ప్రశాంతంగా Tnpsc పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-22T13:34:37+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-2, గ్రూపు-2ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం శనివారం రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 11.78 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ప్రశాంతంగా Tnpsc పరీక్షలు

- ఒక్కో పోస్టుకు 213 మంది అభ్యర్థుల పోటీ 

- 11.78 లక్షల మంది హాజరు


అడయార్‌(చెన్నై): రాష్ట్ర వ్యాప్తంగా గ్రూపు-2, గ్రూపు-2ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం శనివారం రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 11.78 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముఖ్యంగా ఒక్క పోస్టు కోసం ఏకంగా 213 మంది చొప్పున పరీక్ష రాశారని టీఎన్‌పీఎస్సీ ఛైర్మన్‌ బాలచంద్రన్‌ తెలిపారు. ఈ పరీక్షా ఫలితాలను జూన్‌ ఆఖరులో వెల్లడిస్తామని తెలిపారు. టీఎన్‌పీఎస్సీ గ్రూపు-2లో 116 ఖాళీలు, గ్రూపు-2ఏలో 5413 ఖాళీలతో కలుపుకొని మొత్తం 5529 పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్‌ జారీచేసినట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు  నెల రోజుల పాటు అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఈ పరీక్ష కోసం యూజీ, పీజీతో పాటు ఇంజనీరింగ్‌ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 11,78,175గా ఉందన్నారు. టీఎన్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జరిగిన రాత పరీక్షల్లో ఇంతమంది అభ్యర్థులు ఎప్పుడూ హాజరవలేదన్నారు. ఈ అభ్యర్థుల్లో మహిళలు 6,81,880గా ఉండగా, పురుషులు 4,96,247, థర్డ్‌ జెండర్‌ వర్గం వారు 48 మంది, 14,531 మంది దివ్యాంగులు ఉన్నారని టీఎన్‌పీఎస్సీ ఛైర్మన్‌ తెలిపారు. వీరందరికీ రాత పరీక్షను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామన్నారు. ఇందుకోసం మొత్తం 4,012 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో సూపర్‌వైజర్‌ చొప్పున మొత్తం 412 మందిని నియమించామన్నారు. వీరు కాకుండా 58,900 మంది ఇన్విజిలేటర్లు, 6,400 మంది చెకింగ్‌ స్టాఫ్‌, 993 మొబైల్‌ బృందాలు, 323 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో మొత్తం 71 వేల మంది సిబ్బందిని నియమించినట్టు వివరించారు. ఒక్క చెన్నైలోనే 1,15,843 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరైనట్టు చెప్పారు. ఉదయం 9.30కు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిసిందన్నారు. ప్రశ్నపత్రంలో జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 75 ప్రశ్నలు, టాలెంట్‌ టెస్ట్‌లో 25 ప్రశ్నలు, జనరల్‌ తమిళ్‌ లేదా జనరల్‌ ఇంగ్లీ్‌షలో 100 ప్రశ్నలు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉన్నాయన్నారు. ఇవన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నాయన్నారు. ఈ పరీక్షల నిర్వహణను స్థానిక బాడ్వేలోని టీఎన్‌పీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి వెబ్‌ కెమెరాల ద్వారా పరిశీలించామన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ఈ పరీక్షలు నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2022-05-22T13:34:37+05:30 IST