సినిమాను బట్టి టికెట్‌ ధర!

ABN , First Publish Date - 2021-12-25T07:37:14+05:30 IST

మీరు సినిమాకు వెళుతున్నారా? తెలంగాణ సర్కారు నిర్ణయించిన ప్రకారం.. ఫలానా థియేటర్లో టికెట్‌ రేటు ఇంత ఉంటుంది.. అని లెక్కలు వేసుకుంటున్నారా? అయితే.. ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే..

సినిమాను బట్టి టికెట్‌ ధర!

  • దానికి తగ్గట్టుగా టికెట్ల ధరల్లో మార్పు.. ఇప్పటివరకూ జీఎస్టీని కలుపుకొని రేటు
  • కొత్త విధానంలో ఆ లెక్క విడిగా చూపాల్సిందే
  • రూ.100లోపు 12 శాతం.. 100 దాటితే 18ు
  • ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు అదనపు వడ్డన
  • తాజా ఉత్తర్వులపై థియేటర్ల యజమానుల సంతృప్తి
  • అదనపు బాదుడుతో ప్రేక్షకులపై పెరగనున్న భారం
  • సింగిల్‌ థియేటర్లలో రేట్లు గతంతో పోలిస్తే ఎక్కువే

   

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

మీరు సినిమాకు వెళుతున్నారా? తెలంగాణ సర్కారు నిర్ణయించిన ప్రకారం.. ఫలానా థియేటర్లో టికెట్‌ రేటు ఇంత ఉంటుంది.. అని లెక్కలు వేసుకుంటున్నారా? అయితే.. ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే..


సర్కారు ధరలు నిర్ణయించిన మాట నిజమేగానీ.. దాంట్లో కనిష్ఠం, గరిష్ఠం అంటూ రెండు పరిమితులు పెట్టింది. దాని ప్రకారం.. విమానం టికెట్ల తరహాలో థియేటర్లో పడే సినిమానుబట్టి, ఆ సినిమా హీరో స్థాయిని బట్టి ఇకపై టికెట్‌ రేటు మారిపోయే అవకాశం ఉంది. సర్కారు కొత్తగా నిర్ణయించిన ప్రకారం సింగిల్‌ థియేటర్లలో చార్జీలు ప్రేక్షకుడికి భారంగా మారనున్నాయి.


ఇంతకాలం సింగిల్‌ థియేటర్‌ బాల్కనీలో వసూలు చేస్తున్న రూ. 110 కాస్తా రూ.150 కాగా.. అదనంగా 18 శాతం జీఎస్టీ (టికెట్‌ ధర రూ. వంద లోపు అయితే 12 శాతం జీఎస్టీ), నిర్వాహణ చార్జీల కింద రూ. 3 కానీ రూ.5 కానీ వసూలు చేసే వీలుంది. అంటే.. రూ. 110గా ఉన్న టికెట్‌ ధర కొత్త విధానంలో  (150+27+5) రూ. 182 కానుంది. ఒకవేళ ప్రేక్షకులపై దయతలచి నిర్వహణ చార్జీ కింద రూ.3 మాత్రమే వసూలు చేస్తే రౌండ్‌ ఫిగర్‌ రూ.180 అవుతుంది. అంటే.. ఒక్కో టికెట్‌ మీద రూ.70 దాకా అదనపు భారం ప్రేక్షకులపై పడనుంది.


అలాగే.. ఇప్పటివరకూ ఏసీ సింగిల్‌ థియేటర్‌లో నేల టికెట్‌ రూ.30 ఉంటే.. ప్రభుత్వం దాన్ని రూ.50 చేసింది. దానికి 12 శాతం జీఎస్టీ (రూ.6).. నిర్వహణ చార్జీ అదనం. అన్నీ కలిపి రూ.59 నుంచి రూ.61 దాకా అవుతుంది. ఈ థరలన్నీ నేరుగా థియేటర్‌కు వెళ్లి కొనుగోలు చేసినవారికే. ఆన్‌లైన్‌లో కొంటే మరింత మోత మోగుతుంది. టికెట్‌ ధరకు అనుగుణంగా కొన్ని యాప్‌ ఆధారిత టికెటింగ్‌ సంస్థలు కనిష్ఠంగా 12 శాతం నుంచి గరిష్ఠంగా 16 శాతం వరకూ ఆన్‌ లైన్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి.



