IPl: Mumbai indians నిరాశపరిచినా.. ఓ ఆణిముత్యం దొరికింది

ABN , First Publish Date - 2022-05-18T01:50:57+05:30 IST

IPl 2022 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదంటే.. ముంబై ఇండియన్స్(Mumbai indians) అని నిస్సందేహంగా సమాధానం చెప్పొచ్చు

IPl: Mumbai indians నిరాశపరిచినా.. ఓ ఆణిముత్యం దొరికింది

ముంబై : IPl 2022 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదంటే.. ముంబై ఇండియన్స్(Mumbai indians) అని నిస్సందేహంగా సమాధానం చెప్పొచ్చు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు(మంగళవారం మ్యాచ్ పూర్తవ్వక ముందు) ఆడిన ఈ జట్టు మూడింట్లో మాత్రమే గెలిచింది. టోర్నీ ఆరంభమైన నాటి నుంచీ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలోనే కొనసాగుతోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శనతో ఈ జట్టు చతికిలపడింది. ఐదుసార్లు ట్రోపీని ముద్దాడిన ఈ జట్టుకు 2022 సీజన్ ఓ పీడకలలా మిగలనుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే జట్టుగా ముంబై ఇండియన్స్ ఓటములు చవిచూస్తున్నా.. అదే జట్టుకు ఆడుతున్న ఓ కుర్రాడు మాత్రం ఆణిముత్యంలా మెరిశాడు. రోహిత్ శర్మ, కిరోన్ పొలార్డ్ వంటి హేమాహేమీలు విఫలమైన పిచ్‌లపైనే పరుగులు రాబట్టి శెభాష్ అనిపించుకుంటున్నాడు. అతడే హైదారాబాద్‌కు చెందిన ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ. 19 ఏళ్ల ఈ కుర్రాడు విశేషంగా రాణిస్తున్నాడు.


ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ ఏకంగా 368 పరుగులు కొట్టాడు. కోట్లు పోసి కొనుగోలు చేసిన చాలామంది ఆటగాళ్ల కంటే ఎక్కువ పరుగులే సాధించాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఎలాంటి బంతులనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్న తిలక్ వర్మ ప్రతిభను ఇప్పటికే పలువురు క్రికెటర్లు గుర్తించారు. తిలక్ వర్మ భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని రోహిత్ ప్రశంసించాడు. రోహిత్ అంచనాలను సునీల్ గవాస్కర్ సమర్థించాడంటే తిలక్ వర్మ బ్యాటింగ్ ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


హైదరాబాద్‌‌కు చెందిన తిలక్ వర్మది పేదకుటుంబ నేపథ్యం. అతడి తండ్రి ఓ ఎలక్ట్రిషీయన్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లలో ఒకడు. ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసే వరకు తిలక్ వర్మ పెద్దగా వెలుగులోకి రాలేదు. ఐపీఎల్ వేలంలో తిలక్ వర్మ బేస్ ప్రైస్ రూ.20 లక్షలుగా ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. దీంతో ఏకంగా రూ.1.7 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

Updated Date - 2022-05-18T01:50:57+05:30 IST