రైస్‌ మిల్లర్లకు.. గడ్డు కాలమే!

ABN , First Publish Date - 2021-12-05T05:01:48+05:30 IST

ప్రతీ యాసంగి సీజన్‌లో వరి సాగు చేయవద్దని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. మరోవైపు ఇకపై ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదంటూ కేంద్రప్రభుత్వం సూచిస్తోంది.

రైస్‌ మిల్లర్లకు.. గడ్డు కాలమే!
బాయిల్డ్‌ రైస్‌మిల్లు

- వరి సాగు వద్దంటున్న ప్రభుత్వాలు

- ఆందోళనలో జిల్లా రైస్‌మిల్లర్లు

- సంక్షోభంలో పడనున్న బాయిల్డ్‌ రైస్‌మిల్లులు

- జిల్లాలో 35 వరకు బాయిల్డ్‌ రైస్‌మిల్లులు

- ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టిన మిల్లుల యాజమాన్యాలు

- ఆందోళనలో రైస్‌మిల్లుల కార్మికులు


కామారెడ్డి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రతీ యాసంగి సీజన్‌లో వరి సాగు చేయవద్దని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. మరోవైపు ఇకపై ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే ప్రసక్తే లేదంటూ కేంద్రప్రభుత్వం సూచిస్తోంది. ఈ  నేపథ్యంలో పలు రైస్‌మిల్లులకు రానున్న రోజుల్లో గడ్డుకాలమే ఏర్పడనుంది. ప్రధానంగా బాయిల్డ్‌ రైస్‌మిల్లులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే యాసంగి నుంచి రైస్‌మిల్లులు సంక్షోభంలో పడనున్నాయి. అంతేకాకుండా రైస్‌మిల్లులు మూతపడే అవకాశం ఉందని పలువురు మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుచేసి బాయిల్డ్‌ రైస్‌మిల్లులను ఏర్పాటు చేశామని ఇప్పుడు సడెన్‌గా వరి సాగు చేయవద్దంటే మిల్లర్ల పరిస్థితి ఏమిటని పలువురు యజమానులు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యాలపైనే కాకుండా వందలాది మంది ఉపాధి పొందుతున్న మిల్లుల్లోని కార్మికులు సైతం ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దశల వారిగా వరి సాగును తగ్గిస్తే ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే అవకాశం ఉంటుందని మిల్లర్ల యజమానులు కోరుతున్నారు.

జిల్లాలో 185కు పైగా రైస్‌మిల్లులు

జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్‌ల పరిధిలో సుమారు 180కి పైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో 135 రా రైస్‌మిల్లులు ఉండగా మరో 35 మిల్లులు బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. వానాకాలం, యాసంగి సీజన్‌లలో రైతులు సాగు చేసిన వరి పంటను ఈ మిల్లులకు అధికారులు తరలించి మర ఆడించి తిరిగి ఎఫ్‌సీఐకి కేటాయిస్తూ వస్తున్నారు. జిల్లాలో రెండు టన్నుల నుంచి 8 టన్నులకు కెపాసిటి ఉన్న రైస్‌మిల్లులు ఉన్నాయి. ఒక్కో రైస్‌మిల్లుకు కెపాసిటి ప్రకారం 15వేల మెట్రిక్‌ టన్నుల నుంచి మొదలుకొని 60వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి మిల్లర్లు అందించాల్సి ఉంటుంది. మర ఆడించినందుకు ప్రభుత్వం మిల్లులకు డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. ఇలా మిల్లర్లతో పాటు అందులో పనిచేసే కార్మికులకు ఉపాధి పొందుతూ వస్తున్నారు.

