ఆ పార్టీతో పొత్తు వల్లే ఎదగలేకపోతున్నాం...

ABN , First Publish Date - 2022-05-24T14:08:48+05:30 IST

రాష్ట్రంలో డీఎంకేతో పొత్తుపెట్టుకున్నందువల్ల తమ పార్టీ ఎదగలేకపోతున్నదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పరచుకున్న రాజకీయ పొత్తులు

ఆ పార్టీతో పొత్తు వల్లే ఎదగలేకపోతున్నాం...

                  - Tncc అధ్యక్షుడు అళగికి


చెన్నై: రాష్ట్రంలో డీఎంకేతో పొత్తుపెట్టుకున్నందువల్ల తమ పార్టీ ఎదగలేకపోతున్నదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పరచుకున్న రాజకీయ పొత్తులు కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి ఆటంకంగా మారాయన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ... మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష విధించబడిన పేరరివాలన్‌ను గాంధీ కుటుంబీకులు పెద్ద మనస్సుతో క్షమించారని, అయితే ప్రజలు కూడా అలాగే ఉండాలని భావించడం తప్పు అని చెప్పారు. తనను కాల్చిన గాడ్సేను క్షమించాలంటూ మహాత్మాగాంధీ తెలిపారని, అయితే చట్టం అతడిని ఉరితీసిందని చెప్పారు. ఆ రీతిలోనే పేరరివాలన్‌ విడుదలను సహించలేకపోతున్నామని, తమిళుడనే ఏకైక కారణంగా విడుదల చేయాలని చెప్పటం కూడా సమంజసంగా కాద హత్య చేసిన వ్యక్తిని విడిచిపెట్టడం భావ్యమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హత్యలు, దోపిడీలకు పాల్పడినవారు సుమారు 500ల నుంచి 600ల మంది ఖైదీలుగా 25 యేళ్లకు పైగా జైలులో ఉంటున్నారని, తమిళులైన వీరిని ఎందుకు విడుదల చేయకూడదని ప్రశ్నించారు.


కోవై పేలుడు నిందితుల్ని విడిపిస్తారా?

రాజీవ్‌ హత్యకేసులో మిగిలిన ఆరుగురు ముద్దాయిలను కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరగుతున్నట్టు తెలిసిందని, అలాంటప్పుడు 1998లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుడు కేసు నిందితులను కూడా విడుదల చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. పైగా ఆ బాంబు పేలుడు కేసు నిందితులపై అభియోగాలు ఇంకా నిరూపించబడలేదని, మరి వీరిని కూడా విడుదల చేయవచ్చన్న అళగిరి చట్టం న్యాయం అందరికీ సమానంగా వర్తింపజేయాలన్నారు. ఇలాంటి విరుద్ధభావాలున్నప్పటికీ డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య కూటమి ఏర్పాటైందని తెలిపారు. రెండు పార్టీల మధ్య విరుద్ధభావాలున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇలా సిద్ధాంత పరమైన విరుద్ధభావాలున్నా కూటమి చెక్కుచెదరలేదన్నారు. జాతీయ స్థాయిలో ఉమ్మడి శత్రువు (బీజేపీ)ని ఓడించేందుకు విరుధ్ధభావాలు కలిగిన పార్టీతో జతకట్టడం సహజమే కదా అని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో హత్యానేరానికి పాల్పడిన వ్యక్తిని పోటీపడి స్వాగతించడం ఆశ్చర్యంగా ఉందని అళగిరి పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు స్వీకరించినప్పటి నుంచి పలు విరుద్ధభావాలు తలెత్తాయని, అయితే వాటిని తాను ప్రోత్సహించలేదన్నారు. అందువల్లే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 72 శాతం విజయం లభించిందన్నారు. తనకున్న రాజకీయ అనుభవం ప్రకారం ఓ పార్టీ ఘనవిజయం సాధించాలంటే సొంత ఇమేజ్‌ మాత్రమే ఉంటే సరిపోదని, దానిని ఓట్లుగా మార్చుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. 1991లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇమేజ్‌ తారస్థాయిలో ఉండేదని, అప్పట్లో అన్నాడీఎంకే ఆ ఇమేజ్‌కు గండికొట్టిందన్నారు. పొత్తులు, కూటములు ఆయా పార్టీల ఎదుగుదలకు దోహదం చేయాలని అయితే రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవని, రాష్టంలో కుదుర్చుకున్న పొత్తులు కాంగ్రెస్‌ ను ఎదగకుండా చేశాయని, నిజం చెప్పాలంటే తమ పార్టీని బలహీనపరిచాయని అళగిరి తెలిపారు.


త్యాగాలకు సిద్ధం కావాలి...

రాష్ట్రంలో కాంగ్రెస్ ను అభివృద్ధిపరచాలంటే త్యాగాలు చేయాలని, కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో ఓటమి కూడా ఎదురవుతుందని అళగిరి వ్యాఖ్యానించారు. ప్రజలు వెంటనే పార్టీకి ఓటెయ్యరని, పార్టీ సొంత ఇమేజ్‌తో పటిష్టంగా ఉంటేనే ప్రజలు ఓటేస్తారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పార్టీ అభివృద్ధి కోసం పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికను, నిర్ణీత లక్ష్యాన్ని ఇప్పుడే రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అళగిరి  స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-24T14:08:48+05:30 IST