సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి జాడ

ABN , First Publish Date - 2022-02-02T18:15:20+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దపులుల సంచారం కలవరం రేపుతోంది. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని అటవీప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అధికారులు

సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి జాడ

- వారం రోజులుగా చంద్రాయపాలెం అడవుల్లో సంచారం

- నాగుపల్లి అటవీ ప్రాంతంలోనూ ఆనవాళ్లు


సత్తుపల్లి‌/దమ్మపేట(ఖమ్మం): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దపులుల సంచారం కలవరం రేపుతోంది. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని అటవీప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీప్రాంతంలో పులిసంచారాన్ని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు ఓ పులి చిక్కింది. మంగళవారం తెల్లవారుజామున 3:20గంటల సమయంలో అన్నపురెడ్డిపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇప్పటికే ఈ పెద్దపులి ఆనవాళ్లను గుర్తించేందుకు ఎనిమిది బృందాలు గాలిస్తుండగా.. మంగళవారం దాని జాడ సీసీ కెమెరాకు చిక్కిందని రేంజర్‌ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి హాని తలపెట్టలేదని, అయినా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పులి రోజుకు 27కిలోమీటర్ల ప్రయాణం సాగించగలదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పులి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లి అటవీ ప్రాంతం వైపు వెళ్తున్నట్టు అధికారులు చెబుతుండగా... మంగళవారం రేంజర్‌ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాగుపల్లి అటవీప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించామని, వాటి నమూనాలను సేకిరించామని ఆయన తెలిపారు. గతేడాది కూడా పూసుకుంట, అశ్వారావుపేట, దమ్మపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించిందని అప్పుడు సేకరించిన పాదముద్రలు, ఇప్పటి పులి పాదముద్రలు ఒకేలా ఉన్నాయని వివరించారు. 

Updated Date - 2022-02-02T18:15:20+05:30 IST