పులి కోసం అన్వేషణ

ABN , First Publish Date - 2020-12-02T04:28:58+05:30 IST

పులి కోసం పెంచికలపేట, బెజ్జూరు, దహెగాం రేంజ్‌ పరిధిలోని అటవీ శాఖాధికారులు వేట కొనసాగిస్తున్నారు.

పులి కోసం అన్వేషణ
సీసీ కెమెరాలు అమరుస్తున్న అటవీ అధికారులు

-సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా

-హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ టీంతో గాలింపులు

-అటవీ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు

-కొండపల్లిలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

పెంచికలపేట, డిసెంబరు1: పులి కోసం పెంచికలపేట, బెజ్జూరు, దహెగాం రేంజ్‌ పరిధిలోని   అటవీ శాఖాధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఆయా రేంజ్‌ల పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. గత నెల 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి హతమార్చిన ఘటన మరవక ముందే ఆదివారం పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో   పసుల నిర్మల అనే గిరిజన బాలికను బలిగొంది. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. అలాగే పులి జాడ కోసం అటవీ శాఖాధికారులు మంగళవారం అడవి బాట పట్టారు. పెంచికలపేట మండలంలోని కొండపల్లి పరిసరాల్లో, బెజ్జూరు బీట్‌లోని సులు గుపల్లి బీట్‌లో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. కొండపల్లిలో ఘటన జరిగిన ప్రాంతాన్ని డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు సభ్యులతో కూడిన హైదరాబాద్‌ కన్జర్వేషన్‌ సొసైటీ (హైటికోస్‌) టీంతో కలిసి స్థానిక రేంజ్‌ అధికారులు అటవీ ప్రాంతంలో పులి కదిలికలు ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తూ   అన్వేషణ కొనసాగిస్తున్నారు. 


అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన

పెద్ద పులి వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అటవీ శాఖాధికారులు, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సభ్యులు ప్రజలకు పులులపై అవగాహన కల్పిస్తున్నారు. పత్తి చేనులలో, పంట పొలాల్లో వంగి పనిచేస్తున్న సమయంలో జంతువు అనుకుని దాడి చేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.  వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంపులు గుంపులుగా పనులకు వెళ్లాలని సూచించారు.  సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో పులులు చురుకుగా సంచరిస్తాయని టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సభ్యులు తెలిపారు. కాబట్టి సాయంత్రం 6 గంటల తరువాత అటవీ ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయవద్దని ప్రతి ఒక్కరు అటవీ శాఖాధికారులకు సహకరించాలని వారు  సూచించారు. 

చేనుకు వెళ్లాలంటే భయంగా ఉంది 

-పల్లెం వెంకటి, కొండపల్లి

పట్ట పగలు చేనులో పత్తి ఏరుతున్న బాలికను పులి చంపిన ఘటనను తలుచుకుంటే పంట పొలాలకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. నిత్యం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాం. అధికా రులు త్వరగా పులిని పట్టుకోవాలి. 


నిపుణులను నియమిస్తేనే కట్టడి సాధ్యం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మహారాష్ట్రలోని తడోబా-అంధారి అభయారణ్యం నుంచి జిల్లాలోని అటవీ ప్రాంతానికి పులుల రాకపోకలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు నాలుగు నెలల పాటు జనసంచారం లేకపోవడంతో అరుదైన బెంగాల్‌ జాతి పులులు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో స్వేఛ్చగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో అటు మహారాష్ట్రలో ఇటు తాజాగా తెలంగాణలో పులులు మనుషులను చంపి తింటున్న ఘటనలు పెరుగుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఇద్దరిని చంపేయడంతో పులులను కట్టడి చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికారులు ఇక్కడ మనుషులను చంపింది రెండూ వేర్వేరు పులులని చెబుతున్నారు. అయితే అందుకు ఆధారాలేమిటన్నవి చూపలేకపోతున్నారు. జిల్లాలో స్థానికంగా పుట్టి పెరిగిన పులుల సంఖ్య 12కు చేరింది. మహారాష్ట్రలో అక్కడి  అటవీ శాఖ పులుల సంరక్షణలో భాగంగా ప్రతీ పులికి ఒక గుర్తింపు సంఖ్యతో పాటు పేరును కూడా చేర్చి వాటి కదలికలపై పర్యవేక్షణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ సంచరిస్తున్న పులులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? అనే సమాచారాన్ని తెలుసుకునే పరిస్థితి స్థానిక అటవీ యంత్రాంగానికి అందుబాటులో లేదు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని రణతంభోర్‌ నేషనల్‌ పార్క్‌, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్‌ పులుల అభయారణ్యంలో నిర్వహిస్తున్న పులుల సంరక్షణ తరహాలో ఇక్కడ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే కొంత వరకు అటు పులులకు, ఇటు మనుషులకు ఎలాంటి హాని జరగకుండా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఒక్కో పులి స్వేచ్ఛగా సంచరించడానికి 20-30 చదరపు కిలోమీటర్ల పరిధి అవసరం. ప్రస్తుతం మహారాష్ట్రలోని తడోబా ప్రాంతంలో సంచరిస్తున్న కొన్ని పులులకు రేడియో కాలర్లను బిగించి  పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని పులులకు అలాంటి సదుపాయం లేకపోవడం వల్ల వాటి పర్యవేక్షణ అటవీ సిబ్బందికి సవాలుగా మారింది.  

గేదెల మందపై పులి దాడి

కాగజ్‌నగర్‌/రూరల్‌, డిసెంబరు1: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఆడెపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం గేదెల మందపై పులి దాడి చేయడంతో ఒక గేదెకు గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం కడంబా గ్రామానికి చెందిన గేదెలను పశువుల కాపరి బుర్స చంద్రయ్య మేపడానికి ఆడెపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే తిరిగి వస్తున్న సమయంలో నాలుగు గేదెలపై పులి దాడి చేయడంతో ఒకదానికి గాయాలయ్యాయి. ఈవిషయాన్ని పశువుల కాపరి గ్రామస్థులకు తెలియజేయడంతో వారు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అలాగే కాగజ్‌నగర్‌ మండలంలోని మానిక్‌పటార్‌లో కూడా పులి సంచరించింది. ఇందుకు సంబంధించి పులి నడిచినట్టు స్పష్టంగా అడుగులు కూడా పడ్డాయి. ఈ విషయాన్ని కొంత మంది ప్రభుత్వ సిబ్బంది, గ్రామస్థులు నేరుగా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయమై ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌ను సంప్రదించగా పశువుల మందపై పులి దాడి చేసిందని తమకు కూడా సమాచారం అందిందని, ఈ సంఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని ఆయన తెలిపారు. మానిక్‌పటార్‌లో కూడా పులి సంచరించినట్టు సమాచారం ఉందని ఎఫ్‌డీవో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-02T04:28:58+05:30 IST