తుఫాన్‌ హెచ్చరికలను తెలుసుకుందాం..!!

ABN , First Publish Date - 2021-11-17T04:55:03+05:30 IST

కృష్ణపట్నం పోర్టులో మూడవ నంబరు హెచ్చరిక.. తుపాను తీవ్రత పెరిగినందున ఆరవ నంబరు ఎగురవేశారు..

తుఫాన్‌ హెచ్చరికలను తెలుసుకుందాం..!!
తుపాను హెచ్చరికల సూచిక బోర్డు

ముత్తుకూరు, నవంబరు 16 :  కృష్ణపట్నం పోర్టులో మూడవ నంబరు హెచ్చరిక.. తుపాను తీవ్రత పెరిగినందున ఆరవ నంబరు ఎగురవేశారు.. జిల్లాలో తుపాను ప్రభావం వస్తే ఈ ప్రకటనలు చూస్తుంటాం..!! అసలు ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి? ఏ హెచ్చరిక ఎప్పుడు ఎగురవేస్తారు.. ఎందుకు ఎగురవేస్తారు.. వాటి వివరాలు తెలుసుకుందాం.

తుపాను హెచ్చరికలు మొత్తం పదకొండు. జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో ఇప్పటివరకు అత్యధికంగా పదవ నంబరు తుపాను హెచ్చరికను ఎగురవేశారు. అప్పట్లో కావలి వద్ద తుపాను తీరం దాటింది. జిల్లాకు అత్యంత నష్టాన్ని కలిగించిన తుపాను ఇది. 1995లో 9వ నంబరు హెచ్చరిక ఎగురవేశారు. విశాఖపట్నంలోని వాతావరణ హెచ్చరిక కేంద్రం నుంచి అందే సమాచారం ఆధారంగా పోర్టుల్లో తుపాను హెచ్చరికలను ఎగురవేస్తారు. ఈ హెచ్చరికలను రాత్రిళ్లు గుర్తించేందుకు వీలుగా పలు అమరికల్లో తెలుపు, ఎరుపు రంగు దీపాలను వెలిగిస్తారు. తుపాను తీవ్రతను అనుసరించి హెచ్చరిక నంబరు పెరుగుతుంది. 

తుపాను హెచ్చరిక నంబరు ఒకటి : ఇది ప్రాఽథమిక హెచ్చరిక. సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారవచ్చు. 

 రెండు: సముద్రంలోని అల్పపీడనం వాయుగుండంగా మారింది. 

మూడు: తుపానుకు ఇది తొలి హెచ్చరికగా భావించవచ్చు. వాయుగుండంగా మారిన అల్పపీడనం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.  

నాలుగు: వాయుగుండం తీవ్రత అధికంగా ఉంది. కాని ప్రమాదకరం కాకపోవచ్చు. 

ఐదు: వాయుగుండం తుపానుగా మారింది. పోర్టుకు ఎడమ వైపుగా పయనించవచ్చు. 

ఆరు: ప్రమాదం. తుపాను తీవ్రతకు సూచిక. పోర్టును దాటి కుడి వైపుగా తుపాను ప్రయాణించవచ్చు. దీంతో ఈ ప్రాంతంలో ఈదురుగాలులు, ఒక మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాల సూచన. 

ఏడు: ప్రమాదం. తుపాను పోర్టు మీదుగా తీరం దాటే అవకాశం. పరిస్థితి కాస్త ప్రమాదకరం. 

ఎనిమిది : అతి ప్రమాదం. తుపాను పోర్టుకు ఎడమవైపుగా తీరం దాటుతుంది. తుపాను ప్రభావం ఈ ప్రాంతంలో అధికం. 

తొమ్మిది : అతి ప్రమాదం. తీవ్రమైన తుపాను హెచ్చరిక ఇది.  తుపాను పోర్టుకు కుడి వైపుగా తీరం దాటుతుంది. తుపాను ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. భారీ వర్షసూచన. ఈదురు గాలులు అధికంగా వుంటాయి. 

పది : అత్యంత ప్రమాదం. అతి తీవ్రమైన తుపాను హెచ్చరిక. తుపాను కచ్చితంగా ఈ ప్రాంతంలో తీరం దాటుతుంది. పరిస్థితి అల్లకల్లోలంగా వుంటుంది. భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురుగాలులు, భారీ నష్టం వాటిల్లే ప్రమాదం.  

పదకొండు : సమాచార వ్యవస్థ విఫలం. తుపాను హెచ్చరికల్లో అత్యంత తీవ్రమైనది. ఈ హెచ్చరిక ఎగురవేసే సమయానికి తీవ్రమైన ఈదురుగాలులు. భారీ వర్షాలతో పరిస్థితి దారుణంగా వుంటుంది. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉంటుంది. 


Updated Date - 2021-11-17T04:55:03+05:30 IST