ప్రాణవాయువు అందించాలని..

ABN , First Publish Date - 2021-05-07T04:34:15+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఆక్సిజన్‌ కొరత విషయమే చర్చించుకుంటున్నారు. మీడియాలో ఇతర ప్రాంతాల్లో నెలకొన్ని పరిస్థితిపై వస్తున్న వార్తలతో ప్రజలు కంగారుపడుతున్నారు. మన జిల్లాలో కూడా ఒకసారి ఆక్సిజన్‌ కోసం ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లా కేంద్రాసుపత్రిలో ఉన్నఫలంగా ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది

ప్రాణవాయువు అందించాలని..
ఆక్షిజన్‌ సిలిండర్‌లను సరఫరా చేస్తున్న బొబ్బిలిలోని ఓ పరిశ్రమ

ఆక్సిజన్‌ కొరతను అధిగమించేదుకుచర్యలు

 కేంద్ర ఆసుపత్రిలో 10కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ 

జేసీ మహేష్‌కుమార్‌ పర్యవేక్షణలో నిర్ణయం

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఆక్సిజన్‌ కొరత విషయమే చర్చించుకుంటున్నారు. మీడియాలో ఇతర ప్రాంతాల్లో నెలకొన్ని పరిస్థితిపై వస్తున్న వార్తలతో ప్రజలు కంగారుపడుతున్నారు. మన జిల్లాలో కూడా ఒకసారి ఆక్సిజన్‌ కోసం ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లా కేంద్రాసుపత్రిలో ఉన్నఫలంగా ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో అధికారులు అప్రమత్తమయ్యారు. దశల వారీగా ఆక్సిజన్‌ నిల్వలను పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. గత నెల 26 నుంచి విడతల వారీగా జిల్లాలోని ఆసుపత్రులకు ఆక్సిజన్‌ నిల్వలను పంపిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇంతవరకు 1కేల్‌ సామర్థ్యం ఉన్న రెండు ఆక్సిజన్‌ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. వీటితో కొవిడ్‌ ఆసుపత్రుల్లోని ఐసీయూ, వెంటిలేటర్లపై ఉన్న వారికి వైద్య సేవలు అందుతున్నాయి. అయితే 2కేఎల్‌ ఆక్సిజన్‌ నిల్వలు ఒకరోజుకు మాత్రమే సరిపోతున్నాయి. ప్రతి రోజు వీటిని నింపాల్సి వస్తోంది. రీ ఫిల్లింగ్‌కు గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతోంది. ఆ సమయంలోనే బాధితులు ఆక్సిజన్‌ అందటం లేదంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 10కేల్‌ ఆక్సిజన్‌ నిల్వ ట్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పరిశ్రమల కేంద్రం నుంచి ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ నిల్వలను తెప్పించి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేయదలచిన 10కేల్‌ ట్యాంకులో నింపుతారు. తద్వారా మూడు రోజులు పైబడి ఆక్సిజన్‌ కొరత రానీయకుండా చూడాలన్నది అధికారుల వ్యూహం. ఈలోగా మళ్లీ నిల్వలను రప్పించి ఆ ప్రధాన ట్యాంకును రీ ఫిల్‌ చేయటం ద్వారా ఇబ్బందులను అధిగమించాలనుకుంటున్నారు. 

 ఫ  పార్వతీపురంలోని ఏరియా ఆసుపత్రి, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీల్లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఇంతవరకు ప్రధాన ట్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ అందించే ఏర్పాట్లు లేవు. డీ టైప్‌ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారీ ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ నిల్వలను తెప్పించినా దీని నుంచి మళ్లీ చిన్న చిన్న సిలిండర్లలో రీ ఫిల్లింగ్‌ చేసేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇందుకోసం జేసీ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లోని పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ నిల్వలను రప్పిస్తున్నారు. ఫెర్రో పరిశ్రమల్లో మండించేందుకు ఆక్సిజన్‌ను వినియోగిస్తారు. ఈ ఆక్సిజన్‌ నాణ్యతను కూడా పరిశీలించారు. 99.9 నాణ్యత ఉన్నట్లు గుర్తించారు. మెడికల్‌ ఆక్సిజన్‌గా 99.4 నాణ్యత వరకు వాడుతున్నారు. ఈ పరిస్థితిలో బొబ్బిలిలోని ఫెర్రో పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ను డి టైప్‌ సిలిండర్లను తెప్పిస్తున్నారు. వీటిని పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు వివిధ మండలాల్లో ఉన్న సీహెచ్‌సీలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా ఆక్సిజన్‌ కొరత రానీయకుండా ప్రస్తుత విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు అన్ని కోణాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నట్లు జేసీ మహేష్‌కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆ రెండు పరిశ్రమల నుంచి వంద సిలిండర్లు తీసుకువచ్చారు. ఇంకా 350 సిలిండర్లు తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిని రప్పించడం ద్వారా సీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ ఇబ్బందులు రానీయకుండా చూస్తామన్నారు.

ఒడిశా నుంచి తేవాలని..

 ఒడిసా రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పరిశ్రమలతో సంప్రదించారు. ఖాళీ ట్యాంకర్‌ను పంపించి అక్కడి నుంచి ఆక్సిజన్‌ తీసుకు వచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒడిశా నుంచి 20 కేఎల్‌ ఆక్సిజన్‌ నిల్వలను తెప్పించుకునే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం కూడా కార్యరూపం దాల్చితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న 28 కొవిడ్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ కొరత ఉండదు. ఆక్సిజన్‌ నిల్వల కోసం ఎవరూ ఆందోళన చెందవద్దు.

                            - మహేష్‌కుమార్‌, జేసీ


Updated Date - 2021-05-07T04:34:15+05:30 IST