మా గూడు పట్టదా..!

ABN , First Publish Date - 2020-12-02T05:44:58+05:30 IST

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలం దరికీ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఏపీ టిడ్కో సబ్సిడీపై ఇళ్లు నిర్మించి అందించే పథకానికి గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టింది.

మా గూడు పట్టదా..!
నిడదవోలులో చివరిలో నిలిచినపోయిన టిడ్కో ఇళ్లు

300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం

365, 435 కేటగిరీలకు బ్యాంకు రుణాలు

తమకూ ఉచితంగా ఇవ్వాలంటున్న మిగతా లబ్ధిదారులు

పట్టణాల్లో నిర్మించిన 300 చదరపు అడుగుల ఏపీ టిడ్కో ఇళ్లను రూపాయికే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు బ్యాంకు రుణం చెల్లించాలని అంటున్నది. లబ్ధిదారులు మాత్రం తమకు ఉచితంగా ఇళ్లివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే 365 చ.అ. కేటగిరీ ఇళ్లకు రూ.50 వేలు, 430 చ.అ. కేటగిరీ ఇళ్లకు లక్ష రూపాయలు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించారు. మిగిలిన మొత్తానికి బ్యాంకుల నుంచి రుణం పొందేలా అర్హత పత్రాలను సిద్ధం చేస్తున్నారు. 365 చ.అ. కేటగిరీకి రూ.3.15 లక్షలు, 430 చ.అ. కేటగిరీ లబ్ధిదారులకు రూ.3.65 లక్షలు బ్యాంకులు రుణంగా మంజూరు చేయనున్నాయి. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీరు కూడా తమకు ఉచితంగా ఇళ్లు అందించాలని కోరుతున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఫోకస్‌.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలం దరికీ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఏపీ టిడ్కో సబ్సిడీపై ఇళ్లు నిర్మించి అందించే పథకానికి గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఏలూరు కార్పోరేషన్‌, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమ వరం, కొవ్వూరు, తణుకు పురపాలక సంఘాల పరిధిలో లబ్ధి దారులను ఎంపికచేశారు. ఏ, బీ, సీ కేటగిరీల కింద విభజించి వారి స్తోమతను బట్టి నాలుగు వాయిదాలలో సొమ్ము చెల్లిం చేలా నిర్ణయించారు. దీంతో అర్హులంతా వడ్డీకి అప్పు తెచ్చి మరీ వాయిదాలు చెల్లించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తరువాత ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇళ్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, వామపక్షాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని గట్టి పోరాటమే చేశాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అందించేందుకు ముందుకు వచ్చింది. జిల్లాలోని నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం ఇలా అన్ని పురపాలక సంఘాల పరిధిలోని కొన్నిచోట్ల ఇళ్లు కొన్ని బ్లాకులు మాత్రమే పూర్తి కాగా మరికొన్ని బ్లాకులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పూర్తయిన బ్లాకుల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండానే ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో ఈ టిడ్కో ఇళ్లు బూత్‌ బంగ్లాలను తలపించేలా మారిపోయాయి. భవన నిర్మాణాలు పూర్తయినా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు.


తాడేపల్లిగూడెంలో తిరగదోడారు

తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్లు నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన జాబితా ను ప్రస్తుత ప్రభుత్వం తిరగదోడింది. మొత్తంపైన 150 మందిని అనర్హులుగా తేల్చారు. వారి స్థానంలో కొత్తవారికి చోటు కల్పించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అర్హత పత్రాల ను ఇచ్చేందుకు ఆదేశాలు జారీచేసి ంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  తాడేపల్లిగూ డెంలో నిర్మించిన 5,376 ఇళ్లల్లో 300 కేటగిరీ ఇళ్లు 1,312, 365 కేటగిరీ ఇళ్లు 992, 430 కేటగిరీ ఇళ్లు 3,072 ఉన్నాయి.


