ఎలమంచిలి వైపు పెద్దపులి!

ABN , First Publish Date - 2022-07-01T06:28:29+05:30 IST

అటవీ శాఖ అధికారులను నెల రోజుల నుంచి ముప్పు తిప్పలు పెడుతూ, రెండు జిల్లాల సరిహద్దు మండలాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్ద పులి (రాయల్‌ బెంగాల్‌ టైగర్‌) తాజాగా ఎలమంచిలి సబ్‌డివిజన్‌ పెదపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది.

ఎలమంచిలి వైపు పెద్దపులి!
కోటవురట్ల మండలం రామచంద్రపురంలో పులి పాదముద్రలను పరిశీలిస్తున్న నర్సీపట్నం రేంజర్‌ రాజబాబు

కోటవురట్ల మండలం రామచంద్రపురంలో పులి అడుగుజాడలు

అక్కడి నుంచి పందూరు మీదుగా పెదపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశం

రెస్క్యూ టీమ్‌ సమాచారంతో అధికారులు అప్రమత్తం

సమీప గ్రామాల్లో మైకులతో ప్రచారం

అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు


కోటవురట్ల/ ఎలమంచిలి, జూన్‌ 30: అటవీ శాఖ అధికారులను నెల రోజుల నుంచి ముప్పు తిప్పలు పెడుతూ, రెండు జిల్లాల సరిహద్దు మండలాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్ద పులి (రాయల్‌ బెంగాల్‌ టైగర్‌) తాజాగా ఎలమంచిలి సబ్‌డివిజన్‌ పెదపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఈ మేరకు  రెస్క్యూ టీమ్‌ అందించిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలో సుమారు నెల రోజుల నుంచి సంచరిస్తున్న పెద్దపులి మంగళవారం రాత్రి తాండవ నది పరీవాహక ప్రాంతం నుంచి నక్కపల్లి మండలం తిరుపతిపాలెం మీదుగా కోటవురట్ల మండలం టి.జగ్గంపేట పంచాయతీ శ్రీరామపురం గ్రామంలోకి వచ్చి ఒక గేదెను చంపేసి కొంత భాగాన్ని తినేసిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కదలికలను గుర్తించేందుకు మూడుచోట్ల ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. తడపర్తి, శ్రీరామపురం, టి.జగ్గంపేట, కైలాసపట్నం గ్రామాల ప్రజలు బుధవారం రాత్రి ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. గురువారం ఉదయం కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలో పులి పాదముద్రలను గుర్తించిన స్ధానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నర్సీపట్నం రేంజర్‌ రాజబాబు, సిబ్బంది వచ్చి పరిశీలించారు.  

ఇందేశమ్మ ఘాట్‌రోడ్డు వద్ద పెద్ద పులి ప్రత్యక్షం?

కాగా కోటవురట్ల మండలం ఇందేశమ్మఘాట్‌ రోడ్డులో గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో పెద్దపులిని చూసినట్టు జల్లూరు గ్రామానికి చెందిన యువకులు చెబుతున్నారు. తాము కోటవురట్ల నుంచి అడ్డురోడ్డుకు బైక్‌పై వెళుతుండగా ఘాట్‌రోడ్డులో పెద్దపులి కనిపించిందని, భయంతో వెనక్కు తిరిగివచ్చేశామని రామచంద్రపురం జంక్షన్‌ వద్ద స్థానికులకు తెలిపారు. ఈ విషయాన్ని అక్కడే వున్న పందూరు గ్రామానికి చెందిన చీకట్ల వెంకట్‌ అనే యువకుడు కోటవురట్ల ఎస్‌ఐ నారాయణరావుకు ఫోన్‌ చేసి చెప్పారు. అటవీ శాఖాధికారులతో మాట్లాడతానని ఎస్‌ఐ తెలిపారు.  

గ్రామాల్లో అప్రమత్తం

కోటవురట్ల మండలంలో సంచరించిన పెద్దపులి ఎలమంచిలి మండలం పెదపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిందన్న రెస్క్యూ టీమ్‌ సమాచారంతో ఎలమంచిలి అటవీ రేంజ్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. గురువారం అటవీ సెక్షన్‌ అఽధికారి జి.రవికుమార్‌, సిబ్బంది కలిసి పెదపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెం, కొక్కిరాపల్లి గ్రామాల్లో పర్యటించి, పెద్దపులి సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేశారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. మళ్లీ తాము ప్రకటించే వరకు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈ ప్రాంతంలో పులిని లేదా దాని పాదముద్రలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. 


Updated Date - 2022-07-01T06:28:29+05:30 IST