ఇల్లు.. ఇంకెన్నాళ్లు

ABN , First Publish Date - 2021-11-08T05:01:01+05:30 IST

జిల్లాలోని మునిసిపాల్టీలు, సీఆర్‌డీఏ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన 28,304 గృహాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిలో 13,256 గృహాల నిర్మాణం పూర్తై రెండున్నరేళ్లవుతుంది.

ఇల్లు.. ఇంకెన్నాళ్లు
రేపల్లె: తుప్పు పట్టి అఽధ్వానంగా తయారైన బేస్‌మెంట్‌ లెవల్‌, శ్లాబ్‌ లెవల్‌ గృహాలు

పేదింట పండుగెప్పుడో?

వస్తూ పోతోన్న పండుగలు

అద్దె, వడ్డీల బాధల్లో లబ్ధిదారులు

మృగ్యమైన మౌలిక సదుపాయాలు

రెండున్నరేళ్లుగా పంపిణీకి నోచుకోని టిడ్కో ఇళ్లు


అదిగో అన్నారు.. ఇదిగో ఇచ్చేస్తున్నామన్నారు.. ఆ పండుగ అన్నారు.. ఈ పండుగ అన్నారు.. కాని పేదల ఇంటి పండుగ మాత్రం రెండున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. పండుగల పేర్లు చెబుతూ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను ప్రభుత్వం మభ్య పెడుతూ వస్తోంది. ఎన్నో ఆశలతో సొంతింటి కోసం ఎదురు చూస్తోన్న లబ్ధిదారులను ప్రభుత్వం మభ్యపెడుతూనే ఉంది. అట్టహాసంగా గృహాలను పంపిణీ చేస్తామంటూ చెప్తూనే ఉంది.. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దసరా.. దీపావళి పోయాయి.. క్రిస్మస్‌, సంక్రాంతి పండుగులు రానున్నాయి.. అప్పటికైనా లబ్ధిదారులు ఇళ్లు ఇస్తారా అంటే అనుమానంగానే ఉంది. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో తొమ్మిది నెలల క్రితం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అయితే టిడ్కో ఇళ్ల ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పనపై ఇప్పటికీ అధికారులు మౌనంగానే ఉన్నారు. అక్కడ తాగునీరు, విద్యుత్‌, డ్రెయినేజి, రోడ్లు తదితర మౌలిక వసతులు ఎప్పటికి కల్పిస్తారో.. తమకు ఎప్పటికి ఇళ్లు అందుతాయో అర్థంకాక అయోమయ పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నారు. టిడ్కో గృహాలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లాలోని మునిసిపాల్టీలు, సీఆర్‌డీఏ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన 28,304 గృహాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిలో 13,256 గృహాల నిర్మాణం పూర్తై రెండున్నరేళ్లవుతుంది. అయితే ఇంతవరకు ఆయా ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రభుత్వం పక్కన పడేసింది. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో కొన్ని నెలలుగా లబ్ధిదారులకు అధికారులు టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేస్తున్నారు. అయితే ఆయా ప్రాంగణాల్లో  మౌలిక వసతులు లేవు. నివాసానికి అవసరమైన కనీస వసతులు లేక పోవడంతో గృహ ప్రవేశాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కంటికి కనిపిస్తున్న ఇంట్లోకి వెళ్లలేక, మరో వైపు అద్దె ఇంటి భారం, ఇంకో వైపు ఇంటి వాటా ధనం కోసం చేసిన రూ.50 వేల అప్పుపై పెరుగుతున్న వడ్డీ లబ్ధిదారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నది. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో 4,192 గృహాలను నిర్మించారు. అలాగే నరసరావుపేటలో 1,504, తెనాలిలో 2,048, మంగళగిరిలో 1,728, చిలకలూరిపేటలో 5,712, పోన్నూరులో 2,368, రేపల్లేలో 1,344, మాచర్లలో 1,440, పిడుగురాళ్ళలో 3,648, సీఆర్‌డీఏ పరిధిలో 3,872 గృహాలను నిర్మించారు. వీటికి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది.


శిథిలావస్థకు చేరుకుంటున్న గృహాలు

టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదల కోసం ఆధునిక టెక్నాలజీతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. వాటిలో చాలావరకు నిర్మాణాలు పూర్తి కూడా చేసుకున్నాయి. చిన్నచిన్న మౌలిక వసతుల స్థాయిలో ప్రభుత్వం మారింది. దీంతో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పనులను నిలిపివేసింది. అంతకు ముందు పూర్తి అయిన ఇళ్లను కూడా పంపిణీ చేయలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇళ్లు బూజు పట్టగా, టిడ్కో ఇళ్ల ప్రాంగణాలు పిచ్చి చెట్లతో అడవులను తలపిస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో అయితే ఇనుప చువ్వలు తుప్పు పట్టిపోయాయి. గతంలో పూర్తి అయిన ఇళ్లను పలు ప్రాంతాల్లో క్వారంటైన్‌ కేంద్రాలుగా ప్రభుత్వం వినియోగించుకుని ప్రస్తుతం వదిలేసింది. దీంతో ఆ ప్రాంతాలు భయానకరంగా ఉన్నాయి. దీంతో ఆయా ఇళ్లు నివాసయోగ్యంగా లేవు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు చేసేదిలేక అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి సొంతింటి కల నేరవేరనేలేదు. ఇప్పటి వరకు మౌలికసదుపాయాల కల్పన జరగలేదు. టిడ్కో హౌసింగ్‌ కాలనీలో పూర్తి సౌకర్యాలు ఏర్పాటుకు 2022 మే, జూన్‌లోగా టిడ్కో హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజాప్రతినిధులు క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలకు పనులు పూర్తి చేసి ఇస్తామని లబ్ధిదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అయా పండుగలకు కూడా ఇళ్ళు ఇచ్చే పరిస్థితులు మచ్చుకైనా కానరావడంలేదు.