పాలకొల్లులో అనర్హులు

 పాలకొల్లు పట్టణానికి 7,159 ఇళ్లు మంజూరయ్యాయి. స్థలాభావంతో 6,144 ఇళ్లను పట్టణ శివారు పెంకుళ్ళపాడులో నిర్మించింది. 90 శాతం పూర్తయిన ఇళ్లకు బ్యాంకు రుణాలను మం జూరు చేయించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేశా రు. 300 కేటగిరీలో 2,208 మంది, 365 చ.అ కేటగిరీలో ఇళ్ళకు 608 మంది, 430 చ.అ ఇళ్లకు 3,328 మంది అర్హులున్నారు. వివిధ కారణాలతో సుమారు వెయ్యి మందికిపైగా అనర్హులు న్నట్టు తెలుస్తోంది. పట్టణంలో టిడ్కో ఇళ్ళ పట్టాలను లబ్ధిదారులకు వార్డు వలంటీర్ల ద్వారా అందజేస్తున్నారు. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు మాత్రమే పట్టాలు అందజేస్తున్నారు.  


ఏలూరులో రద్దు చేసిన వారి మాటేంటి ?

ఏలూరు నగర పాలకసంస్థ పరిధిలో 6,480 ఇళ్ళు  టిడ్కో ద్వారా నిర్మించింది. వీటిలో 300 ఎస్‌ఎఫ్‌టీ సింగిల్‌ బెడ్‌ రూ మ్‌ ఇళ్లు 1,872, 365 ఎస్‌ఎఫ్‌టీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు 1,344, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 3,264 నిర్మాణం చేపట్టింది. వీటి లో వైసీపీ ప్రభుత్వం 300 ఎస్‌ఎఫ్‌టీ 1104, 365 ఎస్‌ఎఫ్‌టీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు 384, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 720 మొత్తం 2,208 ఇళ్లు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీంతో మిగిలిన 4272 మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతు న్నారు. రద్దు చేసిన ఇళ్ళ లబ్ధిదారులు ఇప్పటికే తమ వాటాగా 50 వేలు, లక్ష రూపాయలు కట్టారు.  


తణుకులో అసంపూర్ణం

తణుకు పట్టణంలో మొత్తం 912 ఇళ్లు మంజూరయ్యాయి. 300 చ.అ కేటగిరీలో 144 , 365 చ.అ కేటగిరీలో 144 మంది, 430 చ.అ ఇళ్లు 624 నిర్మించతలపెట్టారు. ఇవి అసంపూర్తిగానే ఉన్నాయి.. 65 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఇటీవల లబ్ధిదారులకు అలాంట్‌మెంట్‌ లెటర్లు అందించారు. డిసెంబరు 25న పట్టాలు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


కొందరికే అలాట్‌మెంట్‌

భీమవరం పట్టణ శివారు తాడేరు సమీపంలోని 82 ఎకరా ల్లో 8,352 ఇళ్లను నిర్మించారు. ఇందులో 365 చ.అ ప్లాట్‌లు 3,520 ఉండగా 2,998 మంది లబ్ధిదారులకు అలాట్‌ మెంట్‌ లెటర్స్‌ అందిస్తున్నారు. 430 అడుగులకు సంబంధించి 1408 ప్లాట్‌లకు 1,168 మంది లబ్ధిదారులకు మాత్రమే అలాట్‌మెం ట్‌ పత్రాలను అందజేస్తున్నారు. ఇంకా 300 అడుగులకు సం బంధించి 3,424మంది లబ్ధిదారుల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.  


కొవ్వూరులో ఇదీ పరిస్థితి

 కొవ్వూరు పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో  480 ఇళ్ల్లు నిర్మించింది. 300 చ.అ కేటగిరీలో 240, 430 కేటగిరీలో మరో 240 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల్లు నిర్మాణం చేపట్టింది. ఇవి 65 శాతం పూర్తయాయి. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు లబ్ధిదారులు రూ.500, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లబ్ధిదారులు 240 మందికి 195 మంది లక్ష రూపాయలు, మరో 45 మంది లక్షలోపు సొమ్ము చెల్లించారు. వాటిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఈ నెల 21న రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా 240 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన 240 మందికి డిసెంబరు నెలాఖరున ఇస్తామని అధికారులు చెబుతున్నారు.


1048 లబ్ధిదారుల పరిస్థితి ఏమిటో ..