వరి సాగు వద్దంటున్న ప్రభుత్వాలు

జిల్లాలో లక్షల ఎకరాలలో వరి పంట సాగవుతూ వస్తోంది. వానా కాలం, యాసంగి సీజన్‌లలో సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌ కింద బోర్‌ బావుల కింద, చెరువుల కింద వేల ఎకరాల్లోనే రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో వరి సాగుతో పాటు దిగుబడులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వరి సాగుకు దగ్గట్టుగా రెండు సీజన్‌లలో కలిపి సుమారు 7 లక్షల మెట్రిక్‌ టన్నులలో ధాన్యం ఉత్పత్తులు వస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తుంటారు. ప్రతీ ఏట ప్రభుత్వమే ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు కేటాయిస్తుంటారు. ఈ మిల్లుల నుంచి తిరిగి ప్రభుత్వం సేకరించి రాష్ట్రంలోని ఆయా అవసరాలతో పాటు మిగిలిన బియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ వస్తోది. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలు పేరుకుపోవడం, పలు రాష్ట్రాల్లో స్వయం సమృద్ధిగా వరిని సాగు చేసుకుంటున్నారు. దీంతో కేంద్రం ఇకపై ఉప్పుడు బియ్యాన్ని తీసుకోమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం వరి పంటను సాగు చేయవద్దని సూచిస్తోంది. వాపాకాలం సీజన్‌లో సాగైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని యాసంగిలో సాగుచేసే ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచిస్తోంది. 

సంక్షోభంలో రైస్‌మిల్లులు

రైస్‌మిల్లులు ప్రధానంగా వరి పంటపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి తిరిగి బియ్యాన్ని ఇస్తుంటారు. ఇందుకు గాను ప్రభుత్వం మిల్లర్లకు డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలు విపరితంగా పెరిగిపోవడంతో ఉప్పుడు బియ్యాన్ని ఇకపై సేకరించబోమని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వానా కాలంలో సాగయ్యే వరి ధాన్యానికి సంబంధించిన రా బియ్యన్ని మాత్రమే కేంద్రప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేస్తూ వస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం వానా కాలం యాసంగి సీజన్‌లకు సంబంధించి రా రైస్‌తో పాటు ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇకపై యాసంగి సీజన్‌లో కేటాయించే ఉప్పుడు బియ్యాన్ని తీసుకోమని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేసే వీలు లేదు. యాసంగిలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లులకు కేటాయించి బాయిల్డ్‌ రైస్‌గా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఎఫ్‌సీఐకి కేటాయించేది. కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ను తీసుకోబోమని చెప్పడం, రాష్ట్రప్రభుత్వం వరి సాగు చేయవద్దని ప్రకటించడంతో పలు రైస్‌మిల్లులు సంక్షోభంలో పడనున్నాయి.

మూత పడనున్న బాయిల్డ్‌ రైస్‌మిల్లులు

వరి సాగు చేయవద్దని, ఇకపై బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని ప్రభుత్వాలు చెప్పడంతో బాయిల్డ్‌ రైస్‌మిల్లుల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఉప్పుడు బియ్యం కోసమే ఏర్పాటు చేసిన బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు రానున్న రోజుల్లో మూతపడే అవకాశం ఉంది. ప్రతీ వానా కాలం, యాసంగి సీజన్‌లలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఉప్పుడు బియ్యాని కోసం బాయిల్డ్‌ రైస్‌మిల్లుర్లు కేటాయిస్తుంటారు. జిల్లాలో 35కు పైగా బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వమే కమీషన్‌ కింద బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు ధాన్యంను కేటాయిస్తుండడంతో పలువురు మిల్లర్లు కోట్లు ఖర్చుచేసి కొత్త బాయిల్డ్‌ రైస్‌ మిల్లులను ఏర్పాటు చేశారు. సడెన్‌గా వరి సాగు చేయవద్దని బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని చెప్పడంతో ఈ రైస్‌మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. యాసంగిలో వరి సాగు చేయకుంటే ఈ మిల్లులు మూత పడుతాయని బాధిత యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మిల్లులను నమ్ముకొని చాలా మంది కార్మికులు సైతం ఉపాధి పొందుతున్నారని వారి కుటుంబాలు కూడా రోడ్డున పడాల్సి వస్తోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.


Updated Date - 2021-12-05T05:01:48+05:30 IST