కాంగ్రెస్‌కు ఇదో హెచ్చరిక : Amarinder Singh

ABN , First Publish Date - 2022-06-05T21:01:23+05:30 IST

పంజాబ్‌లో కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోవడం, నలుగురు కాంగ్రెస్ ప్రముఖులు బీజేపీలో చేరడంపై కెప్టెన్ ..

కాంగ్రెస్‌కు ఇదో హెచ్చరిక : Amarinder Singh

చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోవడం, ఐదుగురు కాంగ్రెస్ ప్రముఖులు బీజేపీలో చేరడంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ (Capt. Amarinder Singh) సూటిగా స్పందించారు. కాంగ్రెస్‌కు జరగబోయే భారీ నష్టానికి ఇదో చిన్న సంకేతమని (Tip of Iceberg) ఆయన అన్నారు. రాష్ట్ర మాజీ మంత్రులైన డాక్టర్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గుర్ ప్రీత్ సింగ్ కంగార్, సుందర్ శ్యామ్ అరోరా, థిల్లాన్‌లు శనివారంనాడు బీజేపీలో చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు.


దీనిపై ఓ ట్వీట్‌లో కెప్టెన్ అమరీందర్ స్పందించారు. ''ఇదో సంకేతం మాత్రమే''అంటే కెప్టెన్ అమరీందర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. సరైన మార్గంలో, సరైన చర్య తీసుకున్నారంటూ బల్బీర్ ఎస్.సిద్ధూ, కంగార్, వెర్కా, అరోరా, కేవల్ సింగ్ థిల్లాన్‌లకు తన ట్వీట్‌లో ఆయన అభినందనలు తెలియచేశారు. ఈ నలుగురు నేతలు అమరీందర్‌కు సన్నిహితులు కూడా.


కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు జాఖర్ ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. శనివారం మరో నలుగురు జాఖడ్ బాటే పట్టడంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.

Updated Date - 2022-06-05T21:01:23+05:30 IST