15 రాష్ట్రాలకు టీఎంసీని విస్తరిస్తాం: అభిషేక్ బెనర్జీ

ABN , First Publish Date - 2021-10-24T16:16:50+05:30 IST

మరో ఏడాది నాటికి దేశంలోని 15 రాష్ట్రాల్లో టీఎంసీని ప్రారంభించనున్నట్లు పార్టీ అధినేత మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు...

15 రాష్ట్రాలకు టీఎంసీని విస్తరిస్తాం: అభిషేక్ బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ వరుసగా మూడోసారి ఘన విజయం సాధించిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా తీసుకువెళ్లాలని మమతా బెనర్జీ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే త్రిపుర, గోవా సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. కాగా మరో ఏడాది నాటికి దేశంలోని 15 రాష్ట్రాల్లో టీఎంసీని ప్రారంభించనున్నట్లు పార్టీ అధినేత మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘మేము ఇప్పటికే త్రిపుర, గోవా రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాం. తొందరలోనే ఉత్తరప్రదేశ్, మేఘాలయ సహా మరో ఐదు రాష్ట్రాలకు పార్టీ కార్యకలాపాల్ని విస్తరిస్తాం. మరో ఏడాదిలో దేశంలోని 12 నుంచి 15 రాష్ట్రాలకు టీఎంసీని విస్తరిస్తాం. గుజరాత్, గోవా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నా అక్కడికి వెళ్లి ఓడిస్తాం. దీని కోసం స్థానిక నేతలను, పార్టీలను సంప్రదిస్తాం. వారి సహాయంతో బీజేపీని ఓడిస్తాం’’ అని అభిషేక్ అన్నారు.


ఇక బెంగాల్‌ బీజేపీ గురించి మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు ముందు అమిత్ షా ఇక్కడికి వచ్చి అనేక వాగ్దానాలు చేసి వెళ్లారు. ఎన్నికల్లో ఓడిపోగానే గుజరాత్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి ఒక్క బీజేపీ నేత ఇటువైపు రావడం లేదు. ఎందుకంటే వాళ్లు బయటి వ్యక్తులు. బెంగాలీల గురించి, బెంగాలీల అవసరాల గురించి వారికి తెలియవు. ఎన్నికల కోసం తప్పితే ప్రజల కోసం వాళ్లు బెంగాల్‌కు రారు’’ అని అభిషేక్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-10-24T16:16:50+05:30 IST