేస్తూ ఒకటి రెండు దుకాణదారులకు జరిమానాలు విధించడం ఆపై దాడులకు ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో అమ్మకందారులకు కూడా ఇదే ఎప్పుడు ఉండేదే కదా అంటూ కొద్దిరోజులు ఉరుకుని మళ్లీ షరా మామూలుగానే ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లను విచ్చలవిడిగా అమ్మకాలు, వినియోగదారులకు అందులో వస్తువులను అందిస్తున్నారు. వాటిని నివారించాల్సిన అధికారులు ఎప్పటిలాగే దాడులు తగ్గించి పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు ఆయా గ్రామ పంచాయతీల్లో సైతం ఇప్పటికీ విక్రయాలు కొనసాగుతునే ఉన్నాయి.

అధికారుల అలసత్వంతో పూర్తిస్థాయిలో నిషేధం కరువు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యాపార సంస్థలు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు మార్కెట్‌, మాంసాహార విక్రయదారుల్లో చాలా మంది ఇప్పటికీ సింగిల్‌ యూజ్‌ కవర్లు వినియోగిస్తునే ఉన్నారు. గత నెలలో అధికారులు దాడులు చేస్తున్నారనే సమాచారం మేరకు ఆయా దుకాణ సముదాయాల నిర్వాహకులు, పలువురు కూరగాయాల విక్రయాదారులు జనపనారతో పాటు ఇతర కవర్లను ఉపయోగంలోకి తీసుకువచ్చి వారి దుకాణాల వద్దకు వచ్చిన వారికి వస్తువులను వేసి తాము ప్లాస్టిక్‌ నిషేధానికి పూర్తిగా సహకరిస్తున్నామని నటించారే తప్ప ఎక్కడ నిషేధానికి సహకరించిన దాఖాలాలు ప్రస్తుతం కనిపించడం లేదు. పైగా కవర్లను బహిరంగగానే డెస్క్‌లలో ఉంచి మరీ మాంసం, కూరగాయలను అందజేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం ఉంది కదా అని ప్రశ్నిస్తే ఇతర క్యారీబ్యాగ్‌లకు అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని కవర్లకైతే తక్కువ ధర ఉంటుందని పేర్కొంటుండడం గమనార్హం. అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్లే ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరికలు నిషేధానికి ఆదేశాలు జారీ చేసిన ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం తగ్గడం లేదని తెలుస్తుంది.

ప్రజల్లోనూ కనిపించని చైతన్యం

మున్సిపల్‌ పరిధిల్లో ప్లాస్టిక్‌ నిషేధంపైనా పెద్దగా చైతన్యం కనిపించడం లేదు. ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లేటప్పుడు బట్ట సంచులు తీసుకెళ్లాలనే ఆలోచన పెరగడం లేదు. చెత్తసేకరణ సమయంలో మైక్‌లతో అవగాహన కల్పిస్తున్నా అసలు ఆ దిశగా అడుగులు పడడం అనేదే కనిపించడం లేదు. మున్సిపాలిటీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ కవర్లను వాడితే భారీగా జరిమానాలు విధిస్తారు. దుకాణాల్లో దొరికితే రూ.2500 నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించడంతో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ పట్టుబడిన వారికి రూ.250 నుంచి 500వరకు జరిమానా విధిస్తారు. పండుగలు, ఇతర శుభకార్యాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ వాడుతూ దొరికితే రూ.50వేల వరకు జరిమానా వేస్తారు. ప్రతీ పౌరుడు ప్లాస్టిక్‌ నిషేధంపై స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రతీ ఇంట్లో వివిధ అవసరాలకు వినియోగించేలా నూలు, జనపనార సంచులు కొనుగోలు చేయాలని, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు విధిగా బట్ట సంచులు వెంట తీసుకుపోతూ ప్లాస్టిక్‌ భూతాన్ని తరమికొట్టేందుకు సహకరించాలని కోరుతున్నా ప్రజల్లో మాత్రం అంతంత మాత్రంగానే మార్పు కనిపిస్తోంది.


ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

- దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

ప్రభుత్వం గతనెల 1 నుంచి సింగిల్‌యూజ్‌ వస్తువులు, కవర్లపై నిషేధం విధించింది. ఇప్పటికీ ఆయా చోట్ల దాడులు చేస్తూ భారీ జరిమానాలు విధిస్తున్నాం. తాము దాడులు నిర్వహించినప్పుడు ప్లాస్టిక్‌ వస్తువుల అమ్మకాలు, కవర్ల వినియోగం కనిపిస్తే మాత్రం భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రజలు సైతం తమ వంతు బాధ్యతను నెరవేర్చాలి.

Updated Date - 2022-08-15T05:52:41+05:30 IST