కేంద్ర పథకాల సమాచారంతో రావాలి

ABN , First Publish Date - 2022-07-07T07:40:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలవుతున్న పథకాల వివరాలతో దిశ సమావేశానికి రావాలని పార్లమెంట్‌ సభ్యుడు, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌ ధర్మపురి అర్వింద్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

కేంద్ర పథకాల సమాచారంతో రావాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 6: కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలవుతున్న పథకాల వివరాలతో దిశ సమావేశానికి రావాలని పార్లమెంట్‌ సభ్యుడు, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌ ధర్మపురి అర్వింద్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఎఫ్‌వో సునీల్‌, సభ్యులు పాల్గొన్నారు. ఎజెండా అంశాల వారీగా చర్చ నిర్వహించగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే పథకాలకు ఎంతెంత నిధులు కేటాయిస్తున్నాయి. కేంద్రం ద్వారా వస్తున్న నిధుల ఖర్చు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్ని పనులు గ్రౌండింగ్‌ అయ్యాయి ఎన్ని పూర్తయ్యాయి అనే విషయాలతో పాటు ప్రతి పథకంలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఫసల్‌ బీమా యోజన కింద రైతులందరు ప్రీమియం చెల్లించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణం విషయంలో నాణ్యత పాటించాలేదని అందువల్లే గత వర్షాకాలం తుఫాను వల్ల చెక్‌డ్యాంలు కూలిపోయాయని ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో జవాబు చెప్పాలన్నారు. చెక్‌డ్యాంలు కూలీపోవడం వల్ల రైతులు నష్టపోయారని రైతులకు ఇంకా నష్టపరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జిల్లాలో 30కి పైగా చెక్‌డ్యాంలు మంజూరయ్యాయని కానీ, రాష్ట్ర ప్రభుత్వం తామే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. మధ్యాహ్న భోజనం అమలు సక్రమంగా జరగడంలేదని విద్యార్థులకు గుడ్లు అందించడంలేదని ఖచ్చితంగా విద్యార్థులకు గుడ్లు అందేలా చూడాలని డీఈవోకు సూచించారు. జిల్లాలో ఉగ్రవాద సంస్థలకు చెందిన శిక్షణ జరగడం ఆందోళనకరమని గతంలోనూ బోధన్‌ కేంద్రంగా నకిలీ పాస్‌పోర్ట్‌ల కుంభకోణం జరిగిందని అదేవిధంగా జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ విచ్చలవిడిగా జరిగి యువత చెడిపోయే ప్రమాదం ఉందని కావున అధికారులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలపట్ల ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయని అవసరమైతే రెవెన్యూశాఖ ద్వారా గట్టి చర్యలు తీసుకుంటాన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగినపుడు పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ను భాగస్వామ్యం చేయడంలేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా కలెక్టర్‌గా ప్రతి కార్యక్రమానికి తప్పకుండా ఆహ్వానిస్తున్నామన్నారు.  ఈ విషయంలో ప్రొటోకాల్‌ పక్కాగా అమలయ్యేలా చూస్తామన్నారు. ప్రొటోకాల్‌ అమలు విషయంలో ఎక్కడైనా ఉల్లంఘన జరిగిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ సభ్యుడు మాక్లూర్‌ ఎంపీపీ మాస్త ప్రభాకర్‌కు, బీజేపీ సభ్యుల మధ్య నిధుల విషయంలో మాటల యుద్ధం జరిగింది. కేంద్రం ద్వారా విడుదలవుతున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఎంపీ అన్నారు. సిరికొండ మండలంలో జీపీఆర్‌ లేకుండా వాటర్‌ షేడ్‌ల నిర్మాణం చేస్తున్నారని కడపకు చెందిన కాంట్రాక్టర్‌ వచ్చిపనిచేయడం ఏమీటని కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సెంట్రల్‌ ఫండ్‌ కింద జిల్లాలో జరుగుతున్న రోడ్ల వివరాలను ఆర్‌ అండ్‌ బి అధికారులు సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవనగర్‌, అడవి మామిడిపల్లి, మామిడి పల్లి వద్ద జరుగుతున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని, మాదవనగర్‌ రైల్వే బ్రిడ్జీ పనులను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని ఎంపీ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T07:40:30+05:30 IST