పోలీసుల సోదాలు, ఏకపక్ష తీరుపై విమర్శలు

ABN , First Publish Date - 2021-11-26T06:44:06+05:30 IST

జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో భయాన్ని సృష్టించి వారిలో ఆత్మస్థైర్యం దెబ్బ తీయడానికే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొందరు పోలీసులు మూటకట్టుకుంటున్నారు.

పోలీసుల సోదాలు, ఏకపక్ష తీరుపై విమర్శలు
తనిఖీలకు పోలీసులు రావడంతో ఇంటిముందు రోడ్డుపై బైఠాయించి రోదిస్తున్న తెలుగుమహిళా రాష్ట్ర కార్యదర్శి స్వప్న

ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికేనా..?

మండిపడుతున్న టీడీపీ నేతలు

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఖాకీలు

అనంతపురం వైద్యం, నవంబరు25: జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో భయాన్ని సృష్టించి వారిలో ఆత్మస్థైర్యం దెబ్బ తీయడానికే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొందరు పోలీసులు మూటకట్టుకుంటున్నారు. ఇందుకు గురువారం జిల్లా కేంద్రంలో తెలుగు మహిళా నేతలు స్వప్న, విజయశ్రీ, తేజశ్విని, జానకి ఇళ్లపై ఏకకాలంలో దా డులు చేసి సోదాలు చేయడమే నిదర్శనం. శాసనసభలో వైసీపీ నాయకులు తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కంటతడి పెట్టారు. తమ నాయకుడు బాధపడడాన్ని సహించలేక ఆ పార్టీ తెలుగు మహిళలు వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండి స్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై వైసీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారని తెలుగు మహిళలపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు. స్టేషనకు రప్పించి హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు నిత్యం ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీనిపై అనేక సార్లు తెలుగు తమ్ముళ్లు, శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కానీ కేసులు కట్టలేదు. అప్పుడు ఈ చట్టం ఈ పోలీసులకు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదైనా కేసు నమోదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఏకంగా డీఎస్పీ వీరరాఘవరెడ్డితో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు తమ సిబ్బందిని వెంట బెట్టుకొని ఆ మహిళా నేతల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసి సోదాలు చేయడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయటం ఏంటన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అక్రమ ఆస్తులు ఉంటే ఇనకమ్‌ టాక్స్‌ యంత్రాంగం ఉంది. ఏసీబీ శాఖ ఉంది. వారు దాడి చేసి సోదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ లోకల్‌ పోలీసులు ఈ ఆస్తులపై సోదాలు చేయడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మహిళా నేతలు సాధారణ గృహిణులు. టీడీపీ అభిమానులు. అందుకే పార్టీ వారిని గుర్తించి పదవులు ఇచ్చింది. తమ పార్టీ నేతలను విమర్శించినప్పుడు ఆ పార్టీపై ఉన్న అభి మానంతో వీరు కూడా ప్రశ్నిస్తుంటారు. అయితే ఇక్కడ అధికార పార్టీ నేతలపై చెప్పరాని భాషతో మాట్లాడారని, దీనిపై కేసులు నమోదు చేశామని, ఈ నేపథ్యంలోనే చట్ట ప్రకారం ఆ మహిళా నేతల ఇళ్లలో సోదాలు చేశామని పోలీసులు చెబుతున్నారు. సోదాలు చేయడానికి వారేమి ఫ్యాక్షనిస్ట్‌లు కాదు. ఎవరినీ హత్య చేయలేదు. గతంలో క్రిమినల్‌ కేసులు లేవు. రౌడీషీటర్లు కాదు. సాధారణ మహిళలు. అలాంటి వారి ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేయడం ఎంత వరకు సమంజసమని  ప్రజానీకం పోలీ సులను ప్రశ్నిస్తున్నారు. ఆ మహిళా నేతల ఇళ్లపై పోలీసులు దాడి చేసినప్పుడు ఆ మహిళలు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అయినా  పోలీసులు ఎక్కడా పశ్చాత్తాపం చూపలేదు. గంటల తరబడి ఇళ్లలో కూర్చొని వారిని ప్రశ్నిస్తూ, బెదిరిస్తూ అన్నింటిని సోదాలు చేశారంటే ఇక్కడ అధికార పార్టీ నేతలకు ఈ పోలీస్‌ యంత్రాంగం ఎంతగా లొంగిపోయిందో అర్థమవుతోంది. చివరకు టీడీపీ శ్రేణులు, చుట్టపక్కల ఉన్న సామాన్య జనం పెద్దఎత్తున ఆ మహిళా నేతల ఇళ్ల వద్దకు చేరుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల బహిరంగంగానే విమర్శిస్తూ కనిపించారు. ఆ సమయంలో ఇళ్ల బయట బందోబస్తు ఉంటున్న పోలీసులు సైతం ఏం సమాధానం చెప్పలేక ప్రశ్నిస్తున్న వారిని శాంతింప చేయడానికి ప్రయత్నించడం కనిపించింది. టీడీపీ శ్రేణులైతే ఆవేశం తట్టుకోలేక పోలీసులతోనే వాగ్వాదానికి దిగగా వారిని పోలీస్‌ అధికారులు తీవ్రస్థాయిలోనే హెచ్చరిస్తూ కనిపించారు. దీన్ని బట్టే వైసీపీ నేతల కనుసన్నల్లో కొందరు పోలీసులు ప్రతిపక్ష శ్రేణులను భయభ్రాంతులను చేసేందుకు ఎలా వ్యవహరిస్తున్నారో తేటతెల్లం అవుతోంది. అయితే పోలీసు ల ఏకపక్ష తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. తెలుగు మహిళలకు అండగా  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, నాయకులు దేవళ్ల మురళీ, గౌస్‌మోద్దీన, సరిపూటి రమణ, వెంకటేష్‌గౌడ్‌, సుధాకరయాదవ్‌, మారుతీగౌడ్‌, గుర్రం నాగభూషణ, లింగారెడ్డి, మార్కెట్‌ మహేశ, గంగవరం బుజ్జి, శ్రీనివాస్‌చౌదరి, శేఖర్‌, బొమ్మినేని శివ, సరళ, వసుంధర, మహేశ్వరితో  పాటు పెద్దఎత్తున శ్రేణులు నిలిచారు. 


