18 చోట్ల విరిగిపడిన కొండచరియలు.. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు మూసివేత

ABN , First Publish Date - 2021-11-19T17:32:03+05:30 IST

భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా అల్లాడుతోంది. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్డుపై వరద పారుతోంది. దీంతో అధికారులు తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు.

18 చోట్ల విరిగిపడిన కొండచరియలు.. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు మూసివేత

తిరుమల : భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా అల్లాడుతోంది. ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్డుపై వరద పారుతోంది. దీంతో అధికారులు తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. తిరుమలకు భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడంతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు రెండో ఘాట్ రోడ్‌లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఘాట్‌ రోడ్లను అధికారులు మూసివేశారు. 


కపిలతీర్థం, తిరుమల బైపాస్‌ రోడ్‌పై వందలాది వాహనాలు స్తంభించాయి. రెండ్రోజుల పాటు కనుమ దారులను మూసివేశారు. కనుమ దారులను మూసివేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊరట కల్పించింది. నేడు, రేపు దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు తరువాతి రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతినివ్వనున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.


రేణిగుంట విమానాశ్రయ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుపతి-కడప మార్గాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తిరుపతి-పీలేరు మార్గంలో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. శ్రీనివాసపురం వంతెనపై లారీ చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. కల్యాణి జలాశయం వరద ఉధృతితో పీలేరు మార్గంలో సైతం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


Updated Date - 2021-11-19T17:32:03+05:30 IST