పులి పంజాకు మరొకరు బలి

ABN , First Publish Date - 2020-11-30T04:53:05+05:30 IST

పెంచికలపేట మండలంలోని కొండపల్లికి గ్రామానికి చెందిన గిరిజన బాలిక పసుల నిర్మల(15) ఆదివారం పెద్దపులి దాడిలో మృతిచెందింది.

పులి పంజాకు మరొకరు బలి
పసుల నిర్మల

-పెంచికలపేట మండలం కొండపెల్లి దగ్గర మృతిచెందిన గిరిజన బాలిక

-భయాందోళనలో అటవీ సరిహద్దు గ్రామాలు

పెంచికలపేట, నవంబరు29: పెంచికలపేట మండలంలోని కొండపల్లికి గ్రామానికి చెందిన గిరిజన బాలిక పసుల నిర్మల(15) ఆదివారం పెద్దపులి దాడిలో మృతిచెందింది.  ఉదయం నిర్మల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే తన బంధువు అన్నం సత్తయ్య చేనులోకి ఆరుగురు కూలీలతో కలిసి పత్తి తీసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం నిర్మల మిగతా వారికి దూరంగా ఉన్న పాయలో పత్తి తీస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసి ఆమెను ఈడ్చుకెళ్లింది. ఆమె అరుపులతో మిగతా కూలీలు భయపడ్డారు. తోటి కూలీల్లో ఒకడైన చక్రవర్తి కర్రలు తీసుకుని పులి వెంట పరుగెత్తాడు. దీంతో పులి నిర్మలను వదిలేసి కొంతదూరం వెళ్లింది. తోటి కూలీలు ధైర్యం చేసి నిర్మల వద్దకు వెళ్లి చూసేసరికి అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. వారు మృతదేహాన్ని తీసుకువస్తుండగా పులి మళ్లీ వారి వెంట పడింది. అప్పటికే వీరి కేకలు విని చుట్టుపక్కల చేలలో పని చేస్తున్న వారు అక్కడి వచ్చారు. పులి మళ్లీ రావడం చూసిన వారు అరుస్తూ దానిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రామస్థులకు సమాచారం తెలియడంతో అందరూ సంఘటనా స్థలానికి వచ్చారు. 

జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, ఏఎస్పీ సుదీంద్ర, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు సంఘటనా స్థలానికి వెళ్లి పులి దాడి ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.25లక్షల నష్టపరిహారం అందించాలని బంధువులు, స్థానికులు డిమాండ్‌ చేశారు. అటవీశాఖలో ఉద్యోగంతో పాటు రూ.5లక్షలు అందిస్తామని అటవీ అధికారులు పేర్కొన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబానికి మరో రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి చంపిన విషయం మరువక ముందే ఆదివారం మరో బాలిక మృతి చెందింది. దీంతో అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.

ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించా

-చక్రవర్తి, ప్రత్యక్ష సాక్షి

ఉదయం పూట పత్తి ఏరేందుకు కూలీలం వెళ్లాం. మధ్యాహ్నం ఒక్కసారిగా నిర్మలపై పులి దాడి చేసి అటవిలోకి పట్టుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను కర్రలతో, బండరాళ్లతో పులిని కొడుతూ కేకలు వేస్తూ నిర్మలను కాపాడేందుకు శతావిధాలా ప్రయత్నం చేశా. తోటి కూలీలు కూడా అరుపులు, కేకలు వేస్తూ వచ్చారు. దీంత పులి నిర్మలను వదిలి కొంతదూరం వెళ్లింది. నిర్మల వద్దకు వెళ్లి చూసే సరికే మృతి చెంది ఉంది. ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా పులి మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించింది. అందరం బిగ్గరగా అరవడంతో అడవిలోకి వెళ్లిపోయింది. 

పులి ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు

-జిల్లా అటవీ అధికారి శాంతారాం

పులి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. టైగర్‌ వైల్డ్‌ లైఫ్‌ బృందాలతో రెండు బోన్లను ఏర్పాటు చేశాం. గిరిజనుల వలసను ఆపేందుకు రోజుకు 20 మంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేస్తాం. దహెగాం, పెంచికలపేటలో పులి దాడి ఘటనలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. 


18 రోజుల వ్యవధిలో ఇద్దరి హతం  

కాగజ్‌నగర్‌/బెజ్జూరు: కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో బెజ్జూరు, దహెగాం, పెంచికపేట ప్రాంతాల్లో పులుల దాడులు అధికమవుతున్నాయి. ఆదివారం పులి దాడిలో పసుల నిర్మల మృతిచెందడంతో జిల్లా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల 11న దహెగాం మండలం దిగిడలో చేపల వేట కోసం వెళ్లిన విఘ్నేష్‌పై దాడి చేసి చంపేసింది. వరుస సంఘటనతో ప్రజలు అంతా భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. సిర్పూరు నియోజకవర్గంలోని బెజ్జూరు, దహెగాం, పెంచికల్‌పేట ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం గుండా కాగజ్‌నగర్‌కు వివిధ అవసరాల కోసం పల్లె వాసులు వస్తుంటారు. ఈ ప్రాంతంలోనే పులులు కూడా నిత్యం తిరుగుతుంటాయి. కొంతమంది యువకులు పులి సంచారాన్ని సెల్‌ఫోన్‌లో తీసి సోషల్‌ మీడియాలో కూడా పెట్టారు. దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేశ్‌పై దాడి చేసి చంపేసిన తర్వాత అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో మకాం వేశారు. 


పులి కోసం ప్రత్యేక బోన్లు ఏర్పాట్లు

మనుషులను తింటున్న పులిపై గట్టి నిఘా పెట్టారు. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతానికి సంబంధించిన పులి కాదని తేల్చేశారు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు ప్రాథమిక స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక బోన్లను తెప్పించారు. వీటితో పాటు వైల్డ్‌లైఫ్‌ ట్రాకర్స్‌తో పూర్తి నిఘా పెట్టారు. అయినా పులి చిక్కక పోవడంతో తిరిగి మహారాష్ట్రకు పోయినట్టు అంతా అనుకున్నారు. కాగా ఆదివారం   కొండపల్లికి చెందిన నిర్మలపై దాడి చేయటంతో అంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తోందని గ్రామీణ ప్రాంతాల  ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. మూడు నెలల క్రితం కాగజ్‌నగర్‌ మండలం నారాపూర్‌ శివారులో కూడా పులి చేన్లలో తిరుగుతున్నట్టు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అడవికి సమీపంలోకి   పొలాల్లోకి ఎవరూ పోవద్దని రైతులకు అధికారులు సూచనలు చేశారు. ఈ మార్గంలో కూడా రాత్రి వేళల్లో ఎవరినీ వెళ్లనీయడం లేదు. సిర్పూరు(టి) వెళ్లే రైల్వే గేటు సమీపంలో కూడా గత నెలలో   పులి పట్టాలు దాటుతున్నట్టు పలువురు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

వణుకుతున్న పల్లెలు 

బెజ్జూరు-పెంచికలపేట ప్రధాన రహదారి గుండా అటవీ ప్రాంతంలో పెద్దపులులు తిష్ట వేసి ఉండడంతో ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయా ణికులు జంకుతున్నారు. ఇటీవల బెజ్జూరు మండలంలోని హేటిగూడ, అంబగట్టు, అందుగుల గూడ, గొల్లదేవర, మాణిక్య దేవరాల వద్ద అటవీ ప్రాంతంలో పులి సంచారం గుర్తించి పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు సాధ్యమైన త్వరగా పులిని పట్టుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2020-11-30T04:53:05+05:30 IST