ధర్మాన్ని కాపాడమంటే..క్రిస్టియన్‌ సీఎంకు కోపమెందుకు?: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-01-22T09:23:40+05:30 IST

ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎందుకంత కోపమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు.

ధర్మాన్ని కాపాడమంటే..క్రిస్టియన్‌ సీఎంకు కోపమెందుకు?: లోకేశ్‌

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎందుకంత కోపమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. అన్ని మతాలనూ సమానంగా చూడాలని అంటే ఎందుకంత అసహనం? తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న అనుమతి ఇచ్చి ఈరోజు ఎందుకు రద్దుచేశారని నిలదీశారు. దేవాలయాలపై దాడులు, దళితులపై దమనకాండ, అన్నదాత ఆత్మహత్యలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చేపడుతున్న ధర్మ పరిరక్షణ యాత్రకు జగన్‌రెడ్డి మతం రంగు ఎందుకు పూస్తున్నారని గురువారం ట్విటర్‌లో ప్రశ్నించారు. కాగా.. ఏడు నెలలైనా తమకు న్యాయం జరగలేదంటూ చీరాల దళిత యువకుడు కిరణ్‌ తల్లిదండ్రులు లోకేశ్‌ను కలిశారు. కిరణ్‌కు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని.. వారి పోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని.. కిరణ్‌ను కొట్టిచంపిన పోలీసు అధికారులకు, వారిని కాపాడుతున్న వైసీపీ నాయకులకు శిక్షపడేవరకు ప్రత్యక్ష పోరాటం, న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ‘మానవ హక్కుల సంఘం, ఎస్సీ కమిషన్‌, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. జాతిరక్షణ కోసం దళితులందరూ ఒక్కటై.. జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలి’ అని పిలుపిచ్చారు.

Updated Date - 2021-01-22T09:23:40+05:30 IST