Alagiri: రేపిస్టులకు మద్దతిచ్చే మోదీ సర్కారుకు త్వరలో గుణపాఠం!

ABN , First Publish Date - 2022-08-25T14:27:00+05:30 IST

గుజరాత్‌లో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న 11 మంది రేపిస్టులను ముందుగానే విడుదల చేయించిన ప్రధాని

Alagiri: రేపిస్టులకు మద్దతిచ్చే మోదీ సర్కారుకు త్వరలో గుణపాఠం!

                          - టీఎన్‌సీసీ నేత అళగిరి ధ్వజం


చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న 11 మంది రేపిస్టులను ముందుగానే విడుదల చేయించిన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాకు త్వరలో దేశప్రజలు గుణపాఠం చెప్పనున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS Alagiri) ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన జారీ చేస్తూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడే నేరస్థుల శిక్ష తగ్గించడం, విడుదల చేయడం బీజేపీ పాలకులకు ఆనవాయితీగా మారిందని, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా గుజరాత్‌లో 2002లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా శిక్షను అనుభవిస్తున్న 11 మందిని ఒకే సారి విడుదల చేయించి, వారికి జైలు వద్ద స్థానిక బీజేపీ నేతలు స్వాగతం పలికారన్నారు. అత్యాచారానికి పాల్పడినవారిని విడుదల చేసిన బీజేపీ పాలకులు, ఆ ఘటనను ఖండిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసినవారిని అరెస్టు చేయించి వారిని విడుదల చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. అరెస్టయిన ఆందోళనకారులకు బెయిలు కూడా లభించకుండా బీజేపీ పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారని అళగిరి ఆరోపించారు. ఇక మోదీ, అమిత్‌షా(Modi, Amit Shah)లు గుజరాత్‌లో ముఖ్యమంత్రి, మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో మైనారిటీలు ఊచకోతకు గురయ్యారని, ఆ బాధితులకు ఇప్పటివరకూ న్యాయం జరుగలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-25T14:27:00+05:30 IST