థైరాయిడ్‌ ముదిరితే ముప్పే

ABN , First Publish Date - 2022-05-25T05:29:52+05:30 IST

మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం థైరాయిడ్‌ గ్రంఽథి. ఇది శరీరంలోని అనేక భాగాలకు అనుసంధానంగా ఉంటుంది.

థైరాయిడ్‌ ముదిరితే ముప్పే

 మహిళల్లోనే ఎక్కువగా వ్యాధిగ్రస్థులు

 జిల్లాలో ఏటా రెండు వేల మందికి వ్యాధి

నేడు ప్రపంచ థైరాయిడ్‌ నివారణ దినోత్సవం

నెల్లూరు(వైద్యం) మే 24 : మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం థైరాయిడ్‌ గ్రంఽథి. ఇది శరీరంలోని అనేక భాగాలకు అనుసంధానంగా ఉంటుంది.  ఇతంటి ప్రాధాన్యత కలిగిన థైరాయిడ్‌ గ్రంఽథి వ్యాధికి గురై థైరాయిడ్‌ క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం ఉంది. అయోడిన్‌ లోపం వల్ల వ్యాధి  వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ముదిరితే ముప్పు అని, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లో వస్తుంది. గర్భస్రావమయ్యే ముప్పు కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని థైరాయిడ్‌ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 25వ తేదీన ప్రపంచ థైరాయిడ్‌ నివారణ దినోత్సవంగా తీర్మానించింది. 

జిల్లాలో రెండువేల మందికిపైగా నమోదు 

జిల్లాలో ఏటా 50 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భిణుల్లో రెండు వేల మందికిపైగా థైరాయిడ్‌ వ్యాధి గ్రస్థులు నమోదవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్థుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకొని మందులు వాడకపోవడంతో వ్యాధి తిరగదోడుతోంది. గర్భదారణ సమయంలో తగిన రక్త పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని గుర్తించవచ్చు. పురుషుల్లో కంటే మహిళల్లోనే థైరాయిడ్‌ వ్యాధి ఎక్కువగా ఉంటోంది. దీని నివారణ కు పౌష్టికాహారం ఎంతో మేలని వైద్యులు చెబుతున్నారు.

అపోహలు - వాస్తవాలు 

హైపోథైరాయిడ్‌ వ్యాధిగ్రస్థులు ఒకసారి మందులు వాడితే మళ్లీ వేసుకోవాల్సిన పని లేదని అపోహలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదని జీవితాంతం  మందులు వాడాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. ప్రతి 6 నెలలకు ఒక సారి పరీక్షలు కూడా చేయించుకోవాలని అంటున్నారు. వ్యాధిగ్రస్థులు మాంసాహారం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఆకుకూరలు తినకూడదన్న అపోహ  సరికాదని, ఎలాంటి పత్యం లేదని అంటున్నారు. అలాగే ఈ వ్యాధులన్నింటికి శస్త్రచికిత్స అవసరం లేదని, గడ్డలు మంచివా, చెడువా అని నిర్థారించుకున్న తరువాతే శస్త్రచికిత్స చేస్తారంటున్నారు. షుగర్‌ వ్యాధిగ్రస్థులు వ్యాధి నిపుణుల సలహాలతో మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంది. 




కరోనా వల్ల థైరాయిడ్‌ బాధితులు ఎక్కువే

 డాక్టర్‌ టి. సునంద ( ఎండోక్రైనాలజిస్ట్‌, థైౖరాయిడ్‌ వైద్య నిపుణురాలు, నారాయణ  ఆసుపత్రి)

కరోనా నుంచి కోలుకున్న వారిలో థైరాయిడ్‌కు గురైన బాధితులు ఎక్కువ మందే ఉన్నారు.  గర్భిణులు తప్పనిసరిగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే పుట్టే  బిడ్డలు మానసిక వికాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది.


ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు 

వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు. ఊభకాయం ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి ముదిరితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. టీపీవో యాంటీబాడీస్‌ థైరాయిడ్‌ పరీక్షల ద్వారా వ్యాధి ఏస్థాయిలో ఉందో గుర్తించాలి. దాని ద్వారా జీవితాంతం మందులు వాడాలా తాత్కాలికంగా వాడితే సరిపోతుందా వంటి విషయాలు తెలుస్తాయి. ఇది  ఇటీవల వచ్చిన ప్రగతి.

 డాక్టర్‌ రామమోహన్‌ (ఎండోక్రైనాలజిస్ట్‌, అపోలో ఆసుపత్రి) 


Updated Date - 2022-05-25T05:29:52+05:30 IST