రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన తమిళనాడు సీఎం స్టాలిన్

ABN , First Publish Date - 2022-02-03T21:58:56+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా..

రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన తమిళనాడు సీఎం స్టాలిన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమిళుల సమస్యల గురించి పార్లమెంటులో లేవనెత్తినందుకు తమిళులందరి తరపున తాను థ్యాంక్స్ చెబుతున్నట్టు పేర్కొంటూ ట్వీట్ చేశారు. రాహుల్ పార్లమెంటులో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎప్పుడో 1947లోనే రద్దైన ‘ఇండియాకు రాజు’ విధానాన్ని బీజేపీ తిరిగి తెస్తోందని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయనీ వ్యాఖ్యలు చేశారు.


రాజ్యాంగంలో భారత్‌ను రాష్ట్రాల యూనియన్‌‌గా పేర్కొన్నారని, ఇప్పుడీ భావనను ప్రభుత్వం నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులను అణచివేయలేరని అన్నారు. సమాఖ్య వ్యవస్థలో సహకారం అవసరాన్ని రాహుల్ నొక్కి చెబుతూ.. ఒకసారి అశోకుడు, మౌర్యులు గురించి తెలుసుకోవాలని, వారు మాటలు, చర్చల ద్వారానే రాజ్యాలను పాలించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చరిత్రపై అవగాహన లేదని, రాష్ట్రాల యూనియన్ అనే భావనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మాట్లాడుకోవడం, చర్చల ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ అన్నారు. 

Updated Date - 2022-02-03T21:58:56+05:30 IST