చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలంటూ టీఎంసీ తీర్మానం

ABN , First Publish Date - 2022-04-04T20:36:29+05:30 IST

సోమవారం ఆయన వివిధ పార్టీల్లో ఉన్న మహిళా ఎంపీల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీకి నిబద్ధత ఉంటే మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏప్రిల్ 8కి ముందు తాము పార్లమెంట్‌లో..

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలంటూ టీఎంసీ తీర్మానం

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ ఏనాటి నుంచో ఉంది. అయితే బిల్లు రూపం నుంచి చట్ట రూపం దాల్చడం లేదు. అప్పుడప్పుడు ఈ విషయమై రాజకీయ చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. కానీ చర్చ చట్టాన్ని చేరడం లేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మరోసారి లేవనెత్తింది. రాజ్యసభలో టీఎంసీ పక్ష నేత డెరెక్ ఓబ్రెయిన్.. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధికార పార్టీ బీజేపీకి సవాల్ విసిరారు.


సోమవారం ఆయన వివిధ పార్టీల్లో ఉన్న మహిళా ఎంపీల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీకి నిబద్ధత ఉంటే మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏప్రిల్ 8కి ముందు తాము పార్లమెంట్‌లో నిబంధన 168 కింద ఒక తీర్మానాన్ని పెట్టబోతున్నామని, దానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. నిబంధన 168 కింద ప్రజా ప్రయోజన విషయాలను ఎంపీలు లేవనెత్తవచ్చు. దాని ప్రకారమే టీఎంసీ ఈ తీర్మానాన్ని తీసుకురానుంది.


ఇక చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతి అలా ఉంచితే ఈ బిల్లుపై వాగ్దానాలు చేసే పార్టీలు కూడా మహిళలకు సముచిత స్థాయిలో స్థానాలు కేటాయించలేదు. ఒక టీఎంసీ, బీజేడీ మాత్రమే కోటా దాటి కేటాయించాయి. టీఎంసీ పెద్ద మొత్తంలో 40 శాతం టికెట్లు మహిళలకు ఇవ్వగా బీజేడీ 36 శాతం టికెట్లు కేటాయించింది. ఇంకే పార్టీ 15 శాతానికి మించి టికెట్లు కేటాయించలేదు. ప్రస్తుతం లోక్‌సభలో 15 శాతం మహిళా ఎంపీలు ఉండగా రాజ్యసభలో 12.2 శాతం మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. రెండు సభల్లోనూ టీఎంసీ 37 శాతం ఎంపీలతో ముందంజలో ఉంది. ఎన్సీపీ 33శాతం, బీజేడీ 29 శాతంతో ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి.

Updated Date - 2022-04-04T20:36:29+05:30 IST