నిడదవోలు పరిధిలో గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం 1,248 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణ శివారు తీరుగూడెంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. 300 చదరపు అడుగుల గృహాలు 480 మందికి, 365 చ.అ 240 మందికి, 430 చ.అ 528 మందికి కేటాయించారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. నేటికీ ఏ బ్లాకులోను మౌలిక సదుపా యాలు కల్పించలేదు. తాజాగా పట్టణంలోని 8, 9, 10 సచివాలయాల్లోని 200 మంది లబ్ధిదారులకు మాత్రమే కేటాయింపు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. మిగిలిన 1048 మంది పరిస్థితి ఏమిటనేది తెలియదు.  


ఉచితంగా ఇవ్వాలి  : అంగర రామమోహన్‌, ఎమ్మెల్సీ


అన్ని కేటగిరీలకు ఉచితంగా ఇవ్వాలి.. మాట తప్పం, మడమతిప్పం అన్న జగన్‌ ఇప్పుడు సొమ్ము చెల్లించాలంటూ చెప్పడం మడమ తిప్పడమే. పాలకొల్లులో టీడీపీ తరఫున ప్రజా ఉద్యమం చేపట్టిన సమయంలో మధ్య తరగతి ప్రజలు అద్దె భారంగా ఉందని, ఇప్పుడు డబ్బులు కట్టమంటే ఎలా అని వాపోయారు. ఫిబ్రవరి నాటికి అన్ని కేటగిరీలకు ఉచితంగా ఇళ్లు అందించాలి. 


 మేమూ పేదవాళ్లమే :– ఇమ్మందు లక్ష్మమ్మ, తాడేపల్లిగూడెం

430 చదరపు అడుగుల్లో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరైంది. కష్టపడి లక్ష రూపాయలు చెల్లించా. ఎన్ని కల ముందు బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇస్తే సంతోషపడ్డాం. ఇప్పుడు 300 అడుగులకు మాత్రమే ఉచితమంటున్నారు. మా పరిస్థితి ఏమిటి..? మేమూ పేదవాళ్లమే. మాకూ  ఉచితంగా ఇళ్లు ఇవ్వాలి. 


 రుణం కట్టగలమా..? : – దూలం మావుళ్లేశ్వరీదేవి, భీమవరం

టిట్కో ఇళ్లను అందుకున్నం దుకు ఆనందంగా ఉంది. అయి తే ఇప్పుడు బ్యాంకు రుణం తీసుకున్న తరువాత చెల్లించ టం ఎలా అనే భయం పట్టు కుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిన నేపథ్యంలో రుణం తీర్చగలమా? అనే భయం వెంటాడుతోంది. రుణం పై ప్రభుత్వం లబ్ధిదారులను ఆదుకోవాలి. 


అందరినీ సమంగానే చూడాలి :– మాడిమి పూర్ణిమ జయరాం, తాడేపల్లిగూడెం

365 చదరపు అడుగుల సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు మం జూరైంది. ఇందుకు రూ.50 వేలు చెల్లించాం. ఇప్పుడు 300 అడుగుల కేటగిరీకి ఉచితమంటున్నారు. ముందుగా తెలిస్తే మేమూ దానికే దరఖాస్తు చేసుకునేవాళ్లం. ఇప్పుడు రూ.3.65 లక్షల బ్యాంకు రుణాలు జీవితాంతం చెల్లించు కోవాలి. ప్రభుత్వం అందరికీ సమంగానే చూడాలి. 

 అప్పు భరించలేం..  :  పెనుమజ్జి విజయలక్ష్మి, గృహిణి, పాలకొల్లు

టిడ్కో ఇళ్లలో 365 చదరపు అడుగులు ఇంటికి రూ.50 వేల కుగాను ఇప్పటి వరకూ రూ.25 వేలను రెండు వాయిదాల్లో చెల్లించాం. మేం మధ్య తరగతి వాళ్లం. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు భరించలేం. 300 చదరపు అడుగుల వారికి ఇచ్చినట్టే మాకూ ఉచితంగా ఇళ్లు ఇవ్వాలి. 

Updated Date - 2020-12-02T05:44:58+05:30 IST