మోదీపై అన్నామలై పగటికలలు!

ABN , First Publish Date - 2021-12-28T16:00:30+05:30 IST

దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపడతారంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పగటి కలలు కుంటున్నారని టీఎన్‌సీసీ

మోదీపై అన్నామలై పగటికలలు!

టీఎన్‌సీసీ నేత కేఎస్‌ అళగిరి

చెన్నై: దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపడతారంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పగటి కలలు కుంటున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ధ్వజమెత్తారు. స్థానిక రాయపేటలోని సత్యమూర్తిభవన్‌లో సోమవారం ఉదయం దివంగత మాజీ కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు డి. యశోద ప్రథమ వర్థంతి సభ అళగిరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌, కేవీ తంగబాలు, ఎంపీలు జ్యోతిమణి, ఎస్‌. తిరునావుక్కరసర్‌, ఎమ్మెల్యే సెల్వ పెరుంతగై, ఏఐసీసీ సభ్యుడు రంగభాష్యం, జిల్లా అధ్యక్షుడు ఢిల్లీబాబు, సుమతి అన్బరసు, తదితరులు పాల్గొని యశోద చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా అళగిరి మీడియాతో మాట్లాడుతూ 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకమై పోటీ చేయనున్నాయని, ఆ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడిన బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. అన్నామలై ఇటీవల మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని భాషాలకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారని, వాస్తవానికి అన్ని రాష్ట్రాలలో హిందీ భాషను నిర్బంధంగా అమలు చేయడానికి కేంద్ర నాయకులంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం ఆయనకు తెలియకపోవడం గర్హనీయమని అళగిరి అన్నారు. ఇక నీట్‌ పరీక్షల వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు లబ్ధ్దిపొందుతున్నారని అన్నామలై చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆ నీట్‌ పరీక్షల కారణంగా గ్రామీణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేదే జగమెరిగిన సత్యమని అన్నారు. 

Updated Date - 2021-12-28T16:00:30+05:30 IST