త్రిపురలో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన టీఎంసీ

ABN , First Publish Date - 2021-11-22T19:00:11+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో త్రిపురలో రోజురోజుకూ శాంతిభద్రతల..

త్రిపురలో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన టీఎంసీ

న్యూఢిల్లీ:  స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో త్రిపురలో రోజురోజుకూ శాంతిభద్రతల పరిస్థితులు క్షీణిస్తున్నాయంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించింది. టీఎంసీ దాఖలు చేసిన కంటెప్ట్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మంగళవారంనాడు ఈ పిటిషన్‌పై విచారణ జరుపనుంది.


చట్టాలకు అనుగుణంగా శాంతియుతంగా రాజకీయ ప్రచారం చేసుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, వారిని నిరోధించకుండా తగు చర్యలు తీసుకోవాలని త్రిపుర పోలీసు అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, అగర్తలా మున్సిపల్ సంస్థలకు ఈనెల 25న ఎన్నికల జరుగనున్న తరుణంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో త్రిపురలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆదివారంనాడు టీఎంసీ త్రిపుర విభాగం స్టీరింగ్ కమిటీ చీఫ్ సుబల్ భౌమిక్ నివాసంపై జరిగిన దాడిలో పలువురికి గాయాలైనట్టు ఆ పార్టీ ఇంతకుముందు ఆరోపించింది. పోలీసులు పాశవికంగా వ్యవహరిస్తుండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసేందుకు టీఎంసీ ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకుంది. అమిత్‌షా ఆపాయింట్‌మెంట్ కోరింది.


హోం మంత్రి నివాసం వెలుపల నిరసన

మరోవైపు, టీఎంసీ యువజన విభాగం అధ్యక్షురాలు సాయోని ఘోష్‌ను అగర్తలాలో అరెస్టు చేసినందుకు నిరసనగా ఆ పార్టీ నేతలు హోం మంత్రి నివాసం వెలుపల నిరసనకు దిగారు.

Updated Date - 2021-11-22T19:00:11+05:30 IST