
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 28వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాది నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఉగాది, బ్రహ్మోత్సవాలు, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశికి ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయంలోని ఉప ఆలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజాసామగ్రిని శుద్ధి చేస్తారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.