కొవిడ్‌ మరణమే అయినా.. నిరూపించేదెలా?

ABN , First Publish Date - 2021-12-07T07:22:51+05:30 IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల పరిహారం పొందడానికి నిబంధనలే అడ్డంకిగా మారాయి! క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండా నిబంధనలు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పేద, మధ్యతరగతి కుటుంబాలు పరిహారానికి దూరమవుతున్నాయి. నిబంధనల ప్రకారం.. బాధిత కుటుంబసభ్యులు కొవిడ్‌..

కొవిడ్‌ మరణమే అయినా.. నిరూపించేదెలా?

  • రూ.50 వేల పరిహారం కోసం దరఖాస్తుకు
  • ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరంటున్న ప్రభుత్వం 
  • డెత్‌ సర్టిఫికెట్‌లో ‘కొవిడ్‌’ మరణం అని ఉండాల్సిందే!
  • రాష్ట్రంలో సీటీ స్కాన్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులతో
  • నిర్ధారించిన కరోనా కేసుల సంఖ్య లక్షల్లోనే!
  • వారిలో చాలా మందికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క
  • ఇంట్లోనే చికిత్స పొందుతూ మరణించిన వైనం
  • ఆస్పత్రిలో కొవిడ్‌కు చికిత్స పొంది మృతిచెందినా..
  • చాలా మరణాలు కోమార్బిడిటీస్‌ జాబితాలోకే
  • తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు
  • వేలాది కుటుంబాలు పరిహారానికి అనర్హం
  • కొవిడ్‌ మృతుల సంఖ్య సవరణా పట్టని సర్కారు
  • సవరించిన గణాంకాలను ప్రకటిస్తున్న పలు రాష్ట్రాలు


నిజామాబాద్‌కు చెందిన రాజమల్లు (55) దినసరి కూలీ. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్‌ బారిన పడ్డారు. ఆ విషయం సీటీ స్కాన్‌లో నిర్ధారణ అయింది. చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లగా.. పడకలు ఖాళీ లేవంటూ తిప్పిపంపారు.  ప్రైవేటులో చికిత్స చేయించుకునే స్థోమత లేక ఇంట్లోనే చికిత్స పొందుతూ మరణిం చడంతో ఆయనపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డునపడింది. ప్రభుత్వ పరిహారం కోసం దరఖాస్తు చేద్దామంటే.. ఈ కుటుంబం వద్ద ఎలాంటి ఆధారమూ లేదు.


హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సుబ్బారావు ఒక ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు కొన్నాళ్లుగా కాలేయ సమస్య ఉంది. కానీ, మందులు వాడుకుంటూ బాగానే ఉన్నారు. కానీ, ఈ ఏడాది మే నెలలో ఆయన కరోనా బారినపడి.. ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిని, శాచ్యురేషన్‌ 30కి పడిపోయి శ్వాస ఆడక చనిపోయారు. కానీ, వైద్యులు ఆయన మరణధ్రువీకరణ పత్రంలో కాలేయ సమస్యతో చనిపోయినట్లు రాశారు. ఇంటిపెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈయనకు ఆర్టీపీసీఆర్‌ టెస్టు రిపోర్టు ఉన్నా.. కొవిడ్‌తో మరణించినట్లు డెత్‌సర్టిఫికెట్‌లో లేకపోవడంతో పరిహారం వచ్చే పరిస్థితి లేదు.


హన్మకొండ జిల్లా కాజీపేట దర్గాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మృతిచెందారు. ఇంట్లోని అజ్మతున్నిసా బేగంకు (50) తొలుత కొవిడ్‌ సోకింది. చిక్సితకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్తే పడకలు ఖాళీగా లేవంటూ తిరిగి పంపించేశారు. ప్రైవేటు ఆస్పపత్రికి వెళ్లే స్తోమత లేకపోవడంతో ఇంట్లోనే చికిత్స చేశారు. ఈమె ద్వారా ఇంట్లోని మరో ముగ్గురికి కరోనా సోకింది. నలుగురూ నాలుగు రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏ ఒక్కరికీ కొవిడ్‌ సోకినట్టు ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు లేదు. ఆస్పత్రి మరణ ధ్రువీకరణ పత్రం లేదు. దీంతో ఒకే కుటుంబంలో నాలుగు మరణాలు సంభవించినా.. వీరు ప్రభుత్వ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి.


(ఆంధ్రజ్యోతి-హైదరాబాద్‌)

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల పరిహారం పొందడానికి నిబంధనలే అడ్డంకిగా మారాయి! క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండా నిబంధనలు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో పేద, మధ్యతరగతి కుటుంబాలు పరిహారానికి దూరమవుతున్నాయి. నిబంధనల ప్రకారం.. బాధిత కుటుంబసభ్యులు కొవిడ్‌ మృతుడికి సంబంధించి ఆధార్‌ కార్డు, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు లేదా కొవిడ్‌ చికిత్స పొందిన ఆస్పత్రి డిశ్చార్జి పత్రం, కొవిడ్‌ కారణంగా మరణించినట్లుగా ఉన్న మరణ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. ఈ వివరాలతో ‘మీసేవ’ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కూడిన జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీ పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం రూ.50 వేల పరిహారాన్ని ఇస్తుంది. దరఖాస్తులు అందిన 30 రోజుల్లోపు త్రిసభ్య కమిటీ ధ్రువీకరణ పత్రాలను అందించాల్సి ఉంది.


