తూప్రాన్‌లో ఉ(ఎ)త్తి పోతలేనా!

ABN , First Publish Date - 2021-07-30T04:49:48+05:30 IST

తూప్రాన్‌ పట్టణ పరిధిలోని పెద్దచెరువు నింపేందుకు నిర్ధేశించిన ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకం అధికారుల నిర్లక్ష్యంతో వృఽఽథాగా మారింది. పుష్కలంగా వర్షాలు పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతున్నది. తూప్రాన్‌ పట్టణంలోని పెద్ద చెరువు మెదక్‌ జిల్లాలోనే అతిపెద్ద చెరువగా పేరున్నది.

తూప్రాన్‌లో ఉ(ఎ)త్తి పోతలేనా!
హల్దీవాగు నుంచి నీటిని ఎత్తిపోయడానికి ఏర్పాటు చేసిన భారీ మోటార్లు

హల్దీవాగు పారుతున్నా మోటార్లు ప్రారంభించని అధికారులు

కలగానే తూప్రాన్‌ పెద్దచెరువుకు జలకళ


తూప్రాన్‌, జూలై 29: తూప్రాన్‌ పట్టణ పరిధిలోని పెద్దచెరువు నింపేందుకు నిర్ధేశించిన ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకం అధికారుల నిర్లక్ష్యంతో వృఽఽథాగా మారింది. పుష్కలంగా వర్షాలు పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతున్నది. తూప్రాన్‌ పట్టణంలోని పెద్ద చెరువు మెదక్‌ జిల్లాలోనే అతిపెద్ద చెరువగా పేరున్నది. దీనికింద 750 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నది. 1986లో ఆఖరిసారి నిండిన చెరువు అనంతరం దశాబ్దాలు నిండకపోడం గమనార్హం.  ప్రజాగాయకుడు గద్దర్‌ గతంలో  ‘మై విలేజ్‌ ఆఫ్టర్‌ 60 ఇయర్స్‌’ పుస్తకాన్ని రాసేందుకు తూప్రాన్‌లో పర్యటించిన సందర్భంగా పెద్దచెరువు నిండకపోవడాన్ని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హల్దీవాగుపై కిష్టాపూర్‌ రోడ్డులో ఉన్న చెక్‌డ్యాం నుంచి ఎత్తిపోతల ద్వారా పెద్ద చెరువు నింపేందుకు గద్దర్‌ కృషి చేశారు. ఆయన అభ్యర్థన మేరకు అప్పటి ప్రభుత్వం స్పందించి రూ. 3.61 కోట్లను ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా మంజూరు చేసింది. చెక్‌డ్యాం ఎత్తును పెంచడంతో పాటు, హల్ధీవాగు నుంచి తూప్రాన్‌ పెద్ద చెరువులోకి నీటిని ఎత్తిపోతలతో నింపేందుకు నిర్ధేశించారు. హల్ధీవాగు ప్రవహిస్తూ చెక్‌డ్యాం పొంగిపోర్లుతున్న సమయంలోనే నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. 


ఆదిలోనే హంసపాదు

తూప్రాన్‌ ఎత్తిపోతల పథకం తీరు ‘ఆదిలోనే హంసపాదు’ అన్న చందంగా తయారైంది. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించినప్పటికీ భారీ వర్షాల కారణంగా ఎత్తిపోతలను అర్ధంతరంగానే నిలిపివేశారు. ఎత్తిపోతల నిర్వహణకు గద్దర్‌ ప్రోత్సాహంతో కొందరు యువకులు ముందుకు వచ్చినా నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో వారు వెనక్కి తగ్గారు.  


హల్దీవాగులోకి కాళేశ్వరం జలాలు

సీఎం కేసీఆర్‌ ఆదేశంమేరకు గత ఏప్రిల్‌ 6న కాళేశ్వరం జలాలను హల్దీవాగులోకి వదలిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కిమానాయక్‌ ఏప్రిల్‌ 8న ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఏప్రిల్‌ 11న హల్దీవాగులో కాళేశ్వరం జలాలు తూప్రాన్‌కు చేరుకున్నాయి. అనంతరం పది రోజులు గడిచిపోయినా ఎత్తిపోతల పథకం ప్రారంభించకపోవడంతో అసంతృప్తి చెందిన గద్దర్‌  తానే ఎత్తిపోతల పథకం నడిపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కొద్దిరోజులు ఎత్తిపోతలు చేపట్టి చెరువులోకి నీటిని మళ్లించారు. కానీ పెద్దచెరువు బ్యాక్‌వాటర్స్‌లో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో నీటి మళ్లింపును నిలిపివేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో హల్ధీవాగు నిండుగా ప్రవహిస్తుండటంతో మరోసారి చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. 


వృథాగా పోతున్న నీరు

హల్దీవాగు నీటిని మళ్లిస్తే పెద్దచెరువు నిండుతుందనే ఆలోచనతో చెరువు శిఖం పరిధిలోని పట్టాభూముల్లో రైతులు వానాకాలం పంటల సాగు చేపట్టలేదు. ఈ నెల 14న కురిసిన భారీ వర్షంతో హల్దీవాగు నిండుగా ప్రవహించింది. అయినప్పటికీ ఎత్తిపోతలు ప్రారంభించలేదు. రెండువారాలుగా వాగులో నీరు వృథాగా పోతున్నా పెద్దచెరువు నింపేందుకు నీటి పంపింగ్‌ చేపట్టడంలేదు. దీంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో నీటిని మళ్లిస్తేనే పెద్దచెరువు ఆయకట్టు కింద పంటలు పండుతాయని అంటున్నారు. 


రైతులు కోరితే పంపింగ్‌ చేస్తాం : కిమానాయక్‌, ఐడీసీ ఈఈ 

వర్షాలు కురుస్తున్నందున పెద్ద చెరువులోకి నీరొస్తుందని భావిస్తున్నాం. ఆయకట్టు రైతులు కోరితే హల్దీవాగు నుంచి నీటిని పంపింగ్‌ చేస్తాం. రెండు రోజుల్లో ఎత్తిపోతల పథకం మోటార్లు ప్రారంభించి కొద్దికొద్దిగా నీటి పంపింగ్‌ ప్రారంభిస్తాం.   

Updated Date - 2021-07-30T04:49:48+05:30 IST