- చిలకలూరిపేట మంచినీటి చెరువు రహదారిలోని 52 ఎకరాలలో గత ప్రభుత్వ హయాంలో 5,712 టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టారు. 234 ఇళ్ల పనులు  పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన రెండో దశ పనులు ఈ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయాయి. ఇటీవల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మౌలిక వసతులు లేక పోగా, టిడ్కో ఆవరణలో కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. బూజుపట్టి దుమ్ముతో ఇళ్లు నిండిపోయాయి. 

- తెనాలిలో గత ప్రభుత్వం వైకుంఠపురం ఎదురుగా నిర్మించిన 800కు పైగా గృహాలలో లబ్ధిదారుల చేత గృహ ప్రవేశాలు కూడా చేయించింది. విద్యుత్‌, రోడ్లు, డ్రెయినేజి పనులను పూర్తి చేస్తే లబ్ధిదారులు ఆయా ఇళ్లలో చేరేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు పట్టించుకో లేదు. ఈ గృహాలను కరోనా బాధితుల కోసం క్వారంటైన్‌ కేంద్రంగా మార్చారు. ఏఎస్‌ఎన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా పూలే కాలనీ దగ్గర ప్రారంభించిన టిడ్కో నిర్మాణాలు ఎక్కడైతే నిలిచాయో ప్రస్తుతం  అదే దశలో ఉన్నాయి.

- పిడుగురాళ్లలో 3,648 టిడ్కో ఇళ్లు మంజూరుకాగా 2018లోనే 75 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలు సర్వేలు చేసి లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేర్పులు చేసి అనుకూలమైన వారికి ఇళ్లు కేటాయించారు. అయినా నేటికి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వలేదు. గతంలోనే రూ.59.87 లక్షల వరకు లబ్ధిదారులు డిపాజిట్‌ చెల్లించారు. ఇప్పటికి ఇళ్లు కేటాయించకపోవడంతో పలువురు తమ డిపాజిట్‌ వెనక్కి ఇచ్చేయాలని అధికారులను కోరుతున్నారు.

- పొన్నూరు, నిడుబ్రోలులో టిడ్కో గృహ నిర్మాణాలు మూడేళ్లుగా ఆలనాపాలన కరువై కునారిల్లుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన 2,368 ఇళ్ల పంపిణీ ప్రస్తుతం పడకేసింది. 2021 జనవరిలో ప్రతిపక్షాల ఆందోళనతో రెండోసారి లబ్ధిదారులను ఎంపికచేసి 2,156 మందికి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అయితే ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదు.   ఈ కాలనీలో మెరకతోపాటు, డ్రెయినేజి, తాగునీరు,  విద్యుద్ధీకరణ తదితర పనులు చేయాల్సి ఉంది.   వాటర్‌ హెడ్‌ట్యాంకు  పునాదులకే పరిమితమైంది.

- మాచర్ల ఎస్‌కేబీఆర్‌ కళాశాల సమీపంలో 1500 టిడ్కో గృహాలు మంజూరుకాగా గత ప్రభుత్వ హయాంలోనే 1440 గృహాల నిర్మాణాలు 90 శాతం వరకు పూర్తయ్యాయి. వీటి పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. దీంతో గృహ నిర్మాణాల వద్ద పిచ్చిచెట్లు, కంప పెరిగిపోయాయి. గృహాలు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.         

- సత్తెనపల్లి భీమవరం డొంకరోడ్డు ప్రాంతంలో 300 వరకు చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల పనులు నేటికీ అసంపూర్ణంగానే ఉన్నాయి. మార్చి నాటికి టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఆ దిశగా పనులు మాత్రం సాగడంలేదు.

- రేపల్లెలో మున్సిపల్‌ ఎన్నికలకు మూడు నెలల  ముందు టిడ్కో లబ్ధిదారులకు గృహాన్ని కేటాయిస్తూ హడావుడిగా మంజూరు పత్రాలను అందజేశారు. బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి వాయిదాల మొత్తం కూడా చెల్లించాలని ఆర్పీలు అధికారులను ఆదేశించారు. ఇప్పటకే లబ్ధిదారులు రెండు కిస్తీలను  అప్పులు చేసి జమ చేశారు. అయితే ఆగిన ఇళ్లు ఎప్పటికి పూర్తి చేస్తారో.. తామెప్పుడు గృహ ప్రవేశాలు చేస్తామో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. 

- వినుకొండలోని వెల్లటూరు రోడ్డులో టిడ్కో ఇళ్ల  నిర్మాణం చేపట్టారు. టీడీపీ హయాంలోనే 80 శాతం మేర 192 సింగిల్‌ బెడ్‌ రూమ్‌లు, 60 డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలు పూర్తయ్యాయి. మిగతా 20 శాతం పనులు పూర్తిచేసి పంపిణీ చేయకుండా వదిలేశారు.  


Updated Date - 2021-11-08T05:01:01+05:30 IST