సాగు చేయాలా.. వద్దా..!

ABN , First Publish Date - 2022-08-18T06:27:10+05:30 IST

సాగర్‌ ఆయకట్టు రైతులు వరి సాగు విషయంలో ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. వరి పంటకు పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధర లభించకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.

సాగు చేయాలా.. వద్దా..!
సాగర్‌ కాలువలో ప్రవహిస్తున్న జలాలు

మాగాణిపై రైతుల సందిగ్ధం

గిట్టుబాటు లేకపోవడమే కారణం

దర్శి, ఆగస్టు 17 : సాగర్‌ ఆయకట్టు రైతులు వరి సాగు విషయంలో ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. వరి పంటకు పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధర లభించకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. మూడేళ్లుగా మాగాణి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో ఈ ఏడాది వరి సాగుకు నీరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాగు చేయాలా వద్దా.. ఇతర పంటలు వేసుకోవాలా అని ఆలోచనలో పడ్డారు. జిల్లాలో 4.5లక్షల ఎకరాల మాగాణి భూమి ఉంది. దర్శి ఎన్‌ఎస్‌పీ డివిజన్‌ పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో సాధారణంగా 60వేల ఎకరాల్లో వరిని సాగుచేస్తారు. మరో 40వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేస్తారు. గతేడాది వరి సాగుకు నీరు సక్రమంగా అందలేదు. దీంతో అధికశాతం భూముల్లో  ఆరుతడి, మెట్ట పైర్లను సాగుచేశారు. సాగు చేసిన కొద్దిపాటి వరి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాలు చవిచూశారు. ఎకరా వరిసాగుకు రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. కూలీలు, ఎరువులు, దుక్కుల ధరలు పెరగడంతో ఈ ఏడాది పెట్టుబడి మరింత అధికమయ్యే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడులు కూడా సక్రమంగా రావడం లేదు. గతేడాది వరి సాగు చేసిన రైతులకు ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ధాన్యం బస్తాను రూ.900 నుంచి రూ.1100 వరకు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ విధంగా రైతులకు గతేడాది పెట్టుబడులు కూడా రాలేదు. ఆరుగాలం కష్టించిన రైతుల శ్రమ వృథా అయింది.


కౌలుకు ముందుకు రావడం లేదు

కౌలురైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అప్పుచేసి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి రావటంతో మాగాణి చేసేందుకు కౌలురైతులు ముందుకు రావడం లేదు. దీంతో గతేడాది చాలాచోట్ల మాగాణి భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది కూడా వరి సాగుకు కౌలు రైతులు ఆసక్తి చూపడం లేదు. అందువలన మాగాణి భూములు కలిగిన రైతులు వరి పైరు సాగు చేయాలా? వద్దా? అన్న విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది ఇప్పటికే మాగాణి భూముల్లో సజ్జ, కంది, పెసర తదితర పైర్లు సాగు చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి పంటల సాగుకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ కాలువలకు జలాలు సరఫరా అవుతున్నాయి. ఆ నీటితో మంచినీటి చెరువులు నింపుతున్నారు. తర్వాత మేజర్లకు విడుదల చేస్తామని ఎన్నెస్పీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాగాణి రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి..


Updated Date - 2022-08-18T06:27:10+05:30 IST