తిరుమల నా పేరు మార్చింది!

ABN , First Publish Date - 2021-10-03T06:29:32+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఐరాల మండలవాసి సప్తగిరి తన సక్సెస్‌ క్రెడిట్‌ అంతా ఏడుకొండల స్వామిదేనంటున్నాడు.వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తాను ఫలితం మాత్రం స్వామికే వదిలేస్తానంటున్నాడు.శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమల వచ్చిన ఆయన తన ప్రస్థానాన్ని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.

తిరుమల నా పేరు మార్చింది!

 తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఐరాల మండలవాసి సప్తగిరి తన సక్సెస్‌ క్రెడిట్‌ అంతా ఏడుకొండల స్వామిదేనంటున్నాడు.వచ్చిన ప్రతి అవకాశాన్ని  సద్వినియోగం చేసుకుంటున్న తాను ఫలితం మాత్రం స్వామికే వదిలేస్తానంటున్నాడు.శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమల వచ్చిన ఆయన తన ప్రస్థానాన్ని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.

 తిరుమల వెంకన్నపై భక్తితో చిన్నతనం నుంచీ కొండకు వచ్చిపోయేవాడిని. ఏ ప్రమాదం వచ్చినా స్వామి కాపాడతాడనే విశ్వాసం వుండేది.ఇంటర్‌ చదివేప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.దాంతో స్వామికి చెప్పుకుందామని కొండకొచ్చా. దర్శనం తర్వాత ఆలయం బయటికి వచ్చి మాడవీధుల్లో నిలుచున్నా. ‘ఏంటి స్వామీ నా లైఫ్‌.. ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. నువ్వే దారి చూపాలి’ అనుకుంటూ ఆలయాన్ని అలా చూస్తూ ఉండిపోయా.ఇంతలో వెనకనుంచి ఓ వ్యక్తి ‘నాయనా సప్తగిరీ పక్కకు జరుగు’ అన్నాడు. ఎవరా అని చూస్తే కాషాయ వస్ర్తాలు ధరించిన వ్యక్తి కనిపించాడు. నన్ను చూసి నవ్వుతూ వెళ్లిపోయినా ఆయన పిలిచిన సప్తగిరి అనే పేరు నా మనసులోకి వెళ్లిపోయింది. ‘స్వామీ.. ఇకపై నా పేరు సప్తగిరిగా మార్చుకుంటున్నా. సంతోషంగా ఉంచు స్వామీ’  అని ప్రార్థించా.నిజంగానే ఆ రోజు నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. సినిమా అంటే చిన్నప్పట్నుంచీ పిచ్చి. జీవితంలో గొప్పగా ఎదగాలన్నా సినిమాయే మార్గమనిపించింది.వేంకటేశ్వర స్వామిపై భారం వేసి హైదరాబాదు వెళ్లిపోయా. దాదాపు ఏడేళ్ల పాటు అస్టిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన తర్వాత అనుకోకుండా దర్శకులు భాస్కర్‌, మారుతి ద్వారా నటుడిగా లైఫ్‌ స్టార్ట్‌ చేశా. కొన్నాళ్ల తర్వాత హీరోగానూ అవకాశాలొచ్చాయి.సప్తగిరి హాస్యనటుడే కాదు మంచి ఆర్టిస్ట్‌ అంటూ చాలామంది ప్రముఖులు పొగిడారు. మంచి పాత్రలు వస్తే కామెడీ విలన్‌గా కూడా చేస్తా. సినీ పరిశ్రమ అంటే ప్రాణం. ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.సినిమారంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం.ప్రస్తుతం ‘గూడుపుఠాణి’ షూటింగు పూర్తయింది. ఈనెలలోనే ఓటీటీ ద్వారానో, వీలైతే థియేటర్లలోనో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.గోల్డ్‌మెన్‌ ,8 తదితర చిత్రాల్లో నటిస్తున్నా. 

                         - తిరుమల, ఆంధ్రజ్యోతి


Updated Date - 2021-10-03T06:29:32+05:30 IST