ఎట్టకేలకు కొన్ని..

ABN , First Publish Date - 2022-07-01T07:26:33+05:30 IST

గత తెలుగుదేశం ప్రభుత్వం 2015లో టిడ్కో ఇళ్ల నిర్మాణం భారీఎత్తున చేపట్టింది. 2019కి చాలా ఇళ్లు పూర్తి చేసింది. 2019 ఎన్నికల ముందు కొన్ని గృహ ప్రవేశాలు కూడా చేయించింది. కానీ మౌలిక సదుపాయాలన్నీ పూర్తి కాలేదు.

ఎట్టకేలకు కొన్ని..

  • మొత్తం నిర్మించిన టిడ్కో ఇళ్లు  7,504
  • నేడు ప్రారంభిస్తున్న వాటి సంఖ్య 3,424
  • అందులో బొమ్మూరులో 2528 8 తొర్రేడులో 896
  • నిడదవోలు, కొవ్వూరుతోపాటు పలు ప్రాంతాల్లో పంపిణీ నిల్‌
  • బొమ్మూరులో విద్యుత్‌ మీటర్లు బిగించారు.. ఎలాట్‌ చేయలేదు
  • తొర్రేడులో మీటర్లూ ఇవ్వలేదు 
  • వాటర్‌ ట్యాంకూ నిర్మాణంలోనే

గత తెలుగుదేశం ప్రభుత్వం 2015లో టిడ్కో ఇళ్ల నిర్మాణం భారీఎత్తున చేపట్టింది. 2019కి చాలా ఇళ్లు పూర్తి చేసింది. 2019 ఎన్నికల ముందు  కొన్ని గృహ ప్రవేశాలు కూడా చేయించింది. కానీ మౌలిక సదుపాయాలన్నీ పూర్తి కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేవలం మౌలిక సదుపాయాలు కల్పించి, ఇవన్నీ లబ్ధిదార్లకు  ఇచ్చుంటే ఈ కాలనీలన్నీ జనావాసాలుగా విరాజిల్లేవి. వేలాది మంది పేదలు అద్దె ఇళ్లల నుంచి విముక్తి అయ్యేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఎన్నికల ముందు  ఈ ఇళ్లను ఉచితంగా ఇస్తామని వాగ్దానం కూడా చేసి, కనీసం మౌలిక సదుపాయాలూ కల్పించలేదు. కేవలం వైసీపీ రంగులు ప్రతిఫలించేలా గృహ సముదాయాలకు రంగులు వేసి సరిపెట్టింది. లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు  కొన్ని ఇళ్లను  శుక్రవారం లబ్ధిదార్లకు అందించనున్నారు. 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిడ్కో గృహాలకు ఎట్టకేలకు కొంతమేర మోక్షం కలిగే పరిస్థితి మొదలైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు ఈ ఇళ్ల పంపిణీని పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. ఇటీ వలే రుణాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నెమ్మదిగా చేస్తూ వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన బొమ్మూరులోని టిడ్కో లబ్ధిదారులకు శుక్రవారం వాటిని అందజేస్తారు. ఇక్కడ ఇటీవల కొన్ని మౌలిక సదుపాయలు కల్పించినప్పటికీ.. డొంకలు, చెత్తాచెదారం మాత్రం పేరుకుపోయి ఉంది. అవన్నీ హడావుడిగా శుభ్రం చేస్తున్నారు. బొమ్మూరులో  ఎస్‌టీపీ నిర్మాణం ప్రతిపాదన ఉంది. సెప్టిక్‌ ట్యాంక్‌ చిన్నది మాత్రమే ఉంది. కొద్దిరోజులు మాత్రం అది ఉపయోగపడుతుంది. ఎస్‌టీపీ నిర్మిస్తే ఇక్కడ శాశ్వత పరిష్కా రం లభిస్తుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు దాటినా ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నారు. లబ్ధిదార్లకు ఇళ్లు అప్పగించినా, సెప్టిక్‌ ట్యాంక్‌ సమస్య ఉంటుంది. అధి కారులు మాత్రం ఏడాది వరకూ ఉన్నదాన్ని ఉపయోగించుకోవచ్చని, ఈలోపుగా  ఎస్‌టీపీ నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు. ఇక తొర్రేడులోని టిడ్కో ఇళ్లలో విద్యుత్‌ మీటర్లు బిగించలేదు. విద్యుత్‌ లేకుండా అప్పగించినా నివాసం ఉండలేరు.   కొత్త తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం నిర్మించిన టిడ్కో ఇళ్లు 7,504. వాటిలో ప్రస్తు తం లబ్ధిదార్లకు అప్పగిస్తున్నవి 3,424 మాత్రమే. గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన చాలా ఇళ్లు ఆగిపోయాయి. రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో ప్రస్తుతం ఇస్తున్న ఇళ్లపక్కనే అప్పట్లో రెండో దశ కింద 5 బ్లాక్‌లుగా 240 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కానీ  ఈ ప్రభుత్వం వాటిని పునాదుతోనే వదిలేసింది. అవి ఎందుకూ పనికి రాకుండా కనిపిస్తున్నాయి. బొమ్మూరులో 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 1312, 365 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 544,  430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు 672. ఇందులో 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లు ఉచితం. మిగతా వాటికి కొం త లబ్ధిదారుడి భాగస్వామ్యం, మిగతాది బ్యాంక్‌ రుణం ఇస్తుంది. రాజమహేంద్రవరం పరిధిలో బొమ్మూరులో  2528, తొర్రేడులో 896,  మోరంపూడి  డి బ్లాక్‌లో 224, ధవళేశ్వరం సమీపంలోని వడ్డెర కాలనీలో 256, నామవరంలో 1104, సింహాచల నగరంలో  96, ధవళేశ్వరంలో 1200 నిర్మించారు. వీటిలో ఇప్పటివరకూ 3,800 మందికి రిజిస్ర్టేషన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ టిడ్కో గృహ సముదాయాలను ఆధునిక పద్ధతిలో షియర్వాల్‌ టెక్నాలజీతో ఎన్‌సీసీ సంస్థ శరవేగంగా నిర్మించడం విశేషం.