ఉదాహరణకు ఒక పేరొందిన టికెట్‌ బుకింగ్‌ యాప్‌లో ప్రస్తుతం ఒక సినిమా టికెట్‌ ధర రూ.200 ఉంటే.. దాని మీద ఆన్‌లైన్‌ చార్జీ కింద రూ. 29.74వసూలు చేస్తోంది. అదే.. పీవీఆర్‌ సంస్థకు చెందిన యాప్‌లో టికెట్‌ బుక్‌ చేస్తే రూ.200 టికెట్‌ ధరకు ఆన్‌లైన్‌ చార్జీ కింద రూ.31.86 వసూలు చేస్తున్నారు. వీటికి జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం. అగ్రహీరో సినిమా అయితే.. ప్రస్తుతం సింగిల్‌ థియేటర్‌లలో మూడు విభాగాల్లో టికెట్లు అమ్ముతున్నారు. బాల్కనీ రూ.110.. రెండో తరగతి టికెట్‌ రూ.90, మూడో తరగతి టికెట్‌ రూ.30గా ఉంటోంది.


అయితే, కొన్ని సినిమాలకు ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని సినిమా విడుదలైన మొదటి రెండు వారాలూ ఒక్కో సినిమాకు ఒక్కో ధర పెట్టి టికెట్లు అమ్ముతున్నారు. ఉదాహరణకు ఈ మధ్యనే విడుదలైన ఒక అగ్ర హీరో సినిమాను హైదరాబాద్‌లోని సింగిల్‌ ఏసీ థియేటర్‌లో రూ.50, రూ.150, రూ.200 చొప్పున విక్రయించారు.


ఈ శుక్రవారం విడుదలైన మరో ప్రముఖ హీరో సినిమా టికెట్‌ ధర హైదరాబాద్‌ లోని సింగిల్‌ ఏసీ థియేటర్‌ లో రూ.50, రూ.100, రూ.150 చొప్పున విక్రయించారు. మల్టీప్లెక్సుల విషయానికి వస్తే.. కనిష్ఠం.. గరిష్ఠం అన్న తేడా లేకుండా అన్ని సీట్లకూ ఒకటే రేటు. కొన్ని సినిమాలకు రూ.150 పెడుతున్నారు. ప్రముఖ హీరోలైతే రూ.200.. అగ్రహీరోలైతే రూ.250 దాకా అమ్ముతున్నారు. రిక్లైనర్‌ సీట్లకు రూ.350 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ టిక్కెట్ల ధరలన్ని జీఎస్టీని కలుపుకొనే ఉన్నాయి. ప్రభుత్వం టికెట్ల ధరలకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో.. మల్టీఫ్లెక్సుల్లో కనిష్టం రూ.100.. గరిష్ఠం రూ. 250తో పాటు 18శాతం జీఎస్టీ + నిర్వహణ చార్జీలు వసూలు చేసే వీలు కల్పించారు. దీంతో మల్టీప్లెక్స్‌ల్లో కూడా టికెట్‌ ధర మరింత ప్రియం కానుంది. 


సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల గురించి థియేటర్ల యజమానులతో మాట్లాడినప్పుడు..  ఒక పెద్ద హీరో సినిమాకు టికెట్లను ప్రభుత్వం పేర్కొన్నట్లుగా గరిష్ఠ ధరకు అమ్ముతామని.. అదే చిన్న సినిమాకు టికెట్లను ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ ధరకు అమ్మే అవకాశం లేదని వారు వివరిస్తున్నారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ ఒక్కో సినిమాకు ఒక్కోలా డిమాండ్‌ ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా టికెట్‌ ధరల్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని.. లేని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. అందుకు గత వారం.. ఈ వారం విడుదలైన సినిమా టికెట్‌ ధరలే నిదర్శనమని చెబుతున్నారు.  ఏదేమైనా.. ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త ధరలతో సగటు ప్రేక్షకుడికి లాభమేనని థియేటర్ల యజమానులు చెబుతున్నా.. ప్రేక్షక వర్గాలు మాత్రం తాజా ఉత్తర్వులతో భారమే పడుతుందని చెబుతున్నాయి.


Updated Date - 2021-12-25T07:37:14+05:30 IST