పోలీసులు ప్రకటనపైనా విమర్శలు

తెలుగు మహిళా నేతల ఇళ్లపై దాడుల అనంతరం పోలీసులు చేసిన ప్రకటనపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులను చెప్పలేని భాషలో దూషించడంతోనే కేసులు నమోదు చేశామని, అందులో భాగంగానే తెలుగు మహిళా నేతల ఇళ్లలో చట్ట పరంగా తనిఖీలు చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఈ తనిఖీలలో ఐదు సెల్‌ఫోనలు, మూడు బ్యాంక్‌ పాస్‌బుక్‌లు సీజ్‌ చేశా మని స్వప్న ఇంట్లో రూ4.36 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అంటే ప్రజాప్రతినిధులను చెప్పలేని భాషలో తిడితే కేసులు పెడతామని అం టున్నారు. మరి టీడీపీ ప్రజాప్రతినిధులపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు నోటికొచ్చినట్లు దుర్బాషలు తిడుతు న్నారు. దాడు లు చేస్తున్నారు. మరి వా రిపై ఎం దుకు ఈ పోలీసులు కేసు లు పెట్టడం లేదని, వారి ఇళ్లపై ఎందుకు దాడులు చేసి తనిఖీలు చేయడం లేదని ఇటు టీడీపీ శ్రే ణులు, అటు సామా న్య ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 











దర్యాప్తు ముసుగులో మూకదాడులు దుర్మార్గం

తెలుగు మహిళా నేతల ఇళ్లపై ఒకేసారి పోలీసులు దర్యాప్తు పేరుతో మూకదాడులు చేయడం దుర్మార్గం. ఈ దాడులు ముమ్మా టికి చట్టవ్యతిరేకం. అధికార పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కేసుల నమోదు చేయవచ్చు. కానీ ఉగ్రవాదుల ఇళ్లను చుట్టుముట్టినట్లు ఆ మహిళల ఇళ్లపై దాడి చేసి సోదాలు చేసి ఆస్తులు, నగలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడం హేయం. ఆ పోలీసులపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాం. అక్కడే సమాధానం చెప్పుకోవాలి. 

- కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి



 మూల్యం చెల్లించుకోకతప్పదు 

తెలుగు మహిళలపై అక్రమ కేసులు కట్టడమే కాక వారి ఇళ్లపై సోదాల పేరుతో పోలీసులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. భవిష్యత్తులో వీటన్నింటికి మూల్యం చెల్లించుకోక తప్పదు. టీడీపీ కార్యకర్తలను అణచడానికి ప్రయత్నిస్తే మరింత కసిగా పోరాటాలు సాగిస్తాం.

- జేఎల్‌ మురళీధర్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి


ప్రశ్నించడం తప్పా 

ప్రజాస్వామ్యంలో తప్పును ప్రశ్నించడం తప్పా. తమ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ సభ్యులు నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఏంటని తెలుగు మహిళలు ప్రశ్నించారు. వారు చట్టవిరుద్ధంగా మాట్లాడారని కేసులు పెట్టారు. స్టేషనకు వచ్చి వివరణ ఇచ్చారు. మరుసటి రోజు తెల్లావారుజామునే ఆ మహిళల ఇళ్లపై పోలీసులు దాడులు చేయడం బాధాకరం. ఇది మంచిది కాదు.

-  తలారి ఆదినారాయణ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 


వైసీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గం 

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించడం బాధాకరం. తెలుగు మహిళలు అధికార పార్టీ నేతలను విమర్శించారని కేసులు పెట్టడం వారి ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేయడం దుర్మార్గం. రేపు మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ఈ రోజు వేధించిన వారి సంగతి ఏంటో ఓ సారి ఆలోచించుకోవాలి. ఇలాంటి కేసులు, దాడులకు టీడీపీ సైనికులు భయపడరు. మరింత కసితో పోరాటం సాగిస్తాం. 

- బుగ్గయ్యచౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2021-11-26T06:44:06+05:30 IST