భయంగానే బడికి..!

ABN , First Publish Date - 2022-01-21T05:36:49+05:30 IST

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి.

భయంగానే బడికి..!
ఆదోని నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో ఇదీ పరిస్థితి

పిల్లలను పంపక తప్పడం లేదంటున్న తల్లిదండ్రులు
పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించని వైనం
కరోనా బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
బైర్లూటి గురుకులంలో ఎనిమిది మందికి వైరస్‌
ఆదోని మున్సిపల్‌ స్కూల్‌లో మరో విద్యార్థినికి..


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 20: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే సంక్రాంతి సెలవులు ముగిసి 17 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేది లేదని, కరోనా నివారణ చర్యలు తీసుకుంటూనే పాఠశాలలు నడుపుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. నిత్యం కేసులు పెరుగుతున్న దృష్ట్యా పిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విధిలేక గుండె ధైర్యం చేసుకుని పంపిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 4,389 ఉన్నాయి. వీటిలో 7.65 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు 1,411 ఉండగా.. 2,69,132 మంది విద్యార్థులు ఉన్నారు.

నిబంధనలు ఎక్కడ?

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించడం లేదు. చాలామంది మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడం లేదు. గతంలాగే ఒక్కో తరగతి గదిలో 50 నుంచి 70 మందికి పైగా విద్యార్థులను ఇరికిస్తున్నారు. ఒక  బెంచిలో ఇద్దరికంటే ఎక్కువ మందిని కూర్చోబెడుతున్నారు. తరగతి గదుల్లో, ప్రాంగణాల్లో తూతూ మంత్రంగా శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. కొవిడ్‌ రక్షణ కోసం గ్రాంట్‌ మంజూరు కావడం లేదు. నిధులు లేకుండా పాఠశాలలను ఎలా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయం భయంగా పాఠశాలలకు వెళుతున్నారు.

ఇటీవలి ఘటనలు కొన్ని

కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులు 14 మంది, ఉపాధ్యాయులు ఇద్దరికి కరోనా రావడంతో వీరు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని మూడు కార్పొరేట్‌ స్కూళ్లు, కల్లూరు మండలంలోని ఓ జడ్పీహెచ్‌ఎస్‌, పాతకల్లూరులోని ఓ ప్రైవేటు స్కూలు, ప్యాపిలి మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌, పగిడ్యాల పాఠశాల, కర్నూలులోని రెండు ప్రైవేటు కళాశాలల్లో 14 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ప్యాపిలి మండలం జలదుర్గం జడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఈ నెల 17న వీరికి శాంపుల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వ హించగా.. కరోనా నిర్ధారణ అయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఓర్వకల్లులోని ఆర్‌సీ ఎల్లారెడ్డి జూనియర్‌ కళాశాలలో ఇద్దరు లెక్చరర్లకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులతో పాటు లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. లక్షణాలు ఉన్న 11 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు.

పాఠశాలల్లో కరోనా కలకలం

ఆత్మకూరు రూరల్‌/ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి 20: జిల్లాలో గురువారం 9 మంది విద్యార్థినులకు కరోనా రావడం కలకలం రేపింది. ఆత్మకూరు మండలం బైర్లూటి గూడెంలోని గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొందరు విద్యార్థినులకు జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో బైర్లూటి పీహెచ్‌సీ వైద్యాధికారి పవన్‌కుమార్‌ వచ్చి 30 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురికి కరోనా పాటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే ముగ్గురు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ తేలింది. కిట్ల కొరత ఉండడంతో మిగతా వారికి పరీక్షలు చేయలేదు. ఆలాగే ఆదోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ నెల 17న తరగతి గదిలో ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో అక్కడే కుప్పకూలింది. వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి కొవిడ్‌ పరీక్ష చేయడంతో గురువారం పాజిటివ్‌ అని తేలింది. ఆత్మకూరు తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, ఎంపీడీవో మోహన్‌ కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి పవన్‌ కుమార్‌ పాఠశాలను సందర్శించారు. కరోనా సోకిన 8 మంది విద్యార్థులను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక కర్నూలు జీజీహెచ్‌లో ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది.

884 కరోనా పాజిటివ్‌ కేసులు

20.13 శాతానికి చేరిన పాజిటివిటీ

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 20: జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ సీజన్‌లో ఒకే రోజు అత్యధికంగా 884 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలో 588 శాంపుల్స్‌ సేకరించగా.. 214 మందికి వైరస్‌ సోకింది. నంద్యాల మున్సిపాలిటీలో 117, ఆదోని మున్సిపాలిటీలో 62, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 27, బనగానపల్లెలో 25, ఆలూరులో 23, పత్తికొండలో 22, బేతంచెర్లలో 22, కోవెలకుంట్లలో 19, ఎమ్మిగనూరు రూరల్‌లో 15, పగిడ్యాలలో 13, కోడుమూరులో 13, నంద్యాల రూరల్‌లో 14, గడివేములలో 12, డోన్‌ మున్సిపాలిటీలో 12, మహానందిలో 12, వెలుగోడులో 12, కౌతాళంలో 11, శ్రీశైలంలో 11, రుద్రవరంలో 11, శిరివెళ్లలో 10 కేసులు వచ్చాయి. గత రెండు రోజుల్లో 1,336 పాజిటివ్‌ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. గురువారం 20.13 శాతానికి చేరుకుంది.

Updated Date - 2022-01-21T05:36:49+05:30 IST