ఈ మొత్తం ప్రక్రియలో కొవిడ్‌తో మరణించినట్టు నిరూపించడమే అత్యంత కీలకం. ఎందుకంటే.. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. భారీగా కేసులు నమోదయ్యాయి. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించేందుకు ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకే అనుమతి ఇవ్వడంతో.. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు భారీగా చేసింది తప్ప ఆ సంఖ్యతో పోలిస్తే ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య చాలా తక్కువ. దీంతో లక్షలాది మంది సీటీ స్కాన్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల ద్వారా కొవిడ్‌ నిర్ధారణ చేయించుకుని ఇంట్లోనే చికిత్స పొందారు. వారిలో చాలా మంది మరణించారు. కొవిడ్‌తో చనిపోయినా.. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టు, ఆస్పత్రి డిశ్చార్జి పత్రం లేని కారణంగా ఇలాంటి వారి కుటుంబసభ్యులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.


రిపోర్టు ఉండి చికిత్స పొందినా..

కొవిడ్‌ బారినపడి.. ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుని, అందులో పాజిటివ్‌ వచ్చి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినవారికి కూడా.. వారికి అప్పటికే గుండెజబ్బు, కాలేయ, మూత్రపిండ వ్యాధులు, మధుమేహం, అధికరక్తపోటు వంటివి ఉంటే వాటితో మరణించినట్టుగా వైద్యులు నమోదు చేశారు. అంతే తప్ప వారి మరణానికి కరోనా కారణమని నమోదు చేయలేదు. డెత్‌ సర్టిఫికెట్‌లో అలా ఉంటే.. ప్రభుత్వం నియమించిన జిల్లాస్థాయి కొవిడ్‌ నిర్ధారణ త్రిసభ్య కమిటీ ఆ మరణాలను కొవిడ్‌ మరణాలుగా గుర్తించట్లేదు. దీంతో ఆయా మృతుల కుటుంబాలు పరిహారానికి అనర్హంగా మిగిలిపోతున్నాయి.


సవరణ లేనట్టేనా? 

కరోనా సెకండ్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా కేసులతో పాటు మృతుల సంఖ్య సైతం భారీగానే నమోదైంది. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం వరకు దేశవ్యాప్తంగా 3.46 కోట్ల కొవిడ్‌ కేసులు నమోదవ్వగా 4.74 లక్షల మంది మరణించారు. అయితే కొవిడ్‌ మృతుల సంఖ్యను తక్కువగా చూపెడుతున్నాయంటూ తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కొవిడ్‌ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య తక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి బృందం గత ఏడాది జూలైలో ఎర్రగడ్డ శ్మశానవాటిక వద్దకు ఒక్కరోజులో ఎన్ని ఆంబులెన్స్‌లు వస్తున్నాయో పరిశీలించి, కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని పరిశోధనాత్మక కథనం కూడా ప్రచురించింది. ‘‘ఈ ఏడాది (2021) ఏప్రిల్‌ 1 నుంచి 21 నడుమ రాష్ట్రంలో 198 మంది చనిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. కానీ, ఎన్నో రెట్ల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. శ్మశానవాటికల్లో కట్టెలకు కొరత ఏర్పడడంతో సామూహిక దహనాలు చేస్తున్నారు.’’


అంటూ ఏప్రిల్‌ 23న హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసిన పరిస్థితి. మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయంటే ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేసిందనుకున్నా.. కొవిడ్‌తో మరణించినా డెత్‌ సర్టిఫికెట్‌లో ఆ విషయం నమోదు కానివారికి ఇప్పుడు న్యాయం చేసే పరిస్థితి ఉందా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 6.77 లక్షల కొవిడ్‌ కేసులు నమోదవగా.. సోమవారం నాటికి మృతుల సంఖ్య 3999గా ఉంది. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే కరోనా మరణాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు.. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్‌, కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించిన అధికారిక మృతుల సంఖ్యను సవరించాయి. ఉదాహరణకు.. కేరళ, బిహార్‌ సవరించడంతో ఆదివారంనాడు దేశంలో కరోనా మరణాల సంఖ్య శనివారంతో పోలిస్తే 615ు పెరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ అలాంటి కసరత్తు ఏదీ చేస్తున్నట్టు కనిపించట్లేదు. కొవిడ్‌ గణాంకాల సవరణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. రాష్ట్రంలో కొవిడ్‌ వల్ల ఎందరో చనిపోయారు.


వారి పిల్లలు అనాథలైపోయారు. ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థికంగా సర్వనాశనమయ్యాయి. కరోనా కాటుకు బలైన కుటుంబాలు తమవారి కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే.. రూ.50 వేలు పరిహారం తక్కువే. కానీ.. ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల అది కూడా వచ్చే పరిస్థితి కూడా లేకపోవడమే విషాదం. వారి దుస్థితిని అర్థం చేసుకుని, ఇప్పటికైనా నిబంధనలు మార్చాలని.. ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్‌ వచ్చి, ఆస్పత్రిలో కొద్దిరోజులపాటు చికిత్స పొంది మరణించినవారికి కోమార్బిడిటీస్‌ ఉన్నప్పటికీ పరిహారం వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-12-07T07:22:51+05:30 IST