నివర్‌... వణుకు!

ABN , First Publish Date - 2020-11-27T03:45:35+05:30 IST

నివర్‌ తుపాన ప్రభావం జిల్లాపై పడింది. రైతన్నలు అవస్థలు పడ్డారు. వరి పంటకు నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో వరి పంట వర్షానికి తడిసిపోయింది. గురువారం ఉదయం చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. చల్లటి గాలులతో అంతటా చలి వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించారు.

నివర్‌... వణుకు!
విజయనగరం సమీపంలో తడిచిన వరి పనలు


రోజంతా చిరుజల్లులు

వణికించిన గాలులు

చిగురుటాకులా తీరం

వరి పంటకు అపార నష్టం

ఆందోళనలో రైతులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

 నివర్‌ తుపాన ప్రభావం జిల్లాపై పడింది. రైతన్నలు అవస్థలు పడ్డారు. వరి పంటకు నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో వరి పంట వర్షానికి తడిసిపోయింది. గురువారం ఉదయం చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. చల్లటి గాలులతో అంతటా చలి వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించారు. విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌ తహసీల్దారులతో మాట్లాడి సలహాలు, సూచనలిచ్చారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 


కోతల వేళ...

వరి పంటకు అపార నష్టం కలిగింది. ప్రస్తుతం వరి కోతలు చురుగ్గా  సాగుతున్నాయి. దాదాపు 40 శాతం పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరిచేలు కుప్పలుగా పోశారు. అనేక ప్రాంతాల్లో పొలాల్లోనే కోసి ఉంచారు. మొలక వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో భయపడుతున్నారు. చేతికందిన పంట ఇలా వర్షార్పణమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం డివిజనకు వర్షంతో నష్టం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభం నుంచీ వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. 23 వేల హెక్టార్లలో అసలు వరినాట్లు వేయలేదు. మధ్యలో అడపాదడపా వర్షాలతో రైతులు పంటను కాపాడుకున్నారు. పంట కొంతవరకూ ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. ఇంతలో నివర్‌ తుపాను వారి ఆశలను అడియాశలు చేసింది. పంటను కాపాడుకోవడానికి వ్యయప్రయాసలు పడ్డారు. రామభద్రపురం, సాలూరు, పాచిపెంట మండలాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. 


నష్ట నివారణపై దృష్టి

వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. స్థానికంగా రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. వరి నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. మూడు రోజులకు పైగా వరిచేను తడిచిపోతే 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి సూచించారు. అప్పుడే మొలకలు రావని చెప్పారు. రైతులు సలహాలు, సూచనల కోసం వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని చెప్పారు.




Updated Date - 2020-11-27T03:45:35+05:30 IST