Tncc అధ్యక్ష పీఠం దక్కేదెవరికో?

ABN , First Publish Date - 2022-05-29T13:28:15+05:30 IST

తమిళనాడు కాంగ్రెస్‌ (టీఎన్‌సీసీ) అధ్యక్ష పీఠం ఈసారి మహిళలకు కేటాయించడం ఖాయమైన తరుణంలో ఆ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిజానికి

Tncc అధ్యక్ష పీఠం దక్కేదెవరికో?

               - రేసులో విజయతరణి, జ్యోతిమణి


చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌ (టీఎన్‌సీసీ) అధ్యక్ష పీఠం ఈసారి మహిళలకు కేటాయించడం ఖాయమైన తరుణంలో ఆ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిజానికి ఇప్పటి వరకూ ఆ పదవిలో పురుషులే వున్నారు తప్ప, మహిళలు ఏనాడూ దానివైపు దృష్టి సారించలేదు. అయితే ఈసారి అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో వున్న కేఎస్‌ అళగిరి సైతం దీనిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం పలువురు మహిళలు పోటీ పడుతున్నారు. ఇందులో ఇద్దరు ముందు వరుసలో వున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కన్నియాకుమారి జిల్లా విలవన్‌గోడ్‌ నియోజకవర్గం నుంచి మూడుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజయతరణి, కరూర్‌ లోక్‌సభ సభ్యురాలు ఎస్‌.జ్యోతిమణి ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. ఇప్పటికే వీరిద్దరూ అధిష్ఠానంతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి వరుసగా మూడుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజయతరణి వైపే సీనియర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కానీ ఓ కీలకమైన సీనియర్‌ నేత మాత్రం ఉన్నత విద్యావంతురాలైన జ్యోతిమణికే ఇవ్వాలని అధిష్ఠానానికి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తోందన్న ఉత్కంఠ టీన్‌సీసీలో కొనసాగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగినప్పటికీ అధిష్ఠానం ఎవరి పేరు ఖరారు చేస్తే వారే ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందువల్ల అధిష్ఠానం ఎవరిని కరుణిస్తోందనన్న చర్చ జరుగుతోంది.

Updated Date - 2022-05-29T13:28:15+05:30 IST