ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2021-01-27T06:24:42+05:30 IST

గ్యాస్‌ స్టవ్‌ బర్నర్స్‌పై వంట పదార్థాలు లేదా పాలు, డికాక్షన్‌ లాంటివి పొంగిపోయి పడిపోతుంటాయి. దాంతో బర్నర్ల రంధ్రాలు మూసుకుపోయి సరిగా పనిచేయవు.

ఇలా చేసి చూడండి!

గ్యాస్‌ స్టవ్‌ బర్నర్స్‌పై వంట పదార్థాలు లేదా పాలు, డికాక్షన్‌ లాంటివి పొంగిపోయి పడిపోతుంటాయి. దాంతో బర్నర్ల రంధ్రాలు మూసుకుపోయి సరిగా పనిచేయవు. బర్నర్ల నుంచి నీలి మంట రాకుండా ఎర్ర మంట రావడం జరుగుతుంది. బర్నర్లు నల్లగా తయారవుతాయి. బర్నర్ల రంధ్రాల్లో ధూళి చేరడం వల్ల మంట సరిగా రాదు.  బర్నర్లు అలా ఉంటే వంట కూడా తొందరగా అవదు. అందుకే కనీసం రెండు నెలలకొకసారి గ్యాస్‌బర్నర్లను శుభ్రం చేయాలి. ఒక గిన్నె తీసుకుని అందులో గ్యాస్‌ బర్నర్లు మునిగే మేర వెనిగర్‌ పోసి నాలుగు గంటలు అలాగే ఉంచాలి. మధ్యలో బర్నర్లను రెండో వైపుకు కూడా తిప్పి పెట్టాలి. నాలుగు గంటలు పూర్తయిన తర్వాత మెటల్‌ బ్రష్‌తో వీటిని శుభ్రం చేయాలి. ఈ బ్రష్‌ బర్నర్‌ రంధ్రాలలోకి సైతం పోయి అందులోని ధూళి, రకరకాల పార్టికల్స్‌ని బయటకు వచ్చేట్టు చేస్తుంది.


బర్నర్ల మురికిని పోగొడుతుంది. వాటిని ఇంకోసారి కూడా మెటల్‌ బ్రష్‌తో  క్లీన్‌ చేసుకుంటే బర్నర్‌ రంధ్రాల్లో  ఏదైనా మిగిలివున్న మురికి కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆ బర్నర్లను పీతాంబరి పొడితో తోమాలి. బర్నర్లకు ఇంకా కాస్త నల్లదనం ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా  పోగొట్టడానికి నిమ్మచెక్కపై ఉప్పు వేసి దానితో బర్నర్లు తోమి నీళ్లతో కడిగేయాలి. ఆ తర్వాత వీటిని పొడిగుడ్డతో బాగా తుడిచి ఆరబెట్టాలి. ఇలా చేస్తే గ్యాస్‌ బర్లర్లు మిల మిల మెరవడమే కాదు వాటి రంధ్రాలు క్లీన్‌గా ఉంటాయి. మెటల్‌ బ్రష్‌ లేకపోతే స్టీల్‌ స్క్రబ్బర్‌తోనైనా గ్యాస్‌ బర్నర్లను శుభ్రం చేసుకోవచ్చు. కానీ బర్నర్ల రంధ్రాల్లోని మురికి స్క్రబ్బర్‌తో పూర్తిగా పోదు కాబట్టి గ్యాస్‌ బర్నర్లు శుభ్రం చేయడానికి మెటల్‌ బ్రష్‌ వాడకమే ఉత్తమం. 

Updated Date - 2021-01-27T06:24:42+05:30 IST