Tirupathi: రూ. 75 లక్షలు విలువైన Red Sandalwood స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-06T20:19:00+05:30 IST

పోలీసులు రూ. 75 లక్షలు విలువైన 43 ఎర్ర చందనం దుంగలు, ఒక కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Tirupathi: రూ. 75 లక్షలు విలువైన Red Sandalwood స్వాధీనం

తిరుపతి (Tirupathi): చిన్నగొట్టిగల్లు మండలం, దేవరగట్టు పంచాయితీ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు (Police) రూ. 75 లక్షలు విలువైన 43 ఎర్ర చందనం దుంగలు, ఒక కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాశ్ (Ravi Prakash) మీడియాతో మాట్లాడుతూ ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. బెంగళూరు కేంద్రంగా  వసీం ఖాన్, నదీం ఖాన్‌లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, ఆ ఇద్దరూ ప్రధాన స్మగ్లర్లుగా గుర్తించామన్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామన్నారు. వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని రవిప్రకాశ్ తెలిపారు.


శేషాచలం అడవులను ఎర్రచందనం ఖజానాగా పేర్కొంటారు. రోజూ టన్నుల కొద్దీ నరికి తరలించేస్తున్నా తరిగిపోని సంపద ఈ అడవుల్లో దాగి ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న ఎర్ర చందనం అక్రమ నరికివేత మూడేళ్లుగా మరీ ఊపందుకుంది. అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్‌ పేరుకే తప్ప క్రియాశీలంగా లేవు. అడవుల్లో కూంబింగ్‌, స్మగ్లర్లపై దాడులు, వెంటాడి పట్టుకోవడం వంటి చర్యలు దాదాపుగా లేవు. వాహనాలు అదుపు తప్పి తిరగబడి ఎర్రచందనం బయటపడితేనో, చెక్‌పోస్టుల్లో దొరికిపోతేనో మాత్రమే చందనం దుంగలు దొరికాయని లెక్కలు చెబుతున్నారు. దుంగలు దొరికినా దొంగలు మాత్రం దొరకరు. అరుదుగా దొంగలూ పట్టుబడ్డా, బలహీనమైన కేసులతో బయటపడి మళ్లీ అడవిబాట పడుతున్నారు. ఈ విధంగా శేషాచలంలో స్మగ్లర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. వారి కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేదు. విచ్చలవిడిగా చందనం చెట్లు నరికి పోగులుపెడుతున్నారు. 

Updated Date - 2022-07-06T20:19:00+05:30 IST