తిరుమల డిక్లరేషన్‌పై టీడీపీ పట్టు

ABN , First Publish Date - 2020-09-23T16:57:03+05:30 IST

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సాంప్రదాయబద్ధంగా..

తిరుమల డిక్లరేషన్‌పై టీడీపీ పట్టు

డిక్లరేషన్‌ ఇచ్చాకే సీఎం ఆలయంలో అడుగుపెట్టాలంటూ చంద్రబాబు డిమాండ్‌ 

జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపు  

పోలీసు యంత్రాంగంపై పెరిగిపోయిన ఒత్తిడి 


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సాంప్రదాయబద్ధంగా కుటుంబంతో కలసి వచ్చి సమర్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. అలా కాకుండా ఒక్కరే తిరుమల వచ్చిన పక్షంలో హిందూ మత విశ్వాసాల పట్ల, శ్రీవారి పట్ల గౌరవం కలిగివున్నానంటూ డిక్లరేషన్‌ ఇచ్చాకే ఆలయంలో అడు గుపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.ఆయన మంగళవారం టెలికాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోని 2 వేల మంది టీడీపీ క్రియాశీలక కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తి అన్ని మతాలనూ సమానంగా గౌరవించాల్సి వుంటుందని, అయితే జగన్‌ మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు హిందూ ఆలయాల్లో అభ్యంతరకర ఘటనలు జరిగినా సీఎం జగన్‌ కనీసం ఒక్కదాన్ని కూడా ఖండించలేదని ఆరోపించారు. సీఎం హోదాలో జగన్‌ చిత్తూరు జిల్లాకు రావడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తిరుమల బ్రహ్మోత్సవాలకు మాత్రం సాంప్రదాయానుసారం కుటుంబంతో కలసి వెళ్ళాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్కరే వస్తే మాత్రం డిక్లరేషన్‌ ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు.


దీనిపై జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ తీరు పట్ల నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.అంతేకాకుండా జిల్లాలోని ముఖ్యనేతలంతా బుధవారం తిరుపతి చేరుకోవాలని,తిరుమల వస్తున్న సీఎం జగన్‌కు నిరసన తెలపాలని ఆదేశించారు. తద్వారా సీఎం జగన్‌ అనుసరిస్తున్న ఽధోరణులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.


తిరుపతిలో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహం?

టీడీపీ అధినేత ఆదేశాల మేరకు బుధవారం తిరుపతి వస్తున్న సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు జిల్లా టీడీపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. ముందుగానే కార్యక్రమాన్ని ఖరారు చేసి శ్రేణులకు సమాచారమిస్తే పోలీసు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసికట్టి భగ్నం చేస్తాయనే కారణంగా కార్యక్రమ వివరాలను గోప్యంగా వుంచుతున్నారు. తిరుపతిలో ఎప్పుడు, ఎక్కడ ఏ రూపంలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకోవాలనే దానిపై  తర్జనభర్జనలు పడుతున్నారు. తిరుపతి నగరంలో ఏదో ఒక కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదని, సీఎం కాన్వాయ్‌ వెళ్ళే మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే పోలీసు వర్గాల నుంచీ పెద్దగా నిర్బంధాలేమీ వుండవని నేతలు భావిస్తున్నారు.


అయితే దానివల్ల పెద్దగా ప్రచారం రాదని, విషయం ప్రజల్లోకి వెళ్ళదని భావిస్తున్నందున దానికి బదులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయాలన్నది వారి ఆలోచనగా వుంది.ఒకవేళ కాన్వాయ్‌ను అడ్డుకోలేక పోయినా ఆ ప్రయత్నం ద్వారా ప్రజల్లోకి ఈ అంశాన్ని సులువుగా తీసుకెళ్ళవచ్చునని ముఖ్యనేతలు భావిస్తున్నారు. కాకపోతే ఈ ప్రయత్నంలో టీడీపీ నేతలు ఎంతవరకూ సఫలీకృతులవుతారన్నది చూడాల్సి వుంది. ఎందుకంటే పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా మంగళవారం రాత్రికే ముఖ్యనాయకులందరినీ గృహ నిర్బంధానికి గురి చేయడమో లేకుంటే వారిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించడమో చేసే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో టీడీపీ ప్రయత్నాలకు బీజేపీ, జనసేన శ్రేణులు సహకరిస్తే జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మాత్రం ఫలప్రద మయ్యే అవకాశముంది.


ఇప్పటికే బీజేపీ నేతలు  భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ తదితరులు సీఎం జగన్‌ తన సతీమణి సహా వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలన్న డిమాండ్‌ను వినిపిస్తుండడడడాన్ని ఈ సందర్భంగా గమనించాల్సివుంది. మరోవైపు చంద్రబాబు తిరుపతిలో సీఎం జగన్‌కు నిరసన తెలియజేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం, జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరపాలని ఆదేశించడంతో జిల్లా పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి పెరిగిపోయింది.


Updated Date - 2020-09-23T16:57:03+05:30 IST