నేడు టిడ్కో ఇళ్లు ప్రారంభం

తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన పలు టిడ్కో గృహాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఆదిమూలం సురేష్‌  శుక్రవారం లబ్ధిదార్లకు అప్పగించనున్నారు.  మొత్తం 3424 గృహాలను అప్పగిస్తారు. బొమ్మూరులో 2528, తొర్రేడులో 896 గృహాలను ఆయన ప్రారంభిస్తారు. సాయంత్రం మూడు గంటలకు వీటిని అప్పగిస్తారు. ఉదయం జిల్లా అధికార్లతో కార్పొరేషన్‌ పరిధిలో సమావేశం నిర్వహించనున్నారు.

మౌలిక సదుపాయాలు ఎప్పుడో..

ధవళేశ్వరం : ధవళేశ్వరంలోని శ్రీరామా వడ్డెర కాలనీ వద్ద 8 బ్లాకుల్లో 256 టిడ్కో గృహాల నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందజేయలేదు. ఇక్కడ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణంతోపాటు రోడ్లు వేయాల్సి ఉంది. ప్రస్తుతం పూర్తయిన  గృహ సముదాయం చుట్టూ పిచ్చిమొక్కలు, తుప్పలు పెరిగిపోయాయి. 

ఎప్పటికి ఇస్తారో..

నిడదవోలు: నిడదవోలులోని తీరుగూడెం సమీపంలో 13.16 ఎకరాల్లో 1152 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తయిన గృహాలకు మౌలిక సదుపాయాల కల్పన నిలిచిపోయింది. మరో 96 మంది లబ్ధిదారులకు సంబంధించిన నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. 

కొవ్వూరులో ముందుకు కదలని ఇళ్ల పంపిణీ

కొవ్వూరు : కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలోని పెదతాళ్లపుంతలో రూ.31.27 కోట్లతో 480 టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు గృహ సముదాయ నిర్మాణం పూర్తయ్యింది. ఇంకా తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేసింది. పూర్తయిన ఇళ్లను సైతం లబ్ధిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుతం టిడ్కో గృహాల సముదాయం పిచ్చిమొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. గతంలో కేటాయించినవిధంగా లబ్ధిదారులకు తక్షణం 480 మందికి గృహాలను అందజేయాలని, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ టి రవికుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తున్నామని, మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే ఫ్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ చేయడం జరుగుతుందని చెప్పారు.

Updated Date - 2022-07-01T07:26:33+05:30 IST