Padayatra: రాజ్యాంగ ధర్మాసన రక్షణ కోసం 25న కాంగ్రెస్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-23T13:34:42+05:30 IST

భారత రాజ్యాంగ ధర్మాసనం పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌

Padayatra: రాజ్యాంగ ధర్మాసన రక్షణ కోసం 25న కాంగ్రెస్‌ పాదయాత్ర

చెన్నై, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ ధర్మాసనం పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(TNCC President KS Alagiri) ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ, న్యాయవ్యవస్థలపై అజామాయిషీ చేస్తూ ఆ సంస్థల ద్వారా ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ ధర్మాసనాన్ని కాపాడేందుకు, బీజేపీ  అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25 నుంచి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర చెన్నై నుంచి ప్రారంభమై శ్రీపెరుంబుదూరులో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకస్థలి వద్ద ముగియనుందని తెలిపారు. ఈ నెల 25 ఉదయం 10 గంటలకు  రాయపేటలోని పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో ఈ పాదయాత్ర ను తాను ప్రారంభిస్తానని వెల్లడించారు. పాదయాత్రలో పార్టీ సీనియర్‌ నేతలు పి.చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, జయరామ్‌ రమేష్‌ తదితరులు పాల్గొంటారని అళగిరి వివరించారు.

Updated Date - 2022-09-23T13:34:42+05:30 IST