Dilip Ghosh Comments Row: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌తో భేటీ కానున్న టీఎంసీ బృందం

ABN , First Publish Date - 2022-07-07T21:31:26+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై

Dilip Ghosh Comments Row: పశ్చిమ బెంగాల్ గవర్నర్‌తో భేటీ కానున్న టీఎంసీ బృందం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఎనిమిది మంది టీఎంసీ (TMC) నేతలు గురువారం ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను కలవబోతున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ మమత కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఎంసీ ఆరోపిస్తోంది. 


దిలీప్ ఘోష్ ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, మమత బెనర్జీ (Mamata Banerjee) 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) శాసన సభ ఎన్నికల ప్రచార సమయంలో తాను బెంగాల్ బిడ్డనని చెప్పుకున్నారన్నారు. ఆ తర్వాత ఆమె గోవాలో పర్యటించినపుడు తాను తీర ప్రాంత బిడ్డనని చెప్పుకున్నారన్నారు. తల్లిదండ్రులకు చిరునామా లేదా? ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మాట్లాడటమేనా? అన్నారు. 


ఈ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని మమత బెనర్జీ సమీప బంధువు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఆరోపించారు. బుధవారం ఆయన తన ట్విటర్ ఖాతాలో ఘోష్ వ్యాఖ్యల క్లిప్‌ను షేర్ చేశారు. ఈ వదరుబోతును అరెస్టు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని డిమాండ్ చేశారు. దేశంలో ఏకైక సిటింగ్ మహిళా ముఖ్యమంత్రి గురించి బీజేపీ నేతలు ఇలా మాట్లాడతారా? అని నిలదీశారు. దిలీప్ ఘోష్ వంటివారు రాజకీయ బురద జల్లడం నిరాటంకంగా కొనసాగుతోందన్నారు. 


టీఎంసీ ఎంపీ డాక్టర్ కకోలీ దస్తిదార్ ఇచ్చిన ట్వీట్‌లో, దిలీప్ ఘోష్ సిగ్గుపడాలన్నారు. భారతీయ విలువలను మంటగలుపుతున్నందుకు నిరసనగా తాను నల్ల చీరను ధరిస్తున్నానని చెప్పారు. దిలీప్ ఘోష్ వైఖరిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఆయనపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘోష్ వ్యాఖ్యలు మహిళలపై వివక్షతో కూడినవని ఆరోపించారు.


గవర్నర్ ధన్‌కర్‌ను కలవబోతున్న టీఎంసీ బృందంలో కుణాల్ ఘోష్, మాలా రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, తపస్ రే తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-07-07T21:31:26+05:30 IST