పనిచేసే వారికి పట్టం కట్టండి

ABN , First Publish Date - 2021-02-28T05:50:48+05:30 IST

పనిచేసే వారికి పట్టం కట్టండి

పనిచేసే వారికి పట్టం కట్టండి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

  • అభ్యర్థి వాణీదేవి విద్యావేత్త, సామాజికవేత్త
  • ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో 
  • రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు


ఆదిభట్ల : ప్రశ్నించే గొంతులను కాదు.. కష్టపడి పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తన్నీరు హరీ్‌షరావు కోరారు. ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరులో కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్‌లో శనివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీ్‌షరావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుల పేరుతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటేస్తే వచ్చే లాభం  ఏమీ లేదన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే యువత భవిష్యత్‌కు బాటలు పడతాయన్నారు. నాడు దుమ్ము కొట్టుకొని ఎడారిగా ఉన్న తెలంగాణ.. నేడు దమ్మున్న తెలంగాణగా అభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు సవాల్‌ విసురుతోందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని అన్నారు.  మన పథకాలు కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపీ కొట్టిందని తెలిపారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిని అనుకొని ఎన్నికల్లో పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని మాజీ ప్రధాని పీవీ కూతురుగానే కాకుంగా ఓ విద్యావేత్తగా, సామాజికవేత్తగా చూడాలని అన్నారు. ఎన్నికల్లో ఏకైక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో  దించి మహిళలకు సమున్నత స్థానం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ చేసిన కృషి ఫలిస్తుందన్నారు. గెలుపు ఖాయమనే విషయం ప్రజల్లో నుంచే వస్తోందన్నారు.  ఈ సమావేశంలో శాసనమండలి సభ్యు లు శంభీపూర్‌ రాజు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు క్యామ మల్లేష్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణా రెడ్డి, డీసీసీబీ వైస్‌ చర్మన్‌ కొత్తకుర్మ సత్త య్య, ఎంపీపీ కృపేష్‌ తదిత రులు పాల్గొన్నారు.


రైతులను నడిరోడ్డున పడేసిన ఘనత బీజేపీదే..

మేడ్చల్: దేశంలో రైతులను నడిరోడ్డున పడేసి, నిత్యావసరాల ధరలు పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డీ విరిచిన ఘనత బీజేపీదేనని ఆర్థిక శాఖ మంత్రి హరీ్‌షరావు అన్నారు.  మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా, కండ్లకోయ సీఎంఆర్‌ ఆడిటోరియంలో పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పుట్టినందునే తెలంగాణ వచ్చిందని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చాయన్నారు.  బీజే పీ పాలనలో దేశంలో రోజురోజుకూ జీడీపీ పడిపోతుండగా టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలుస్తోందన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందులు రానివ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతీ పట్టభద్రుడిని కలుస్తూ పోలింగ్‌బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T05:50:48+05:30 IST