నంద్యాలలో తిరుపతి వాసి నిరసన

ABN , First Publish Date - 2021-07-25T05:48:32+05:30 IST

గాంధీచౌక్‌ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తిరుపతికి చెందిన వీరప్రసాద్‌ అనే వ్యక్తి ప్లకార్డు చేతపట్టుకొని శనివారం నిరసనకు దిగాడు.

నంద్యాలలో తిరుపతి వాసి నిరసన

నంద్యాల(ఎడ్యుకేషన్‌), జూలై 24: గాంధీచౌక్‌ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట తిరుపతికి చెందిన వీరప్రసాద్‌ అనే వ్యక్తి ప్లకార్డు చేతపట్టుకొని శనివారం నిరసనకు దిగాడు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల వన్‌టౌన్‌ పోలీసులు తనను వేధిస్తున్నారని, డబ్బులు వసూలు చేయడమే కాకుండా తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించాడు. కర్నూలు ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వ్యక్తి మరదలితో తన తమ్ముడికి జరిగిన నిశ్చితార్థం రద్దయినందుకు తనపై పగ పెంచుకున్నాడని ఆరోపించాడు. పోలీస్‌ శాఖను ఆ కానిస్టేబుల్‌ తన కక్ష సాధింపునకు వాడుకుంటున్నాడన్నాడు. కాగా వీరప్రసాద్‌ ఆరోపణలను వన్‌టౌన్‌ సీఐ ఓబులేసు ఖండించారు. వీరప్రసాద్‌ కుటుంబంపై ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఐదు కేసులు ఉన్నాయన్నారు. 2019లో వీరప్రసాద్‌ తమ్ముడు మోహన్‌కృష్ణ తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం చేసుకుని రూ.12 లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్న కానుకల కింద తీసుకున్నాడన్నారు. ఆ తరువాత నంద్యాలలోని మరో యువతితో నిశ్చితార్థం కుదుర్చుకుని రూ.12 లక్షల నగదు, ఆరు తులాల బంగారం తీసుకొని 2019 డిసెంబర్‌ 8వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న మక్తల్‌కు చెందిన యువతి, తల్లిదండ్రులు, బంధువులు వచ్చి పెళ్లి ఆపారని చెప్పారు. దీంతో ఇరువురు యువతులు వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో మోహన్‌కృష్ణ కుటుంబంపై కేసు పెట్టారన్నారు. అంతేగాకుండా వీరప్రసాద్‌పై హైదరాబాద్‌లోని చార్మినార్‌ పోలీ్‌సస్టేషన్‌లో తన భార్యపై వేధింపుల కేసు, 2008లో ప్రకాశం జిల్లాకు చెందిన అల్లాడి రమే్‌షను మోసం చేసిన కేసులో నంద్యాల త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. 



Updated Date - 2021-07-25T05:48:32+05:30 IST