ఇంతలా ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం గతంలో ఎన్నడూ జరగలేదు

ABN , First Publish Date - 2022-07-03T09:32:19+05:30 IST

‘‘దేశం నాశనం కాకుండా జరిగే పోరాటమిది. దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమిది’’ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు.

ఇంతలా ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం గతంలో ఎన్నడూ జరగలేదు

  • గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నా.. ఈడీ నా వద్దే ఉండేది
  • ఫలితం ఎలా ఉన్నా.. తర్వాత కూడా పోరాటం కొనసాగిస్తాం
  • మద్దతు కోసం ఫోన్‌ చేసినా ప్రధాని స్పందించలేదు
  • ఏకాభిప్రాయ సాధన ఆయన డిక్షనరీలో లేదు: యశ్వంత్‌ సిన్హా
  • ఇంత దురుపయోగం గతంలో ఎన్నడూ జరగలేదు
  • దేశం నాశనం కాకుండా చేస్తున్న పోరాటమిది
  • విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా 

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశం నాశనం కాకుండా జరిగే పోరాటమిది. దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమిది’’ అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. ఈ పోరాటానికి హైదరాబాద్‌ నుంచే శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. ఈ సంద ర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘అధికారం అనేది ప్రజలకు మేలు చేయడానికే ఉండాలి. మీ దగ్గర ఉన్న సంస్థలను దుర్వినియోగం చేసి.. అధికారంతో విపక్షాలను ఇబ్బంది పెట్టడం లక్ష్యం కారాదు. వాజపేయి ప్రభుత్వంలో నేను కూడా ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఈడీ కూడా నా వద్దే ఉండేది. కానీ, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని ఉపయోగించాలనే ఆలోచన ఏరోజూ నా మనసులోకి రాలేదు. ఇప్పుడు జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థల దురుపయోగం ఎప్పుడూ జరగలేదు’’ అని మండిపడ్డారు. 


ప్రజాస్వామ్య రక్షణే లక్ష్యం

ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలిచి రాష్ట్రపతి అవుతారని, రాష్ట్రపతి అయితే మీ లక్ష్యం ఏమిటని పలువురు అడుగుతున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తన లక్ష్యమని యశ్వంత్‌ సిన్హా తెలిపారు. ‘అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదని ప్రధానిపై మండిపడ్డారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరు అని వ్యాఖ్యానించారు. ‘‘యుద్ధానికి వెళుతుంటే ప్రత్యర్థి ఏ కత్తిని వాడుతున్నారు.. ఎంతమంది సైనికులు ఉన్నారనేది చూడం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం... ఆ సిద్ధాంతాన్ని బతికించుకోవడానికి శత్రువుతో పోరాటం చేస్తాం’’ అని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికలతోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటం ఆగదని, ఇక చూస్తూ నిశ్శబ్దంగా ఉండేది లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత మద్దతు ఇవ్వాలని కోరడానికి ప్రధాన మంత్రికి ఫోన్‌ చేశానని, ఆయన అందుబాటులో లేరని సమాచారం వచ్చిందని యశ్వంత్‌ సిన్హా చెప్పారు. ఇప్పటిదాకా ప్రధాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, ఈ ప్రధాని తీరు చూస్తే విస్మయం కలుగుతోందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో అసాధారణ పరిస్థితి ఉందని విమర్శించారు.


 ‘‘ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టారు. అభ్యర్థిని ప్రకటించడానికి ముందు ఏకాభిప్రాయ సాధన కోసం విపక్షాలతో సంప్రదింపులు చేసే బాధ్యత ప్రధానికే ఉండేది. మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పని చేయలేదు.   ఏకాభిప్రాయ సాధన అనే మాటకు మోదీ డిక్షనరీలో చోటే లేదు. సంప్రదింపులు, చర్చల్లేకుండా ఏకాభిప్రాఽయ సాధన ఏవిధంగా సాధ్యం’’ అని మండిపడ్డారు. దేశానికి కేసీఆర్‌ లాంటి నాయకుడి అవసరం ఉందని, ఆయనతో కలిసి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సభ వేదికగా సీఎం కేసీఆర్‌ ఎన్నో ప్రశ్నలు అడి గారని, వాటిలో ఒక్క ప్రశ్నకైనా ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘నిన్న సుప్రీంకోర్టులో ఒక తీర్పు వెలువడింది. ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు జుబేర్‌ను అరెస్ట్‌ చేశారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని జైల్లో పెట్టారు. కానీ, దేశంలో విషాన్ని విరజిమ్మిన బీజేపీ ప్రతినిధిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే.. ప్రధాని నోటి నుంచి ఒక్క మాట రాదు’’ అని తప్పుబట్టారు.

   

టీఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం సురక్షితం

హైదరాబాద్‌ వచ్చిన తర్వాత, ఇక్కడ స్వాగతం పలికిన విధానం చూసిన తర్వాతే తనకు ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే పోరాటంపై నమ్మకం ఏర్పడిందని యశ్వంత్‌ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఓడించలేరని, తెలంగాణ ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌ ఉంటుందని, అప్పటిదాకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త పోరాటం కోసం మళ్లీ కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు. ‘జై తెలంగాణ’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.


యశ్వంత్‌కు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

బేగంపేట: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, సబితా రెడ్డి, పువ్వాడ అజయ్‌, తలసాని తదితరులు స్వాగతం పలికారు. అనంతరం, ఎయిర్‌పోర్టు నుంచి ముందు సీటులో యశ్వంత్‌, వెనక సీటులో కేసీఆర్‌ ఉన్న వాహనం బయలుదేరింది. అప్పటికే వేలాది బైక్‌లు ర్యాలీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి జలవిహార్‌కు భారీ బైక్‌ ర్యాలీగా బయలుదేరాయి. 

Updated Date - 2022-07-03T09:32:19+05:30 IST