ఘనంగా తిరుపతమ్మ జలబిందెల ఉత్సవం

ABN , First Publish Date - 2021-02-28T06:53:53+05:30 IST

తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం జలబిందెల మహోత్సవం కన్నులపండువగా జరిగింది.

ఘనంగా తిరుపతమ్మ జలబిందెల ఉత్సవం

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 27 : తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం జలబిందెల మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ముందుగా గ్రామానికి చెందిన శాలివాహనులు ఐదు కొత్త కడవలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అందజేశారు. అక్కడి నుంచి మునేటికి ఊరేగింపుగా వెళ్లి క్రతువులు చేశారు. కొత్త కుండలను పవిత్ర మునేటి జలాలతో నింపి ప్రత్యేక పూజలనంతరం గ్రామానికి చెందిన వడ్లమూడి, కల్లూరి, గజ్జి, కర్ల, నల్లపునేని వర్గీయులు జలబిందెలను తలపై పెట్టుకుని మేళతాళాలు, కనకతప్పెట్లతో ఊరేగింపుగా పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. జలబిందెలు స్టేషన్‌కు చేరగానే సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై రామకృష్ణ, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి పూజలు చేశారు. అక్కడి నుంచి అమ్మవారి ఆలయం వరకు భారీ ఊరేగింపుగా జలబిందెల ఉత్సవం జరిగింది. బిందెలను ఆలయంలోని ఉన్నవూరు అంకమ్మ వద్ద పెట్టి పూజలు చేశారు.  ఆలయ ఈవో మూర్తి, సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి, వూట్ల నాగేశ్వరరావు, వేల్పుల రవికుమార్‌, కాకాని శ్రీనివాసరావు, గింజుపల్లి నర్సయ్య, నల్లూరి శ్రీను, కాకాని హరి, కల్లూరి శ్రీవాణి, తహసీల్దార్‌ షాకిరున్నిసాబేగం, ఎంపీడీవో రాజు, ఏఈవో జంగం శ్రీనివాసరావు, కార్యదర్శి రాంబాబు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  





Updated Date - 2021-02-28T06:53:53+05:30 IST