గోవాలో మమతా పార్టీ కీలక ముందడుగు

ABN , First Publish Date - 2021-12-07T00:18:16+05:30 IST

సోమవారం గోవా టీఎంసీ ఇంచార్జి మహువా మోయిత్రా ఆధ్వర్యంలో ఎంజీపీ అధినేత దీపక్ దివలికర్‌తో టీఎంసీ నేతలు ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఎంజీబీకి 12 స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది..

గోవాలో మమతా పార్టీ కీలక ముందడుగు

పనాజి: గోవాలో కాంగ్రెస్, గోవా ఫార్వాడ్ పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో బలమైన శక్తిగా నిలవాలని అనుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేందుకు మమతా బెనర్జీ పార్టీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.


సోమవారం గోవా టీఎంసీ ఇంచార్జి మహువా మోయిత్రా ఆధ్వర్యంలో ఎంజీపీ అధినేత దీపక్ దివలికర్‌తో టీఎంసీ నేతలు ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఎంజీబీకి 12 స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వాస్తవానికి ఎంజీబీ ఇంతకు ముందు కాంగ్రెస్, ఆప్ పార్టీలతో సంప్రదింపులు జరిగింది. అయితే వారితో సయోధ్య కుదరకపోవడంతో టీఎంసీ చర్చలు చేసింది. ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలం కావడంతో సీట్ల సర్దుబాటు కూడా పూర్తైంది. ఇదే ఉత్సాహంతో బెంగాల్ బయట విజయం సాధించి దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని టీఎంసీ ఉబలాటంలో ఉంది.

Updated Date - 2021-12-07T00:18:16+05:30 IST