మార్పు రావాలంటే...

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

కొన్ని మొక్కలు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. కానీ ఏదో కొమ్మలో... ఎక్కడో కొంత పచ్చితనం కనిపిస్తుంది. ఆ మొక్కకు నీరు పోస్తే నెమ్మదిగా చిగురిస్తుంది. అచేతనంగా పడి ఉన్న వ్యక్తి శరీరం ఔషధాలకు ఏమాత్రం స్పందించినా చాలు...

మార్పు రావాలంటే...

కొన్ని మొక్కలు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. కానీ ఏదో కొమ్మలో... ఎక్కడో కొంత పచ్చితనం కనిపిస్తుంది. ఆ మొక్కకు నీరు పోస్తే నెమ్మదిగా చిగురిస్తుంది. అచేతనంగా పడి ఉన్న వ్యక్తి శరీరం ఔషధాలకు ఏమాత్రం స్పందించినా చాలు... ఆ రోగి బతకగలడనే ఆశ వైద్యుల్లో కలుగుతుంది. ఆరిపోయిన పొయ్యిలో నుసి మధ్య మిగిలిన చిన్న నిప్పురవ్వ ఉంటే చాలు... పొయ్యిని రగిలించవచ్చనీ, వంట చేసుకు తినవచ్చనీ ఆశ జనిస్తుంది. అంటే... ఏ పనిలోనైనా రవ్వంత అవకాశం కనిపించాలి. దారి కాచి, ప్రయాణికుల్ని చంపి, దోపిడీ సాగించిన ఒక బందిపోటు తన నివాసానికి వచ్చాక... తన పెంపుడు కుక్క రోగంతో ముద్ద ముట్టకపోతే తల్లడిల్లిపోతాడు. ఆ తల్లడిల్లే లక్షణం అతని మనస్సులో ఏ మూలనో ఎంతో కొంత ఉన్నా చాలు... ఆ తర్వాత అతనిలో కరుణను పెంపొందించడానికి, అతను తన దారి మార్చుకోడానికి. మార్పు రావాలంటే కావలసింది అదే. అలాంటి మినుకు మినుకుమనే ఆశ కనిపించకపోతే... వారిని మార్చలేం.


దేవదత్తుడు మహా అజ్ఞాని. ధర్మం తెలియని ధూర్తుడు. ‘‘అతను చివరకు తన దుశ్చర్యల వల్లే పతనమైపోతాడు, అంతరిస్తాడు’’ అని బుద్ధుడు చెప్పాడు. బౌద్ధ సంఘాన్ని చీల్చి, చివరికి ఒంటరివాడై, అర్థంతరంగా పతనమైపోయాడు దేవదత్తుడు.


‘‘భగవాన్‌! అతని జీవితం అలా ముగుస్తుందని మీకెలా తెలుసు?’’ అని అడిగాడు ఆనందుడు.

అప్పుడు బుద్ధుడు కోసల రాజధాని శ్రావస్తికి వెళ్తున్నాడు. దారిలో ఉన్న దండకప్ప అనే చిన్న పట్టణంలో ఆగాడు. ఆ ఉదయం అచిరావతీ నదీ తీరంలో ఉన్నప్పుడు ఆనందుడు ఈ ప్రస్తావన చేశాడు.


‘‘ఆనందా! ఏ వ్యక్తిలోనైనా వెంట్రుకవాసి అంత మంచితనం ఉంటే... అతను ఈనాడు కాకపోయినా, మరోనాడు మంచివాడుగా మారే అవకాశం ఉంటుంది. నేను ఎదుటివారి చిత్తాన్ని నా చిత్తంతో చూస్తాను. అలా వారి భవిష్యత్తును తెలుసుకుంటాను’’ అన్నాడు బుద్ధుడు.


మనం సాధారణంగా ఏ వ్యక్తిని చూసినా వారిలో మంచీ, చెడూ... రెండూ కనిపిస్తాయి. ఇవి ఆ వ్యక్తులలో మనకు తొలినాళ్ళలో కనిపించే లక్షణాలు. కొంత అనుభవం అయ్యాక... అతని చిత్తాన్ని అర్థం చేసుకొని చూస్తే మంచితనం కనిపించదు. చెడ్డతనమే కనిపిస్తుంది. కానీ... ఏదో ఒక మూల రవ్వంత మంచితనం మోడుబారకుండా మిగిలి ఉంటుంది. అలాంటి వ్యక్తి త్వరలో తన దోషాలు గ్రహించి, మంచివైపు మళ్ళుతాడు. భవిష్యత్తులో అతడు పతనం చెందడు. ‘‘అలాంటివాడు మంచి నేలలో పడ్డ మేలైన విత్తనంలాంటి వాడు’’ అంటాడు బుద్ధుడు. 


అలాగే ఇంకొకరిలో చెడ్డతనం కనిపించదు. మంచితనమే కనిపిస్తుంది. కానీ అతని మనసు మూలాల్లో చెడ్డతనం బీజరూపంలో మిగిలిపోయి ఉంటుంది. ‘‘అలాంటివారు భవిష్యత్తులో పతనం చెందుతారు. అలాంటివారు రాతినేల మీద పడిన మంచి విత్తనం లాంటివారు’’ అని చెప్పాడు బుద్ధుడు. 


‘‘మూడో రకం వారిలో... కొన్నాళ్ళకు మంచితనం అంతరిస్తుంది. చెడు కనిపిస్తుంది. కానీ వారి చిత్తమూలంలో మంచితనం ఉంటుంది. అయితే అది నిలకడ లేకుండా ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటివారు కూడా భవిష్యత్తులో చెడ్డవారుగానే మిగిలిపోతారు, పతనం చెందుతారు. వీరు బండరాయి మీద పడిన జ్వలించే బొగ్గుల్లాంటివారు. రాతిమీద పడిన బొగ్గు ఆ రాయిని రగిలించలేదు. తానే ఆరిపోతుంది. వేరొకరుంటారు... వారిలో చెడు అదృశ్యమవుతుంది. మంచి అభివ్యక్తం అవుతుంది. వారి చిత్తంలో ఒక మూల చెడ్డతనం ఉంటుంది. కానీ, అది ఆరిపోయే దశలో ఉంటుంది. అలాంటివారు భవిష్యత్తులో కుశలవంతులు (మంచివారు) అవుతారు.


పతనం చెందరు. అలాంటి వారు... గడ్డివాముపై పడిన జ్వలించే బొగ్గులలాంటి వారు. అవి జ్వాలను వృద్ధి చేసినట్టు, మంచితనం జ్వలిస్తుంది. ఇక మంచితనమే మిగిలిపోయి, వెంట్రుకవాసి అంత చెడ్డతనమైనా లేని చిత్తం కలిగినవారు... గడ్డి మీద పడిన, నిప్సు అంటని బొగ్గుల్లాంటివారు. వారు నిర్వాణం పొందగలరు’’ అంటాడు బుద్ధుడు. చిత్తంలో ఏమూలనైనా రవ్వంత చెడ్డతనం లేకుండా చేసుకోవడమే నిర్మల చిత్తం. ఇలా మనోవిశ్లేషణ ద్వారా భవిష్యత్తును గ్రహించే శక్తిగల మనో వైజ్ఞానిక దార్శనికుడు బుద్ధుడు. ఇదే బుద్ధుడి భవిష్య దర్శనం.


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST