చిన్న ఐపీఓలే ముద్దు... హెచ్‌ఎన్‌ఐ తీరు మారింది...

Dec 7 2021 @ 17:08PM

ముంబై : మార్కెట్‌ పార్టిసిపెంట్లలో 'హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌'(హెచ్‌ఎన్‌ఐ) లేదా సంస్థాగతేతర పెట్టుబడిదారులు ఓ భాగమన్న విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ఐపీఓల్లో బిడ్లను దాఖలు చేసి, లిస్టింగ్‌ డే ప్రయోజనాలను పొంది, ఆ స్టాక్‌‌ల నుంచి బయటపడతారు. పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు... ఇష్యూల సమయంలో ఈ పెట్టుబడిదారులకు రుణాలనిస్తాయి. హెచ్‌ఎన్‌ఐలు లిస్టింగ్ ప్రయోజనాలను పొందిన తర్వాత... ఆ అప్పును వడ్డీతో సహా చెల్లిస్తారు. మిగిలిన మొత్తం లాభం. 


గతంలో, ఈ వర్గం పెట్టుబడిదారులు, చిన్న ఐపీఓలను పెద్దగా పట్టించుకునేవారు కాదు, పెద్ద ఐపీఓలను ఏమాత్రం వదిలేవారు కాదు. అయితే... ఈ ఏడాది... పెద్ద ఐపీఓలు తగినంత రాబడిని అందించకపోతుండడంతో, వాటి నుంచి దూరం జరిగి, చిన్న ఇష్యూలను ముద్దు చేస్తున్నారు. ఈ(2021) సంవత్సరంలో ఇప్పటివరకు... రూ. రెండు వేల కోట్ల కంటే ఎక్కువ సైజ్‌లో ఉన్న 17 ఐపీఓల్లో కేవలం నైకా, జొమాటోకు మాత్రమే హెచ్‌ఎన్‌ఐల నుంచి భారీ బిడ్లు వచ్చాయి. ఇదే సమయంలో... రూ. రెండు వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న 20 ఐపీఓల కోసం రూ. 20,000-రూ. 77,000 కోట్ల వరకు బిడ్లు వేశారు.


పెద్ద ఐపీఓలతో పోలిస్తే, చిన్నవాటిలో ఫండింగ్‌ సులభంగా పూర్తవుతుంది. పైగా, పెద్దవాటి కంటే బాగానే రిటర్న్స్‌ ఇస్తున్నందున... చిన్న ఐపీఓలను 'అస్యూర్డ్‌ డీల్‌'లా హెచ్‌ఎన్‌ఐలు భావిస్తున్నారు. ఇటీవల కొన్ని చిన్న ఐపీఓలు రికార్డ్‌ స్థాయిలో హెచ్‌ఎన్‌ఐ సబ్‌స్క్రిప్షన్‌లు చూశాయి. పరాస్ డిఫెన్స్ ఐపీఓ సైజు కేవలం రూ. 171 కోట్లు కాగా, దీని హెచ్‌ఎన్‌ఐ పోర్షన్‌ 928 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. లాటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 600 కోట్ల ఐపీఓలో హెచ్‌ఎన్‌ఐల వాటా రికార్డు స్థాయిలో 851 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఈ వర్గం దాదాపు రూ. 77 వేల కోట్ల విలువైన బిడ్లను వేసింది. తేగా ఇండస్ట్రీస్ రూ. 619 కోట్ల ఐపీఓలకు 666 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇందుకుగాను... రూ. 62 వేల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. తత్వచింతన్, నజారా టెక్నాలజీస్, ఈజీ ట్రిప్ ప్లానర్స్‌, రోలెక్స్ రింగ్స్‌కు కూడా హెచ్‌ఎన్‌ఐల వాటా 360-512 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. 


ఒక ఐపీఓకు ఓవర్‌ సబ్‌‌స్క్రిప్షన్ జరిగినపక్షంలో, ఆ స్క్రిప్‌‌నకు డిమాండ్‌ భారీగా పెరుగుతుంది. లిస్టింగ్ రోజున భారీ లాభాలనార్జించే అవకాశాలున్నందున, ఆ తరహా ఐపీఓలకు రుణాలివ్వడానికి ఫైనాన్స్ కంపెనీలు మొగ్గు చూపుతాయి. ఇక... స్టార్ హెల్త్, పేటీఎం, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌, నువోకో విస్టాస్‌ వంటి పెద్ద IPOల్లో హెచ్‌ఎన్‌ఐ పెట్టుబడులు తగ్గాయి. స్టార్ హెల్త్ ఐపీఓ సైజు రూ. 7,249 కోట్లు కాగా, పేటీఎం సైజు రూ. 18,300 కోట్లు. వీటి హెచ్‌ఎన్‌ఐ వాటాలు అండర్‌ సబ్‌‌స్ర్కైబ్  అయ్యాయి. 


ఏప్రిల్‌ నుంచి ముకుతాడు... 

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి, ఐపీఓల్లో పార్టిసిపేట్‌ చేయాలనుకునే పెద్ద పెట్టుబడిదారులకు ఎన్‌బీఎఫ్‌సీలు రూ. కోటి కంటే ఎక్కువ రుణాలు ఇవ్వకుండా రిజర్వ్ బ్యాంకు కట్టడి చేసింది. ఈ క్రమంలో... ఐపీఓల్లో వందల రెట్ల సబ్‌స్క్రిప్షన్ల ఉన్మాదం తగ్గుతుందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. కేవలం ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ చూసి, అందులో పెట్టుబడులు పెట్టి రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోకుండా ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.