Prime Minister's Residence: ప్రధాని నివాసానికి ఆ పేరు పెడతారేమో : టీఎంసీ ఎంపీ

ABN , First Publish Date - 2022-09-06T17:45:10+05:30 IST

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పదునైన

Prime Minister's Residence: ప్రధాని నివాసానికి ఆ పేరు పెడతారేమో : టీఎంసీ ఎంపీ

కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పదునైన వ్యాఖ్యలు చేసే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర (Mahua Moitra) మరోసారి విజృంభించారు. ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌ (Kartavya Path)గా మార్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆమె సోమవారం ఘాటుగా స్పందించారు. అసలేం జరుగుతోందని నిలదీశారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన మంత్రి  నివాసానికి కూడా ఓ పేరు పెట్టే అవకాశం ఉందని మంగళవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 


ఢిల్లీలోని ఇండియా గేట్ సీ-హెక్సాగాన్ వద్ద ఉన్న నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఉన్న ప్రాంతం, రోడ్డు పేరు రాజ్‌పథ్. ఈ రాజ్‌పథ్ పేరును మార్చి కర్తవ్యపథ్ అని పెట్టాలని ఢిల్లీ నగరపాలక సంస్థ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బుధవారం జరిగే నగర పాలక సంస్థ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


లండన్‌లోని కింగ్స్‌వే మాదిరిగా ఈ రాజ్‌పథ్‌ను రూపొందించారు. దీనిని బ్రిటిష్ వలస పాలన కాలంలో నిర్మించారు. వలస పాలకుల గుర్తులన్నిటినీ చెరిపేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని మోదీ తన ప్రసంగాల్లో చెప్తూనే ఉన్నారు. 


ఈ నేపథ్యంలో మహువా మొయిత్ర ( (Mahua Moitra) మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్ అని మార్చబోతున్నట్లు తెలుస్తోందన్నారు. అదేవిధంగా నూతన ప్రధాన మంత్రి నివాసానికి కింకర్తవ్యవిమూఢ (గందరగోళం, అయోమయం నిండినవారు, దేనినీ అర్థం చేసుకోలేనివారి) మఠం (Kinkartavyavimudh Math) అని పెడతారన్నారు. ఈ సందర్భంగా ఆమె బెంగాలీలో అత్యుత్తమ నాన్సెన్స్ స్టోరీస్‌లో ఒకటైన హజబరల (HaJaBaRaLa)ను ప్రస్తావించారు. ఇది చిన్న పిల్లల నవల. దీనిలో ఓ పాత్ర ప్రతివారికీ, ప్రతిదానికీ ఓ వింత పేరును పెడుతూ ఉంటుంది. 


దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం, ఇతర పరిపాలనా భవనాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ విస్టా పేరుతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ప్రస్తుత సౌత్ బ్లాక్ వెనుక ప్రధాన మంత్రి నివాసాన్ని నిర్మిస్తున్నారు. దీనికి కింకర్తవ్యవిమూఢ మఠం అని పేరు పెడతారని తాను అనుకుంటున్నానని మహువా వ్యాఖ్యానించారు. 


రాజ్‌పథ్ పేరు మార్పు వార్తలపై మహువా సోమవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ, అసలేం జరుగుతోందని ప్రశ్నించారు. బీజేపీ మన చరిత్రను తిరగరాయాలనే తన దురహంకార పిచ్చితనంలో మన వారసత్వాన్ని, మన సంస్కృతిని పునరావృతం చేయడమే ఏకైక కర్తవ్యంగా పెట్టుకుందా? అని నిలదీశారు. 


గతంలో మారిన పేర్లు

ఔరంగజేబు రోడ్డును 2015లో ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చారు. 2016లో రేస్‌కోర్స్ రోడ్డుకు లోకమాన్య మార్గ్ అని పేరు పెట్టారు. 2017లో డల్హౌసీ రోడ్డుకు దారా షికోహ్ రోడ్డు అని నామకరణం చేశారు. 2018లో తీన్ మూర్తి చౌక్‌కు తీన్ మూర్తి హైఫా చౌక్ అని పేరు పెట్టారు. అక్బర్ రోడ్డు పేరును మార్చాలనే ప్రతిపాదనలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. 


Updated Date - 2022-09-06T17:45:10+05:30 IST